Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

యాంటీ జగన్

యాంటీ జగన్

ఆధునిక రాజకీయాల్లో వ్యూహప్రతివ్యూహాలు కూడా చాలా కొత్త పోకడలు పోతుంటాయి. రాజకీయాల్లో నైతిక విలువలు లుప్తమైపోయిన తర్వాత.. మన విజయానికి అనుగుణంగా వ్యూహరచన చేసుకోవడం మాత్రమే కాదు. ప్రత్యర్థి పతనాన్ని లక్ష్యించి వ్యూహరచనకు ప్రయత్నించే పెడపోకడలు కూడా సర్వసాధారణం అయిపోయాయి. ఈ దశ కంటె కొంచెం ‘ఎడ్వాన్స్‌డ్’ వక్ర రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క దానినే తతిమ్మా రాజకీయ పక్షాలు అన్నీ లక్ష్యంగా ఎంచుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ మీద ఉన్నవీ లేనివీ అనిపించినవీ... అన్నిరకాల దుష్ట అంశాలను ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా ఆ పార్టీని సమూలంగా భ్రష్టు పట్టించేయాలని మిగిలిన పార్టీలు తహతహలాడిపోతున్నాయి. తెలుగుదేశం ఒక్కటే అనడానికి వీల్లేదు. కాంగ్రెసు వారు తిట్టిపోయడంలో వింత లేదు. కాకపోతే.. ఇన్నాళ్లు పెద్దగా జగన్ వ్యవహారాల్లో స్పందించకుండా మిన్నకున్న కొన్ని పార్టీల వారు కూడా అచ్చంగా తెలుగుదేశం ప్రవచించే మాటలనే తమ భుజస్కంధాల మీద మోస్తూ..  ఆరోపణలు సంధిస్తుండడం చూస్తే.. ఈ వ్యూహాత్మక కుట్రను అందరూ సమష్టిగానే నడిపిస్తున్నట్లు అర్థమవుతోంది.

శోచనీయమైన విషయం ఏంటంటే.. యెల్లోమీడియాగా పేరుమోసిన మీడియా సంస్థలు కూడా ఒక వ్యూహాత్మక దుష్ర్పచారాన్ని ఉద్యమసదృశంగా భుజానికెత్తుకున్నాయి. ‘వైకాపా పనైపోయింది’ ‘నీటిబుడగ అని తేలిపోయింది’ అనేది మాత్రమే వారి ఏకసూత్ర ఎజెండా. ఆ అంశాన్ని ప్రజల మెదళ్లలోకి సత్యస్వరూపంగా చొప్పించడానికి వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి ఒకరిని ఒకరు అసహ్యించుకునే కొన్ని రాజకీయ పార్టీలను కూడా ‘యాంటీ జగన్’ అనే సూత్రంతో ముడిపెట్టడానికి మీడియా సంస్థలే పౌరోహిత్యం నెరపుతున్నాయంటే.. అది జగన్ వ్యతిరేక కూటమిలో భావదారిద్య్రానికి పరాకాష్ట. 

వైఎస్ జగన్మోహనరెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ సాధించగల స్థాయిలో అనుకూల పవనాలు ఉన్నాయంటే.. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయదలచుకుంటున్న తెలుగుజాతి యావత్తూ.. ఏకపక్షంగా.. జగన్మోహనరెడ్డి పాలనా సామర్థ్యాల మీద అచంచల విశ్వాసంతో ఆయన కోసం వెంపర్లాడుతున్నదని అనుకోవడానికి వీల్లేదు. జగన్ రాష్ట్రంలో పేదలు ఎదుర్కొంటున్న యావత్తు సమస్యలను తన చేత్తో తుడిచి పారేస్తారని.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేస్తారని... ఆయన అనుపమాన పరిపాలన దురంధరుడని... రాష్ట్రానికి పట్టిన సకల అరిష్టాలను రూపుమాపేస్తారని యావత్తు ప్రజానీకం విశ్వసిస్తున్నదని అనుకుంటే పొరబాటు. అయితే వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రజల్లో సానుకూలత ప్రబలంగా ఉండడానికి, ఏర్పడడానికి  దారితీసిన పరిస్థితులు అనేకం ఉన్నాయి. 

1) కాంగ్రెస్ నిస్తేజత 

కాంగ్రెస్ పార్టీ తన అచేతన పాలనా వైదుష్యంతో ప్రజల్లో పెంచుకున్న అపనమ్మకం అతి ప్రధానమైదని చెప్పుకోవాలి. మరోసారి కాంగ్రెసు పార్టీ చేతికి అధికార పగ్గాలను అందించి, ఆ వేడుక భరించడానికి ప్రజానీకం సన్నద్ధంగా లేదన్నది వాస్తవం. పాలకపక్షం మీద ప్రజల్లో అంతగా వెరపు ఉన్నట్లయితే సహంగా ప్రజల మన్నన ప్రధాన ప్రతిపక్షంవైపు మరలాలి కదా, జగన్‌కు అనుకూలాంశం కావడంలో మతలబు ఏమిటి? అని ఎవ్వరికైనా అనిపించవచ్చు. 

2) తెలుగుదేశం వరుస వైఫల్యాలు

రాష్ట్రం సంక్లిష్ట సంధి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న సమయంలో నిర్ణయాత్మకంగా నిర్దిష్టంగా వ్యవహరించవలసిన తెలుగుదేశం పార్టీ తన ప్రధాన బాధ్యతను గాలికొదిలేసిందన్నమాట వాస్తవం. చంద్రబాబునాయుడు ఎంతగా గొంతు చించుకున్నా సరే.. ఆయన ప్రజలకోసం అంటూ ప్రారంభించినవన్నీ అల్పాయుష్షు ఉద్యమాలుగానే ముగిశాయి. ఏదో జనప్రీతికి అన్నట్లుగా ఓ ఉద్యమాన్ని ప్రకటించడమూ తెరలేపడమూ.. ఆ వెంటనే దానికి అర్థంతరంగా మంగళం పలకడమూ తప్ప చంద్రబాబు సాధించింది ఏమీ లేదన్నది నిష్ఠుర సత్యం. ముదిమి వయసులో సాగించిన పాదయాత్ర ఒక్కటీ చంద్రబాబును అభినందనలకు పాత్రం చేసేది. అయితే సదరు పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల కడగండ్లను, కష్టాలను ఏం కనిపెట్టి వాటి పరిష్కారానికి ఏం చొరవ చూపించారో.. ఏం ప్రణాళిక రచించారో మాత్రం ఇవాళ్టికీ నిగ్గు తేలలేదు. పాదయాత్ర ప్రారంభించిన రోజున చంద్రబాబు నాయుడు ఎలాంటి పడికట్టు హామీలు, వాగ్దానాలతో ప్రజలను బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తూ సాగారో.. పాదయాత్ర ముగిసే రోజు కూడా అవే మాటల గారడీకి కట్టుబడ్డారు. మరి అలాంటప్పుడు అంత సుదీర్ఘ పాదయాత్రలో ఆయన తెలుసుకున్న జనంగురించిన వాస్తవాలు ఏమిటి? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఆ రీతిగా జనాన్ని విస్మరిస్తూ సాగుతున్న ప్రతిపక్షం ప్రస్థానం ఒకటి జగన్‌కు బలంగా మారిదనడం నిస్సంశయం. 

3) వైఎస్సార్ పట్ల ప్రేమ

కొన్ని బడా ప్రాజెక్టులను కట్టబెట్టే విషయంలో ఇప్పటికీ నిగ్గుతేలని  ఆరోపణలు ఎన్ని ఉన్నప్పటికీ.. సామాన్య ప్రజానీకం విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతటి తిరుగులేని నాయకుడిగా తన పాలనను స్థిరపరచుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆంతరంగిక సంభాషణల్లో అభినందించే పాటి ప్రజారంజక పాలన రాజశేఖరరెడ్డిది. తక్కిన విషయాలు ఎలా ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రంలోని సామాన్యుడికి, పేదవాడికి ప్రయోజనం చేకూర్చే విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రదర్శించిన కార్యశీలతను, చిత్తశుద్ధిని, సంకల్పశుద్ధిని శంకించగలిగిన సాహసులు ఎవ్వరూ ఉండరు గాక ఉండరు. 

వైకాపా వెలుగులు మసకబారుతున్నాయా?

గత కొన్ని రోజులుగా తెలుగునాట ఒక బీభత్సమైన ప్రచారం నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెలుగులు మధ్యాహ్న కాలపు సూర్య తేజస్సులా తొలుత చాలా ప్రబలంగా ఉండి.. క్రమంగా సన్నగిల్లుతున్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా చాలా విసృ్తతంగా ప్రచారం జరుగుతోంది. పైపెచ్చు వైఎస్ జగన్ జైలునుంచి వెలుపలికి వచ్చిన తర్వాత.. పార్టీకి అటు నాయకుల్లోను, ఇటు ప్రజల్లోను ఉన్న ఆదరణ మరింతగా పలచబడిపోతున్నదని అనేకానేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పలువిధాలుగా ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

1) రాజకీయ శక్తుల ఏకీకరణ

దానికి యెల్లో మీడియా కూడా జత కలుస్తున్నది. జగన్ అంటే నిలువెత్తు వ్యతిరేకతను ప్రోదిచేసుకున్న వారందరూ కలసి కట్టుగా.. ఆయన అంతానికి పంతం పట్టినట్లుగా పెట్రేగిపోతున్నారు. యెల్లో మీడియాలోని ప్రధాన కూటములలో ఓ మీడియాసామ్రాజ్యాధినేత చంద్రబాబుకు  భాజపాతో పొత్తులు కుదిర్చడం దగ్గరినుంచి అన్ని వ్యవహారాలను దగ్గరుండి నడిపింప పూనుకోవడం వింతేమీ కాదు. ముఖ్యమంత్రి పీఠం మీద ‘తాను నిలిపిన బొమ్మ’ గా చంద్రబాబును భావించే సదరు మీడియా మొఘల్, ఆ బొమ్మను ఆ పదవిలో జాగ్రత్తగా పున:ప్రతిష్టించడం కోసం వెంపర్లాడడం ఆశ్చర్యం కలిగించదు. అందుకే మోడీ మేనియా అనే భావజాలానికి ఈ రాష్ట్రంలో ఏ కొన్ని ఓట్లున్నా వాటిని చంద్రబాబుకే కట్టబెట్టడానికి, జేపీ సానుకూలాంశాన్ని కూడా చంద్రబాబుకే లాభింపజేయడానికి పూనుకుంటున్నారనేది సమాచారం. మరో పత్రిక సంగతి కూడా పరిశీలించాలి. 

‘జగన్ డౌన్’ అంటూ ఆ పత్రిక తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నది. జగన్ పార్టీ చేయించుకున్న సర్వేల సారాంశం సాంతం తమ చేతికి చిక్కినట్లుగా కల్లబొల్లి లెక్కల గారడీలను పట్టికలుగా ప్రచారం చేస్తున్నది. జగన్ పార్టీ అత్యంత రహస్యంగా చేయించుకున్న సర్వేల సారాంశం ఇదీ అని వారు పేర్కొంటారు. మరి అంత రహస్యమైన సమాచారాన్ని ఎలా రాబట్టారో వివరించరు. కనీసం ద్రువీకరించరు. జగన్ జైలు నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయిందని కూడా వారు విశ్లేషించేస్తారు. ఆయన జైలునుంచి వచ్చాక ఆయన పార్టీలోకి చేరిన వారు ఒక్కరు లేరంటూ కొత్త వాదనల్ని కూడా వినిపిస్తారు. ఇప్పటిదాకా జగన్ సమక్షంలోనే పార్టీలో అనేక మంది ప్రముఖులు చేరారు. ఆయన జైలునుంచి వచాే్చక చేరిన వారిలో బాలశౌరి, రఘురామకృష్ణం రాజు, అయోధ్య రామిరెడ్డి వంటి అనేకులు ఉన్నారు. పైగా రాష్ట్ర శాసనసభలో తెలంగాణ బిల్లు అనే గడువు ఒకటి నడుస్తున్నప్పుడు.. ఆ తంతు పూర్తయ్యే దాకా తాము ప్రస్తుతం ఉన్న పార్టీల్లోనే ఉండి ఆ తర్వాత ఫిరాయించవచ్చునని ఎదురుచూస్తున్నవారు అనేకులు. అందుకే కాబోలు.. సభ పూర్తయితే తమ కథనాలకు విలువ ఉండదని సదరు పత్రిక కూడా తొందరపడిన కోయిలలాగా ముందుగానే కూస్తున్నది. 

జగన్ నుంచి దూరం అవుతున్న నాయకులను ఈ పత్రిక ప్రధానంగా ప్రస్తావించడం విశేషం. 2009 ఎన్నికల్లో వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి పథకాల ప్రభంజనం కొనసాగుతూ ఉన్నప్పటికీ.. ఆ సమయానికి మంత్రిగా వెలగబెట్టిన అనుభవం ఉన్నప్పటికీ ఓటమి పాలైన మూలింటి మారెప్ప పార్టీకి దూరం కావడం సదరు పత్రికకు లభించిన అపురూపమైన ఆయుధం. మారెప్ప ను ప్రముఖ నాయకుడిగా గుర్తించి ఉంటే వారు ఆయన గతంలో ఎంతలేసి ప్రాధాన్యాన్ని కట్టబెట్టేవారో గానీ.. ఆయన తన గొంతెమ్మ కోరికలకు జగన్ తలొగ్గడం లేదని తెలిసి దూరం అయ్యాక హఠాత్తుగా నెత్తిన పెట్టేసుకున్నారు. అలాంటి నాయకులు దూరం అవుతుండడం పార్టీ పతనాన్ని సూచిస్తున్నదని విశ్లేషణలతో తయారవుతున్నారు. మారెప్ప నికార్సుగా స్వతంత్రంగా పోటీచేస్తే ఏ పాటి ప్రజల ఓట్లు పొందగలడో ఆ పత్రికకు తెలియని సంగతి కాదు. కాకపోతే.. అది కేవలం జగన్ పతనమవుతున్నాడనే ప్రచారానికి వాడుకోవడానికి మాత్రమే. అలాగే సబ్బం హరి ఎపిసోడ్ కూడా!

దారిద్య్రం ఏంటంటే.. 

ప్రస్తుత రాజకీయాల్లో నెలకొన్న అత్యంత పెద్ద భావదారిద్య్రం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. అదేంటంటే.. తమను ప్రజలు నమ్మి, తమకు అధికారం కట్టబెట్టాలని, తాము ప్రజారంజకంగా పాలించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కలనైనా తలపోయడం లేదు. వైకాపాను సర్వనాశనం చేస్తే ప్రజలు గతిలేక తమను గెలిపిస్తారని మాత్రమే ఆయన ఆశిస్తున్నారు. అది ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. అందుకే తన అన్ని కుయుక్తులను అన్ని పన్నాగాలను కుట్రలను కూహకాలను అన్నింటినీ ప్రజల మనసు గెలుచుకోవడానికి కాకుండ వైకాపా పతనం కోసం చంద్రబాబు వెచ్చిస్తున్నారు. 

ఇలాంటి చిత్రమైన రాజకీయ స్థితిగతుల్లో రాష్ట్రం ప్రస్తుతం ఎన్నికలను ఎదుర్కొనబోతున్నది. ఎవరి ప్రచారం నిజమో.. ఎవరి బలం నిజమో కూడా ప్రజలే నిరూపించబోతున్నారు. అందుకు బహుశా ఎక్కువ సమయం అవసరం కాకపోవచ్చు. అయితే వైకాపా బలం క్రమక్రమంగా తగ్గిపోతున్నట్టు మాత్రం ఓ వ్యూహాత్మక ప్రచారం జరుగుతూనే ఉన్నది. 

ఇప్పుడు ప్రారంభంలో చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు బలాల వద్దకు వద్దాం. 1) కాంగ్రెస్ నిస్తేజత.. లోంచి ఏమాత్రం కోలుకోలేదు. పైగా కాంగ్రెస పార్టీ టిక్కెట్ ఇస్తానంటే బెంబేలెత్తి పారిపోయే పరిస్థితిలో సగం రాష్ట్రం ఉన్నది. ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. 20 తెలుగుదేశం వైఫల్యాలు... వీటిని ఆ పార్టీ ఎంతమాత్రమూ చక్కదిద్దుకోలేదు. వైఫల్యాల బాటనుంచి నిజాయితీ బాటలోకి ఆ పార్టీ ఈషణ్మాత్రం కూడా అడుగుపెట్టలేదు. 3) వైఎస్సార్‌పై ప్రేమ... మహానేత మీద ప్రజల్లో ప్రేమ తగ్గిపోవడానికి కారణాలేమీ కనిపించడం లేదు. వైఎస్సార్ కోసం మంచి చెడుల విచక్షణతో నిమిత్తం లేకుండా ప్రజలు జగన్‌ను ఒకసారి అవకాశం ఇవ్వదలచుకున్నారు. ఆతర్వాత ఆయన ఆ ఆదరణను నిలుపుకుంటారా లేదా అనేది వేరే సంగతి. అయితే వైఎస్సార్‌పై ప్రేమ మసకబారినట్లుగా తార్కాణాలు లేవు. ఈ కారణాలేవీ మార్పుకు గురికాకుండా.. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెలుగులు మాత్రం మసకబారిపోవడం ఎలా సాధ్యమవుతుంది. 

అది ప్రలు ఆలోచించుకోవాల్సిన విషయం. 

కపిలముని

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?