ఇక్కడ ఓటింగు వలన ఏమవుతుంది, అంతా పార్లమెంటులో నిర్ణయించినట్లే జరుగుతుంది అనే మాట సాంకేతికంగా కరక్టే కానీ అసెంబ్లీ అభిప్రాయానికి పూర్తి విరుద్ధంగా చేయమని కూడా రూలు లేదు. ఇప్పటిదాకా ఏ రాష్ట్రమూ అలా ఏర్పడలేదు. అసెంబ్లీ అభిప్రాయం ఒక సూచికగా వుపయోగపుడుతుంది. ఇంట్లో నాన్నమాటే చెల్లుతుంది నిజమే, అలా అని అమ్మా, పిల్లలూ చెప్పినమాటను పూర్తిగా కొట్టి పారేయడు కదా. వాళ్లంతా కొత్త కారు కొనమని అడిగితే, ఆయన 'ప్రస్తుతానికి సెకండ్‌హ్యాండ్‌ది కొందాం, వచ్చే ఏడాది తప్పకుండా కొత్తది కొందాం' అని నచ్చచెపుతాడు. ఏ కారూ కొనకుండా మానేయడు. అలిగి కూర్చుంటే ఏమీ కొనడు, లేదా తనకు యిష్టం వచ్చినట్టు చేస్తాడు. బిల్లులో ఏ లోపాలున్నాయో సాక్షి పేపరు నిండా పేజీల కొద్దీ వ్యాసాలు వేస్తారు. వైకాపా సభ్యులు మాత్రం అసెంబ్లీలో 'జై సమైక్యాంధ్ర' నినాదం తప్ప యింకోటి మాట్లాడరు. ఏం లాభం?
ఎందుకు మాట్లాడరు అంటే 'ముందుగా సమైక్యతీర్మానం చేయాలి' అంటూ కొన్నాళ్లు రగడ. ఆ తర్వాత బిల్లుపై ఓటింగు జరపాలి' అంటూ మరో రగడ. ఒక్కో అంశంపై అసలు చర్చంటూ జరిగితే, ఆ వాదనలు విని యింప్రెస్ అయి, కొందరు విభజనవాదులు, సమైక్యవాదులుగా మారతారేమో, మారకపోయినా కనీసం యీ బిల్లు లోపభూయిష్టమని గుర్తించి వ్యతిరేకంగా ఓటేస్తారని అనుకోవచ్చుగా. వైకాపా ఆ ఆప్షన్లు ఏవీ గుర్తించడం లేదు. 'మేం చెప్పినది మీరందరూ వినాలి, మా స్ట్రాటజీయే మీరు అనుసరించాలి' అనే ధోరణిలోనే వెళుతోంది. గట్టిగా మాట్లాడితే వాళ్లకున్న ఎమ్మెల్యేలు ఎందరు? మొత్తం ప్రజాప్రతినిథుల సంఖ్యలో 6% మంది మాత్రమే వాళ్ల పార్టీలో వున్నారు. తక్కిన 94% మందిని మేం ఎప్పుడు ఏ పంథా అవలంబిస్తే అప్పుడు మీరూ అదే దారి పట్టాలి అని శాసిస్తోంది. 'మేం కొంతకాలం సమన్యాయం అన్నాం, యిటీవల సమైక్యం అంటున్నాం, రేపు ఏమంటామో తెలియదు. మేం ఎప్పుడు ఏమంటే మీరు తందానతాన అనాలి' అని చెప్తున్నట్లు వుంది.
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలున్నవారిని తమతో కలుపుకుని వెళ్లడమే ముఖ్యం. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వైకాపా కోరుకున్నట్లు సమైక్యరాష్ట్రంలోనే ఎన్నికలు జరిగితే వైకాపా స్వీప్ చేయగలదా? స్వీప్ చేసిన పార్టీకి సైతం 45% ఓట్లు రాని యీ రోజుల్లో తక్కిన 55% మంది అభిప్రాయాలు కూడా మన్నిస్తూ, అసెంబ్లీలో మెజారిటీ వున్నా కాస్త తగ్గి అందరికీ ఆమోదయోగ్యమైన చర్యలే చేపట్టే అవసరం వుంది. 'నువ్వు నా స్నేహితుడివి కాకపోతే నువ్వు నా శత్రువువే' అనే భావం ఆటవిక తెగల్లో వుంటుంది. 'స్నేహితులు కానివారందరూ శత్రువులు కానక్కరలేదు, నా అభిప్రాయం నాది, నీ అభిప్రాయం నీది, విభేదిస్తూనే పరస్పరం గౌరవించుకుందాం' అనేది నాగరిక భావన. వైకాపాలో ప్రస్తుతం అదే లోపిస్తోంది. తమ విధానం అవలంబించనివారందరూ ద్రోహులే, సోనియా తొత్తులే అనే ప్రచారం చేస్తోంది. 'మొన్నటిదాకా తాము వల్లించిన 'సమన్యాయం' థీమ్ యీరోజుకు కూడా వల్లిస్తున్నవారిని ద్రోహులని ఎలా అంటామ'న్న యింగితమే లేదు. 6% మంది ఎమ్మెల్యేలు తమ అభిప్రాయం మార్చుకోగానే, తక్కిన 94% మంది కూడా అర్జంటుగా మార్చేసుకోవాలా? మార్చుకోకపోతే వాళ్లు తెలుగుజాతికి ద్రోహం చేసినట్లేనా?
ఇలాటి అడ్డగోలు వాదనతో వైకాపా అసెంబ్లీని అడ్డుకుంటూనే వుంది. అలా అడ్డుకుని జనసామాన్యంలో ఛాంపియన్ అయిపోతోందని ఎ-టిడిపివారి భయం. అసెంబ్లీని అడ్డుకోవడం సరైన విధానం కాదని ప్రజలకు నచ్చచెప్పడం పోయి, వైకాపాను మించిన గోల చేసి జనాల్ని యింప్రెస్ చేసేద్దామని తంటాలు పడసాగారు. వాళ్లూ స్పీకరును చుట్టుముట్టి, నినాదాలు యిచ్చి, సభను వాయిదా వేయించి పెద్ద ఘనకార్యం చేసినట్లు ఫీలయ్యారు. రాష్ట్రపతి యిచ్చిన ఆరువారాల గడువును యిలా వృథా చేసి, యిప్పుడు గడువు పెంచమని అడగడం ఎంత అసహ్యంగా వుంది? రాష్ట్ర విభజన మాకు జీవన్మరణ సమస్య అని చెప్పే శాసనసభ్యులు, విభజన త్వరగా జరగకపోతే కొంపలంటుకుపోతాయని చెప్పే శాసనసభ్యులు క్రిస్‌మస్‌కు, కొత్త సంవత్సరానికి, సంక్రాంతికి సెలవులు తీసుకోవాలా? నాలుగు వేల సవరణలు రాతపూర్వకంగా ప్రతిపాదించిన సభ్యులు కనీసం వాటి గురించి మాట్లాడడానికైనా సమయం వుండేట్లా చూసుకోవద్దా? ఇన్నాళ్లూ అసెంబ్లీ ఎగ్గొట్టి, యిప్పుడు టైము చాలలేదంటే యిస్తారా?
'పరీక్షలకు ప్రిపేరవకుండా సినిమాల కెళ్లాం, కోడిపందాల కెళ్లాం, సమ్మెలు చేశాం అందువలన పరీక్షలు వాయిదా వేయండి' అని విద్యార్థులు అడిగితే ప్రిన్సిపాల్ వాయిదా వేస్తాడా? ఆర్థిక వ్యవహారాల గురించి సమాచారం అడిగితేనే కేంద్ర హోం శాఖ ఏమంది? 'మీ అసెంబ్లీ నడిచే తీరు గమనిస్తున్నాం, జాగ్రత్త' అంది. రాష్ట్రపతిగారు యిక్కడ హైదరాబాదులో వుండగా మనవాళ్లు అసెంబ్లీలో ఎంత రగడ చేశారో తెలుగు టీవీల్లో ప్రత్యక్షప్రసారం చూసి వుంటారు. గడువు పెంచమంటే 'ఏం చేసిన గొడవ చాల్లేదా?' అంటారు. గడువు పెంచమని ఎవరూ అడగడానికి ముందే రాష్ట్రపతి 10 రోజులు పెంచుతారని వచ్చిన పిటిఐ కథనం మోసపూరితమని తోస్తుంది. సీమాంధ్రులను వూరడించి, జోకొట్టి, ఏమార్చి, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వాళ్లను మంచి చేసుకోవడానికి ఎన్నికల ముందు బిల్లు పాస్ కాదని వూరించే మరో ప్రయత్నం అనిపిస్తుంది. గతంలో యిలాగే యూటీ చేస్తారని, రాయల తెలంగాణ అనీ లీకులు వదిలి వెర్రివాళ్లని చేసి ఆడించారు. ఇచ్చిన సమయాన్ని వృథా చేసినవారు మరింత సమయం అడిగితే ఏ తర్కంతో రాష్ట్రపతి సమ్మతిస్తారు చెప్పండి.
ఎ-టిడిపివారు వైకాపా బాటలో చాలాకాలం నడిచాక ఏమనుకున్నారో ఏమో అల్లరి మాని అసెంబ్లీలో చర్చకు ఒప్పుకున్నారు. దాంతో వైకాపా ఒంటరిదై పోయింది. వారు ప్రతికకక్షులపై తమ ప్రచారం మరింత ఉధృతం చేశారు. బాబు, కిరణ్ సోనియా కనుసన్నల్లో నడుస్తున్నారని రోజూ సాక్షిలో హెడ్‌లైన్సు వేస్తూ పోయారు. చూసి చూసి ప్రస్తుతం కిరణ్‌కు సన్నిహితంగా వుంటున్న సబ్బం హరి చేత జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడించారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)