ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో జరిగిన బీభత్సం అందరం చూశాం. సహాయకచర్యల కోసం ఎందరో విరాళాలు పంపాం కూడా. ప్రభుత్వం తరఫునుండి, ప్రభుత్వేతర సామాజిక సంస్థల నుండి నిధులు ప్రకటించడం జరిగింది. తక్షణ చర్యగా కేంద్రప్రభుత్వం వెయ్యికోట్ల రూ.లు యిస్తానంది. రూ. 300 కోట్లు ప్రజలకు యిచ్చింది కూడా. ప్రపంచబ్యాంకు 25 కోట్ల డాలర్ల సహాయం, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 20 కోట్ల డాలర్ల ఋణం యిస్తానన్నాయి. టాటా రిలీఫ్ కమిటీ వంటి అనేక సంస్థలు పునరావాసానికి అయ్యే ఖర్చు భరిస్తానన్నాయి. కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 9 నాటి సమావేశంలో మొత్తం రూ.7346 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. దీనిలో రూ.1885 కోట్లు కేంద్రం స్పాన్సర్ చేసే పథకాలకు, రూ.1200 కోట్లు నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్సుకి, రూ.3161 కోట్లు బయటనుండి సహాయం పొందే ప్రాజెక్టులకు, రూ.1100 కోట్లు స్పెషల్ ప్లాన్ కై వెళుతుంది.
ఈ అంకెలన్నీ బాగానే వున్నాయి కానీ పునరావాస కార్యక్రమాలు ఏ స్థాయిలో వున్నాయి, అసలు అక్కడ యిప్పట్లో మామూలు జీవనం నెలకొంటుందా లేదా అని చూడబోతే నిరాశ కలుగుతుంది. ఆరునెలలు గడిచినా పదివేలమంది సొంత యిళ్లకు వెళ్లకుండా యింకా గుడారాల్లోనే వుంటున్నారు. వాళ్ల యిళ్లు వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయాయి. మళ్లీ కట్టాలంటే భూమి లేదు. భూమి యిస్తే యిళ్లు కట్టడానికి అనేక ఎన్‌జిఓలు (ప్రభుత్వేతర సామాజిక సంస్థలు) రెడీగా వున్నాయి. ప్రభుత్వం వద్ద భూమి లేదు. వరదల్లో చాలా భూభాగం కొట్టుకుపోయింది. ఇదివరకు కొండ అంచుల్లో కూడా ధైర్యంగా యిళ్లు కట్టేశారు. మొన్నటి ఉత్పాతం చూశాక ఎవరూ అంత సాహసం చేయటం లేదు. కొండల్లో భూమి కనబడటం లేదు కాబట్టి 'మేం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున యిస్తాం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ భూమి కొనుక్కోండి' అంటోంది ప్రభుత్వం. ఎన్‌జిఓలు గృహసముదాయాలు కడదామని చూస్తున్నాయి. గతంలో అడ్డదిడ్డంగా కట్టడం వలననే అనర్థం జరిగింది కాబట్టి యీ సారి నియమనిబంధనలకు లోబడి కడదామని నిశ్చయించుకున్నాయి. కొన్ని గ్రామాల్లో యిళ్లు కట్టడానికి రూ. 50 కోట్ల సహాయం అందిస్తున్న మాతా అమృతానందమాయీ ఆశ్రమం వంటి సంస్థలు 'ఇళ్లు కట్టే విధివిధానాలను రూపొందించి యివ్వండి, వాటి ప్రకారమే కడతాం' అని అడిగాయి. అయితే ప్రభుత్వం తాత్సారం చేస్తూ కూర్చుంది. పైగా వాళ్లకు భూమి కూడా యివ్వలేదు.
ఏ ప్రాంతంలోనైనా సాధారణ పరిస్థితి నెలకొనాలంటే రోడ్లు చాలా ముఖ్యం. రూ.3500 కోట్లు దానికై ఎలాట్ చేశారు కానీ పని జరగటం లేదు. వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు మళ్లీ వేసే పని చాలా మందకొడిగా సాగుతోంది. విరిగిపడిన కొండ చరియలు తొలగించకపోవడంతో యింకా కనబడుతూనే వున్నాయి. రోడ్లన్నీ గుంతలే. ఆ రోడ్ల నిర్వహణాధికారం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేతిలో వుంది. వాళ్ల నుండి అనుమతులు ఓ పట్టాన రావటం లేదు. దాంతో రోడ్ల నిర్మాణం సాగడం లేదు. గతంలో అరగంట పట్టే ప్రయాణం యిప్పుడు మూడు గంటలు పడుతోంది. ఇలాటి పరిస్థితుల్లో యాత్రికులు ఎవరైనా వస్తారా? ఒకప్పుడు ఏటా రెండున్నర కోట్ల మంది యాత్రికులు వచ్చేవారు. ఇప్పుడు చార్‌ధామ్ యాత్రకే కాదు, సురక్షిత ప్రాంతాలైన మసూరీ, నైనితాల్‌లకు కూడా రావడం మానేశారు.
ఉత్తరాఖండ్ అంటేనే టూరిస్టులు వణుకుతున్న విషయం గ్రహించి రాష్ట్రప్రభుత్వం యిటీవల వింటర్ కార్నివాల్ అనీ, కార్ ర్యాలీ అనీ నిర్వహించింది. పుణ్యక్షేత్రాలు పూర్తిగా దెబ్బ తినడంతో తమ రాష్ట్రాన్ని అడ్వంచర్ టూరిజంకు, వైల్డ్‌లైఫ్ టూరిజంకు అనువైన ప్రాంతంగా మార్కెట్ చేసుకుంటోంది. యాత్రికుల మీదే ఆధారపడిన స్థానికప్రజలు యాత్రికులు రావడం మానేయడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. గతంలో గెస్ట్‌హౌస్ నడిపి, అది కొట్టుకుపోవడంతో యిప్పుడు గుడారాల్లో తలదాచుకుంటున్న ఒకతను ''మళ్లీ గెస్ట్‌హౌస్ కట్టినా ఏం లాభం? ఎవరైనా వస్తారా? ఈ రోడ్ల మీద రాగలరా?'' అని అడిగాడు. అలా అని చలి పెరుగుతున్నకొద్దీ గుడారాల్లో వుండడమూ కష్టమే.
ఆనాటి వరదల్ని టీవీల్లో చూసే, మనం చలించిపోయాం. చాలారోజులు అవే దృశ్యాలు కళ్లముందు కదలాడి యిబ్బంది పడ్డాం. మరి అక్కడ ప్రత్యక్షంగా అవి అనుభవించి, ఆత్మీయులను పోగొట్టుకున్నవారి మనసులపై అవి ఎలాటి ప్రభావాన్ని కలిగించి వుంటాయో వూహించవచ్చు. అందుకని బాధితులకు సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం వుంటుందని నిపుణులు చెప్పారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఏమీ చేయలేదు. వారంతా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అంతేకాదు, ఇంతటి విపత్తు జరగగానే రాష్ట్రప్రభుత్వం వెంటనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాను తయారుచేసుకుని ఫోర్సు సిద్ధంగా పెట్టాలి కదా. అబ్బే, అదేమీ చేయలేదు. మొన్న నవంబరులో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గట్టిగా చివాట్లు వేశాక, పని మొదలుపెట్టింది. వర్షాలు వచ్చే సమయానికి అది రెడీ అవుతుందో లేదో భగవంతుడికే ఎఱుక.
ఎమ్బీయస్ ప్రసాద్ – న్యూస్, వ్యూస్, రివ్యూస్ – (జనవరి 2014)