ఇటీవలే గతించిన అంజలీదేవి గారి గురించి రాయమని కొందరు పాఠకులు అడిగారు. నేను గతంలో భానుమతి, సావిత్రి, జమున, కృష్ణకుమారి గార్ల గురించి రాసినపుడు అంజలి గురించి రాయలేదేం అని చాలామంది అడిగారు. మామూలుగా తారల పుట్టినరోజుకో, అవార్డు యిచ్చినపుడో లేక మరణించినపుడో ఒక పేజీ సైజు వ్యాసాలు పేపర్లలో వస్తూ వుంటాయి. ఇంచుమించుగా అన్ని పేపర్లలోనూ అదే సమాచారం. దాన్నే మళ్లీ నా మాటల్లో పొదిగి యిస్తే ప్రయోజనం ఏముంది? వాళ్ల జీవితచరిత్ర గురించి పుస్తకం రాసి వుంటే అది చదివితే చాలా సమాచారం దొరుకుతుంది. దానిలోనుండి నన్ను మెప్పించిన అంశాలతో నాలుగైదు పేజీల వ్యాసం రాయడం నా విధానం. భానుమతి, జమున ఆత్మకథలు రాసుకున్నారు. సావిత్రి గురించి గతంలో ఒకరు రాసినది, యిటీవలి కాలంలో పల్లవిగారు రాసినదీ వుంది. కృష్ణకుమారి గురించి 1970 ప్రాంతంలో రాసిన పుస్తకం ఒకటి దొరికింది. వాటి సహాయంతో ఆ వ్యాసాలు రాశాను. అంజలి గురించి ఎవరూ పుస్తకం రాయలేదు.
నిజానికి వారందరి కంటె విస్తృతమైన జీవితం ఆవిడది. నిర్మాతగా చాలా సినిమాలు తీసి ఒడిదుడుకులు పడ్డారు. పుస్తకం రాయడానికి తగినంత డ్రామా వుంది. అయినా ఎవరూ రాయలేదు. రావి కొండలరావుగారు రాస్తున్నారని పత్రికల్లో వచ్చింది. 86 ఏళ్లు బతికినా తనపై రాసిన పుస్తకం కళ్ల చూడకుండానే ఆవిడ కన్నుమూశారు.
ఉన్నతస్థానానికి చేరిన ప్రతీవారు తమ అనుభవాలను నిక్షిప్తం చేస్తే భావి తరాలకు ఉపయోగం. ''ఫూలోంకీ సేజ్'' అనే సినిమా తీసిన తర్వాత అంజలీ పిక్చర్స్‌వారు ఆర్థికంగా అట్టడుగుకి వెళ్లిపోయారు. మళ్లీ నిలదొక్కుకుని సినిమాలు తీశారు. ఆ నష్టాన్ని ఎలా తట్టుకున్నారో విపులంగా చెపితే ఉదయ్‌కిరణ్ వంటి వాళ్లు ఉరి వేసుకునేముందు కాస్త ఆలోచిస్తారు. (అన్నట్టు ఉదయ్ కిరణ్ గురించి 19 01 14 నాటి ''సాక్షి''లో వి ఎన్ ఆదిత్య పరమాద్భుతమైన వ్యాసం రాశారు. ఉదయ్ దృక్పథంలో లోపం ఎక్కడుందో కరక్టుగా పట్టుకున్నారు. వ్యక్తిత్వవికాసం క్లాసులో పాఠంగా చెప్పదగిన అంశాలున్నాయి. ఆ వ్యాసంలో చెప్పిన భావాలను ఆయన తన సినిమాలో పాట రూపంలో పెడితే 'నేనున్నానని..' వంటి చక్కటి పాట తయారై ఎందరికో దిశానిర్దేశం చేస్తుంది) ఎక్కడో రాబర్ట్ బ్రూస్, అబ్రహాం లింకన్‌ల ఉదాహరణలు చెప్పేబదులు మనకు తెలిసిన తారల జీవితాల నుండి నమూనాలు చెపితే మనసులో నాటుకుంటుంది. నిర్మాతగా తిన్న దెబ్బ నుండి కోలుకోవడానికి ఆదినారాయణరావుకు సంగీతం ఉపకరించింది. ఆయన పోనుపోను యితరుల సినిమాలకు కూడా సంగీతం యివ్వసాగారు.
అంజలిగారు పోయినపుడు పత్రికల్లో, టీవీల్లో చెప్పినదానికి మించి చెప్పడానికి నా వద్ద అదనంగా సమాచారం ఏమీ లేదు – నా వ్యక్తిగత అభిప్రాయాలు తప్ప! 1970ల తర్వాత పుట్టినవారు అంజలిని మాతృమూర్తి వేషాల్లో తప్ప వేరేలా ఊహించుకోలేరు. నేను ఆమెను హీరోయిన్‌గా కూడా చూశాను, వూహించుకోగలను కానీ సెడక్టివ్ హీరోయిన్‌గా మాత్రం కాదు. నా ముందుతరం వాళ్లలో కొంతమందిని ఆమెను 'ఊంఫ్ గర్ల్'గా భావించడం చూసి ఆశ్చర్యపడేవాణ్ని. హీరోయిన్‌గా ఆమె అన్ని రకాల పాత్రలు వేసింది. కామెడీ (''పెళ్లి సందడి'') అంతగా చేయలేదు కానీ, మంచి డాన్సర్. శాస్త్రీయమైనవే కాక అన్ని రకాల నృత్యాలు బాగా చేసేది. పాట పాడడం మాత్రం రాదు. ఆవిడ తరంలో పాటలు పాడగలిగేవారినే యాక్టర్లగా తీసుకునేవారు. ఈవిడకు పాట రాకపోవడం చాలా మంచిదైంది. జిక్కి, సుశీల యిత్యాదులు పాడిన అనేక అద్భుతమైన పాటలు యీవిడపై చిత్రీకరించబడి 'అంజలి' అనగానే ఆ పాటలన్నీ గుర్తుకు వస్తాయి. ఈవిడ నటించిన 50 సినిమాల్లో ఆవిడ పాత్రపరంగా సినిమా టైటిల్స్ పెట్టారని (స్వప్నసుందరి, సువర్ణసుందరి, స్వర్ణమంజరి, అనార్కలి, ఇలవేల్పు..యిలా) ఎస్‌వి రామారావుగారి పరిశీలన. సతీ సక్కుబాయి, సతీ సుమతి, సీతమ్మ వంటి పాత్రలకి విశేషంగా పేరు రావడంతో అలాటి పాత్రలకే ఆమె తగును అనుకోనక్కరలేదు. విప్లవకారిణి పాత్రలు, తిరగబడి గట్టిగా మాట్లాడే పాత్రలు, డైలాగులతో అదరగొట్టే పాత్రలను కూడా ఒప్పించింది. ''భీష్మ''లో పగబట్టిన అంబగా, ''జయభేరి''లో రాజుగారిని నిలదీసే కవిభార్యగా, ''జయసింహ''లో కాళిందిగా రాణించింది. మానసిక సంఘర్షణ వున్న ''చరణదాసి'', ''ఇలవేలుపు'' ''లవకుశ'' సినిమాల్లో చాలా బాగా నటించింది.
ఇక నిర్మాతగా అంజలి గురించి చెప్పాలంటే చాలానే వుంటుంది. కానీ ఆ ఘనత ఆదినారాయణరావుగారికి పోతుంది. ఆయన ఎలా చెపితే యీవిడ అలా నడుచుకుంది. చాలా చిన్నవయసులోనే ఆయనతో పరిచయమైంది. ఆయన చెప్పినట్టే నడచుకుంది. రంగస్థలంపై నటించింది. అప్పటికే వివాహితుడైనా ఆయన్నే పెళ్లాడింది. సవతి పిల్లల్ని కూడా తన పిల్లల్లా చూసుకుంది. సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ ఆదినారాయణరావుగారే చూసుకున్నారు. ఆయన మేధావి. సంగీతంలో నిష్ణాతుడు మాత్రమే కాదు, విమర్శకుడు కూడా. పైగా కథకుడు. 'ఆదిత్య' పేరుతో తన సినిమాలకు కథలు కూర్చేవాడు. సినిమారంగానికి వచ్చిన నాలుగేళ్లలోనే నాగేశ్వరరావు తదితరులతో కలిసి ''మాయలమారి'' సినిమా తీశారు. ఆ తర్వాత అంజలీ పిక్చర్స్ స్థాపించి చాలా సినిమాలు తీశారు. ''సువర్ణసుందరి'' వాళ్ల బిగ్గెస్ట్ హిట్ సినిమా. దాన్ని హిందీలో రీమేక్ చేసి విజయం సాధించడంతో మనోజ్ కుమార్, వైజయంతిమాల, అశోక్ కుమార్‌లతో గుల్షన్ నందా నవల ఆధారంగా, ఇందర్ రాజ్ ఆనంద్ డైరక్షన్‌లో ''ఫూలోంకి సేజ్'' (1964) సినిమా తీశారు. దాన్ని ముందుగా తెలుగు లేదా తమిళంలో తీశారా లేదా అన్నది నాకు తెలియదు. సినిమా ఘోరంగా ఫ్లాపయింది సరే, పాటలు కూడా వినబడవు. ''స్వర్ణసుందరి''లో పాటలు యిప్పటికీ వినబడతాయి. అదీ తమాషా!
ఆర్థిక వైఫల్యం నుండి బయటపడడానికి అంజలికి ఉపకరించినది – ఆమె నటనాకౌశలం. ఆ సమయంలోనే తనకు హీరోయిన్ ఛాన్సులు తగ్గుతున్నాయని గ్రహించి ఆమె తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం – 40 ఏళ్ల వయసులోనే తల్లిపాత్రలకు మారిపోవడం! సావిత్రి, జమున వాళ్లతో పోటీ పడుతూ రావడం ఒక యెత్తు అయితే 1966, 67 పాటికి బి సరోజాదేవి, కాంచన, జయలలిత, భారతి, కె ఆర్ విజయ వంటి గ్లామరస్ అమ్మాయిలు వచ్చిపడ్డారు. అది గ్రహించి ''రంగులరాట్నం''లో చంద్రమోహన్, రామ్‌మోహన్, విజయనిర్మలలకు తల్లిగా వేయడానికి ఒప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఆవిడ తెరతల్లిగా స్థిరపడిపోయారు. ఇంకో నాలుగేళ్లు పోయేసరికి నాగేశ్వరరావుకి తల్లిగా ''సుపుత్రుడు'' (1971)లో వేశారు. పై ఏడు ఎన్టీయార్ పక్కన వేశారు కానీ యిద్దరివీ ముసలి పాత్రలే. ''బడిపంతులు''లో 'నీ నగుమోము' పాటతో ఆవిడ రూపం, హావభావాలు, పాట మనసులో ముద్రించుకుపోయాయి. ఒక విషయం మాత్రం మనం తప్పక గమనించాలి. ముసలిపాత్రల్లో ఓవరాక్షన్ చేయడం సహజం. ''అర్ధాంగి'' సినిమాలో గుమ్మడిగారి నటనను మనం మెచ్చుకున్నా ఆయన మాత్రం 'అబ్బే, ఓవరాక్షన్ చేశాను' అనేవారు. అంజలి ముసలిపాత్రల్లోనే కాదు, శోకపాత్రల్లోనే కాదు, మామూలు పాత్రల్లో కూడా ఎప్పుడూ ఓవరాక్షన్ చేయలేదు. అంటే చాలామందికి కోపం వస్తుంది కానీ మహానటి సావిత్రి కూడా ఓవరాక్షన్ చేసిన సినిమాలున్నాయి. నాటకాల నేపథ్యం వున్నా అంజలి ఎప్పుడూ సంయమనం పాటించారు.
ఆవిడ జీవితంలో ఏ వివాదంలోనూ యిరుక్కోలేదు. సినిమారంగంలో అజాతశత్రువు. పద్మశ్రీ అయినా యివ్వకపోయినా ఎప్పుడూ ఆగ్రహాన్ని వ్యక్తపరచలేదు. మంచితనంతో మసలుకుంటూనే వెళ్లిపోయారు. ఆవిడ ఆత్మశాంతికై ప్రార్థిద్దాం –
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)