వెంకన్నతో వ్యాపారంపై విచారణ జరగాల్సిందే!

వెంకన్న సన్నిధిలో వ్యాపారాలు చేసుకుని బతుకుబండిని నడపాలని కోరుకోవడం వేరు. ఆ ఉద్దేశంతో తిరుమలలో తమ ఉపాధిని పొందుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. అయితే ఏకంగా వెంకన్నతోనే వ్యాపారం చేయాలని… వెంకన్నని కాసులకు,…

వెంకన్న సన్నిధిలో వ్యాపారాలు చేసుకుని బతుకుబండిని నడపాలని కోరుకోవడం వేరు. ఆ ఉద్దేశంతో తిరుమలలో తమ ఉపాధిని పొందుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. అయితే ఏకంగా వెంకన్నతోనే వ్యాపారం చేయాలని… వెంకన్నని కాసులకు, పైరవీలకు అమ్మేయాలని, తాకట్టుపెట్టేయాలని.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన తిరు వేంకటగిరినాధుని.. ఒక వ్యాపార వస్తువుగా మార్చివేసి.. బహిరంగంగా విక్రయించేసినట్లుగా.. ఆయన ద్వారా సొమ్ములకో, అధికార మదాంధుల ప్రాపకానికో కక్కుర్తిపడి నిర్లజ్జా కార్యకలాపాలు కొనసాగించవలెనని ఆయన ‘పాలకులు’ కొందరు ఉబలాటపడుతున్నారు.  

వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు తిరుమల వెంకటేశ్వరస్వామితో వ్యాపారం చేయడానికి ఆలయ పాలకమండలి హోదాలో ఉండే తైనాతీలు, రాజకీయ పైరవీకారులు, దళార్లు, ఎంతగా ఉబలాటపడ్డారో ససాక్ష్యంగా తెలుస్తూనే ఉంది. ఇందులో ప్రధానమైన పాపపు వాటా ధర్మకర్తల మండలి అధ్యక్ష హోదాను రకరకాల పైరవీలతో మళ్లీ మళ్లీ దక్కించుకుంటున్న కనుమూరి బాపిరాజుకు దక్కుతుంది. తిరుమలలో దేవుడితో వ్యాపారం చేయడం అంటే.. ఏకంగా మూలవిరాట్టును ముక్కలు చేసి అమ్మేయడం అంటూ ఉండదు. 

తిరుమలలో చిన్న స్థాయి ఉద్యోగులు, చిన్నన చిన్న దళార్లు.. దర్శనం టిక్కెట్లను, గదులను కొన్ని వందల రూపాలయ కక్కుర్తితో అమ్ముకుంటే టీటీడీ బోలెడు కేసులు పెడుతుంది. కానీ ధర్మకర్తల మండలి ముసుగులో బడాబాబులు మాత్రం.. ఏకంగా స్వామివారినే సంపన్నులకు అమ్మకానికి లేదా తాకట్టుకు పెట్టేస్తున్నారు. అయితే వీరు స్వామిని కాసులకు తాకట్టుపెట్టడం లేదు.. అంతకంటె విలువైన పైరవీలకు, బడాబాబుల ప్రాపకానికి, మరిన్ని దళారీ పనులు చేసుకునే పాటి పరిచయాలకు స్వామిని అడ్డగోలుగా వాడుకుంటున్నారు. 

స్వామిసేవలో ఉండే భాగ్యాన్ని ఇలా వాడుకోజూసే వారికి కొదువలేదు. కానీ ఇప్పటివరకు వివాదంగానే చెలరేగుతున్న` మొన్నటికి మొన్న వైకుంఠ ఏకాదశి నాడు ధర్మకర్తల మండలి పాల్పడిన దుర్మార్గం మాత్రం గర్హనీయమైనది. పదుల గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న సామాన్య భక్తులకు అసలు వైకుంఠ ఏకాదశి నాడు దర్శనమే చిక్కలేదు. టీటీడీ పాలకుల ఈ అరాచక వైఖరిపై కడుపుమండిన సామాన్యభక్తులు కొందరు ఆందోళన చేశారు. పదిమందీ రోడ్డున పడే పరిస్థితిని సాక్షాత్తూ టీటీడీ కల్పిస్తే.. వారు రోడ్డెక్కారంటూ దానికి ‘ధర్నా’ అంటూ ఒక ముద్ర వేసి.. వారందరి మీద కేసులు పెట్టారు. పాలకమండలి ఇంత నీచానికి తెగబడడం సర్వధా విమర్శల పాలవుతోంది. 

తిరుమల వేంకటేశ్వరస్వామి అంటేనే భక్తవల్లభుడు. భక్తుల సేవే భగవంతుని సేవ అని నమ్మి ఆచరించవలసిన ధర్మకర్తల మండలి భక్తుల మీద కేసులు, భగవంతుని తాకట్టు పెట్టడానికి తెగిస్తుండడం మాత్రం శోచనీయం. పైగా టీటీడీ అధికారులు భక్తులపై కేసులు పెట్టడాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకుంటూ ఉండడం మరో విశేషం. అందుకే ఈ విషయంలో సీబీఐ విచారణ జరగవలసిన అవసరం ఉన్నది. వెంకన్నసామిని ధర్మకర్తల మండలిలోని ఏయే ప్రముఖులు ఎలా తాకట్టు పెడుతున్నారు. ఎలాంటి క్విడ్‌ ప్రోకో ఒప్పందాలకు స్వామి బలవుతున్నాడు… లాంటి అన్ని విషయాలను సీబీఐ లాంటి ఉన్నత సంస్థ విచారణే నిగ్గుతేల్చి.. ధూర్త ‘పాలకులను’ ఎండగట్టాల్సి ఉంది.