రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఏమీ రాయరేం? అంటూ మెయిల్స్ వస్తున్నాయి. ఏం రాయాలి? మన ప్రజాప్రతినిథులు యింత మతితప్పి ప్రవరిస్తూ వుంటే, వాళ్ల గురించి సభ్యమైన భాషలో రాయడం ఎలా? అసెంబ్లీ అంటే వీళ్లకు నవ్వులాటగా వుంది. మొన్నటిదాకా పార్లమెంటులోనూ యిదే ఆట. అవిశ్వాసం పెడతారన్న భయంతో పాలకపక్షమే తన మిత్రులతో గొడవ చేయించి, రోజూ వాయిదా వేయించేది. వాళ్లు వూరుకుంటే వీళ్లు గొడవ చేసేవారు. సీమాంధ్ర ఎంపీలది పై చేయి అవుతుందేమోననుకున్న తరుణంలో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ఎంపీలను దువ్వి సభ చెడగొట్టేది. ఇప్పుడు అసెంబ్లీకి సీను మారింది. గతంలో తెలంగాణ ఎమ్మెల్యేలు సభ నడవనీయకుండా చేసేవారు. ఇప్పుడు సీమాంధ్రులది ఆ వంతయింది. విభజన బిల్లుపై చర్చకు అవకాశం వుండదు, దేవుడికి నైవేద్యం అలా అలా చూపించి, మనమే తినేసినట్టు అసెంబ్లీకి బిల్లు ఓ సారి నివేదన చేసి పార్లమెంటే సర్వాధికారాలు వుపయోగించి రాష్ట్రాన్ని విడగొట్టేస్తుంది అనుకుంటూండగా రాష్ట్రపతి ప్రణబ్ ఎంతో దూరదృష్టితో ఆరువారాల గడువు యిచ్చారు. అంశాల వారీగా సభ్యుల అభిప్రాయాలను తీసుకోవడానికి వీలు కల్పించారు.
విభజనను ఎంతమంది, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చాటి చెప్పేందుకు సువర్ణావకాశం యిది. సభలో శాసనసభ్యులు యిచ్చే ఉపన్యాసాలు చరిత్రలో మిగిలిపోతాయి. అంతిమంగా ఏం జరిగినా, రాబోయే పరిణామాలను ఫలానావారు ముందే ఊహించారు చూశావా అంటారు. 1956 నాటి ఉపన్యాసాలు పుస్తకరూపంలో వెలువడి అనేకమంది పాత్రికేయులు, పరిశోధకులు పదేపదే చదువుకుంటున్నారు. అలాటి సందర్భం మళ్లీ 57 ఏళ్లకు వచ్చింది. ఈ సభలో సభ్యులుగా వున్నవారు ఆ విధంగా అదృష్టవంతులవుతారు. అయితే యీ విషయాన్ని వాళ్లు గుర్తించినట్టు లేదు. గొడవ చేయడం తప్ప యింకేమీ చేయటం లేదు. సభలో మాట్లాడడానికి అంశాలు సేకరించి పెట్టుకుని వుండరని నా బోటి శంకాత్ముల సందేహం. ఎందుకంటే టీవీ చర్చల్లో చాలామంది సమైక్యవాదులు పాయింట్లు సరిగ్గా చెప్పటం లేదు. వాళ్లు చెప్పే అంశాలు యివి – 'రాహుల్‌ను ప్రధాని చేయడానికై కాంగ్రెసు విభజన చేపట్టింది', 'ఈ బిల్లు ఎన్నికల ముందు తేవడంలో దురుద్దేశం వుంది', 'తెలంగాణలో తెరాసను, సీమాంధ్రలో జగన్‌ను కలుపుకోవడానికే యిది చేస్తోంది', 'ఎన్నికల తర్వాత బిజెపి ఎలాగూ యిస్తుందన్న వూహతో ఆ క్రెడిట్ కొట్టేయాలని యిస్తోంది', 'అంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించలేదు', 'మంత్రులబృందం సీమాంధ్ర కాంగ్రెసు నాయకుల గోడు వినిపించుకోలేదు', 'విభజన బిల్లును టేబుల్ ఐటంగా ప్రవేశపెట్టారు', '371 డి సవరించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి', 'సుప్రీం కోర్టు కొట్టేయక తప్పదు'…
ఇవన్నీ చెప్పాక పార్టీల పరంగా చేసే విమర్శలు – కాంగ్రెసు వాళ్లయితే – 'టిడిపి లేఖ యివ్వడం చేత, వైకాపా ఆర్టికల్ 3 ప్రకారం విభజించినా అభ్యంతరం లేదని చెప్పడం వలన కాంగ్రెసు నిర్ణయం తీసుకోక తప్పలేదు. అందువలన విభజన పాపం ఆ రెండు పార్టీలదే. జగన్ అండ చూసుకుని కాంగ్రెసు అధిష్టానం మమ్మల్ని రోడ్డున పడేసింది', టిడిపి వాళ్లయితే – 'విభజించమని చెప్పాం కానీ, సమన్యాయం చేయవద్దని చెప్పామా? సమన్యాయం అని పైకి మేం చెప్పకపోవచ్చు, కానీ మనసులో గట్టిగా అనుకున్నాం. ఇప్పటికి కూడా సమన్యాయం అంటే ఏమిటో పైకి చెప్పం. విభజన చేయడం మా వల్ల కాలేదు అని కాంగ్రెసు వాళ్లు చేతులెత్తేసి చంద్రబాబుగారికి అధికారం అప్పగిస్తే అప్పుడు చెప్తాం. జగన్‌కు కాంగ్రెసు హైకమాండ్‌తో ఒప్పందం కుదిరింది.', ఇక వైకాపా వాళ్లయితే – 'సమన్యాయం జరిగితే విభజించవచ్చు అని మేం గతంలో చెప్పినది మీరంతా మర్చిపోవాలి. మేమే సమైక్యవాదులమనీ, కాంగ్రెసు, టిడిపిలు సమైక్యం ముసుగులో వున్న విభజనవాదులనీ అని మీరందరూ గుర్తుంచుకోవాలి. కాంగ్రెసు, టిడిపిలు యిద్దరూ కలిసి తెలుగుజాతిని విడగొట్టడానికి ఆడుతున్న నాటకం యిది.'
వీళ్లందరూ కలిసి ఆలపించే రాగం ఒక్కటే – 'తెలుగువారు తరతరాలకూ ఐక్యంగానే వుండాలి', ఎందుకు? అది మాత్రం చెప్పరు. తెలుగువాళ్లందరి మాటా వదిలేయండి, ఒకే జిల్లాలో వున్న వివిధ రాజకీయపక్షాల వారు కలిసి వుంటున్నారా? ఒకరినొకరు అనుమానించుకోవటం లేదా? పరస్పర ఆరోపణలన్నీ కలిపి చూస్తే రాష్ట్రంలో ప్రతీ నాయకుడూ సోనియా చేతిలో కీలుబొమ్మే, ఆమెతో కుమ్మక్కయినవాడే. కలిసి వుండడం దేనికి – యిలా తిట్టుకోవడానికా? ఆలోచన చేసే మేధావులు, కొందరు నాయకులు మాత్రమే విడిపోతే వచ్చే నష్టాల గురించి, కలిసి వుంటే కలిగే లాభాల గురించి మాట్లాడుతున్నారు. వారిలో నల్లమోతు చక్రవర్తి, చలసాని శ్రీనివాస్, జంధ్యాల రవిశంకర్, ఉండవల్లి, కిరణ్ కుమార్ వంటి వాళ్లున్నారు. తక్కినవాళ్లందరూ '2004లో తెరాసతో మీరు పొత్తు పెట్టుకోలేదా?', '2009లో మీరు పెట్టుకోలేదా?', 'ప్రతిపక్షంలో వుండగా విభజన కోరుతూ ఎమ్మేల్యేల ద్వారా వైయస్ లేఖ పంపలేదా? పరకాల ఉపయెన్నికలో మీరు తెలంగాణపై హామీ యివ్వలేదా?' – వంటి ఆరోపణలతోనే సమయం వృథా చేస్తున్నారు. బయట టీవీలో చర్చల ద్వారా ఏళ్లూ, పూళ్లూ యిలాగే గడిపేసి తలకాయ తినేశారు. ఇన్నాళ్లకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చింది. ఇప్పుడైనా మాట్లాడకపోతే ఎలా? చేతకాకపోతే, పాయింట్లు సేకరించి పెట్టుకోకపోతే మాట్లాడకుండా వుండవచ్చు, కానీ యితరులను కూడా మాట్లాడనివ్వకపోతే ఎలా?
ఈ విషయంలో మొదటి ముద్దాయి వైకాపా. జులై నెల దాకా జగన్ సమన్యాయం రైల్లోనే ప్రయాణం చేస్తున్నారు. జులై తర్వాత బండి మారి సమైక్యం రైలెక్కి దూసుకుపోదామని చూస్తూ ఆ రైలుతో రాజకీయశత్రువులందరినీ గుద్దేసి కింద పడేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో అంశంగా సమైక్యం వుంటేనే జగన్‌కు మోక్షం. ఆర్థికనేరాలు, అవినీతిలపై ఫోకస్ వున్నంతకాలం జగన్‌కు ఇబ్బందే. ఇంత తక్కువకాలంలో యింత ఎక్కువ ఎలా సంపాదించాడు అంటూ ఆశ్చర్యపడే న్యాయాధీశుల ఎదుట దోషిగా నిలబడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం తర్వాత ఎన్నికల అంశంగా అవినీతి వుంటే ఎంత చేటో జగన్‌కు పూర్తిగా తెలిసివచ్చి వుంటుంది. కాంగ్రెసు పార్టీలో హేమాహేమీలు మట్టి కరిచారు.
బిజెపికి దక్కవలసిన విజయాలను ఆమ్ ఆద్మీ ఎగరేసుకుని పోవడంతో అవినీతి మచ్చ అంటని మోదీకే గుబులుగా వుంది. ఇక పుట్టెడు కేసులున్న, బెయిలులో తిరుగుతున్న జగన్ గతి ఏమిటి? ఇన్నాళ్లూ రంగంలో వున్న జగన్ ప్రత్యర్థులు చంద్రబాబు, కాంగ్రెసు నాయకులపై కూడా అవినీతి ఆరోపణలు వుండడంతో 'అందరూ ఒక్కలాటివాళ్లే' అనే భావం ఓటర్లలో వుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ స్ఫూర్తితో ఏ మచ్చా లేనివాళ్లు రంగంలోకి దిగితే..? సమైక్య వుద్యమం పుణ్యమాని విద్యార్థి నాయకులు, ఎన్జిఓలు హీరోలయి పోయారు. రాజకీయాల్లో లేని కారణంగా వారిపై పెద్దగా ఆరోపణలుండవు. మహా వుంటే టిఎ బిల్లు సబ్మిట్ చేయలేదు లాటివి వుంటాయి. అరవింద్ కేజ్రీవాల్ మీదా అలాటివి వచ్చాయి. కానీ జనాలు అవి పట్టించుకోలేదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)