ఉత్తర కొరియా అధ్యకక్షుడు జోంగ్-ఉన్ రాజకీయంగా చాలా సాహసం చేశాడు. తనకు రాజకీయ గురువుగా వ్యవహరించిన మేనత్త మొగుడు జాంగ్ థేక్‌ను దేశద్రోహి అని ఆరోపిస్తూ ఫైరింగ్ స్క్వాడ్ చేత కాల్పించాడు. ఉన్ తండ్రి ఇల్ దేశాధ్యకక్షుడిగా వుండే రోజుల నుండి థేక్ రాజకీయ సలహాదారుగా, పార్టీలో ముఖ్యుడిగా వుండేవాడు. ఇల్ నియంతృత్వానికి కొమ్ము కాస్తూ తమ దేశాన్ని పొరుగు దేశమైన చైనాకు సన్నిహితంగా తీసుకుని వెళ్లి, చైనా నుండి ఆర్థికసహాయం సంపాదించగలిగాడు. ఇల్ పాలించే రోజుల్లో అతని సోదరి కిమ్, బావగారు థేక్ పెత్తనం చలాయించారు. ఇల్ తను బతికుండగానే కొడుకు ఉన్‌ను యువరాజుగా నియమించి, థేక్‌ను అతని సంరక్షకుడిగా చేశాడు. 2011లో ఇల్ పోయినపుడు ఉన్‌కు 29 ఏళ్లు. మేనత్త మొగుడైన థేక్ అతనికి అండగా నిలిచి పాలనా వ్యవహారాల్లో పెద్ద దిక్కుగా నిలిచాడు. రాజకీయ వ్యవస్థపై పట్టు సంపాదించాడు. మరి అలాటివాణ్ని యిప్పుడు యిలా చంపించడమేమిటి? అంటే దానికి కొన్ని కారణాలున్నాయి.
నియంతలు రాజ్యం చేసినపుడు సైన్యం ప్రధానపాత్ర వహిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ విభాగం కింద పని చేసే సైన్యం ఎప్పటికైనా రాజుకి విధేయత చూపుతుందని గ్రహించిన థేక్ తనకంటూ ఒక ప్రయివేటు సైన్యాన్ని అంటే రహస్య పోలీసు దళాన్ని తయారుచేసుకున్నాడు. దానికి మినిస్ట్రీ ఆఫ్ పీపుల్స్ సెక్యూరిటీ అని పేరు పెట్టి తన కిందే పెట్టుకున్నాడు. ప్రస్తుత రాజు ఉన్ బలపడుతున్నకొద్దీ స్టేట్ సెక్యూరిటీకి, పీపుల్స్ సెక్యూరిటీకి ద్వేషం పెరిగింది. తన మామ రెక్కలు కత్తిరించాలనుకున్న రాజు పీపుల్స్ సెక్యూరిటీకి అధిపతిగా ఆయన్ను తొలగించాలని స్టేట్ సెక్యూరిటీకి ఆదేశాలు యిచ్చాడు. దీనికి తోడు థేక్ చైనా సహాయంతో దేశంలో ప్రవేశపెట్టబోయిన ఆర్థిక సంస్కరణలు వివాదాస్పదం అయ్యాయి. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా వుంది కాబట్టి చైనా పెట్టుబడులు ఆకర్షించడానికి సెజ్‌లు పెట్టబోయాడతను. ఇదంతా సొంత ప్రయోజనాలకోసమేనని, చైనా వాళ్ల వద్ద డబ్బు తినేసి ఉత్తర కొరియాలోని ముడి ఇనుమును కారు చౌక ధరలకే చైనాకు కట్టబెట్టాడని అతనిపై ప్రచారం జరిగింది. నిజానికి విదేశీ ఆంక్షల కారణంగా ఉత్తర కొరియా ఆర్థికవ్యవస్థ ఏమాత్రం బాగా లేదు. దాన్ని పునరుద్ధరించడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కరెన్సీ రద్దు వంటి తీవ్ర సంస్కరణలు చేపట్టాలి. చైనా దృష్టిలో థేక్ మాత్రమే అవి చేయగలడు. అందుకే అతన్ని తన ఆప్తమిత్రుడిగా భావించింది. అదే యితని చావుకి వచ్చింది. ''థేక్ విశ్వాసఘాతకుడు, దేశద్రోహి, కుక్క కంటె హీనుడు'' అనే ప్రకటన వెలువరించి కొరియా ప్రభుత్వం అతన్ని కాల్పించింది. చైనా శ్రద్ధాంజలి ఘటించింది. ఇప్పుడు థేక్ భార్య, రాజుగారి మేనత్త అయిన కిమ్ గతి ఏమిటో వేచి చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్