ఈ ప్రమాదం వూహించే జగన్ ఎన్జిఓ అసోసియేషన్‌లో తన మనుష్యుల్ని పెడదామని చూశారు. సమైక్య ఉద్యమం అంటూ వెలిగిపోతున్న అశోక్‌బాబును దెబ్బ కొడదామని తెగ ప్రయత్నించారు. అశోక్‌బాబుపై ఆయన ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు ఏమిటి? సమైక్య ఉద్యమంలోకి రాజకీయ నాయకులను రానీయటం లేదట. విభజన ఆపగల సత్తా రాజకీయ నాయకులకే వుంది కాబట్టి వారితో కలిసి, వారి అదుపాజ్ఞల్లో పని చేయాలట. కానీ అశోక్‌బాబు తన సొంత గ్లామర్ పెంచుకోవడానికి రాజకీయనాయకులకు ప్రాధాన్యత యివ్వడం లేదట. దీనిలో వారికి తప్పు కనబడింది కానీ మెజారిటీ ఎన్జిఓలకు యిది ఒప్పుగానే తోచింది. ఎందుకంటే ఆపగలిగే రాజకీయనాయకులు ఆపక పోవడం చేతనే ఎన్జిఓలు రెండు నెలలు సమ్మెచేసి నష్టపోవలసి వచ్చింది. సీమాంధ్రలో తిరుగాడుతున్న ప్రతి రాజకీయనాయకుడు గతంలో విభజనకు అనుకూలంగా లేఖ యిచ్చిన పార్టీ వాళ్లే. (సిపిఎం తప్ప) సమన్యాయంతో విడగొట్టాలా, ఇద్దరు పిల్లల తండ్రిగా విడగొట్టాలా? అన్నది వేరే విషయం. విడగొట్టడానికి ఒప్పుకున్నారు కదా. కాంగ్రెసు పార్టీ వాళ్లు కూడా రెండేసి నాల్కలతో మాట్లాడారు కదా. ఇక వీళ్లు సమైక్యతను ఏం కాపాడతారు? అని సాధారణ ప్రజలతో బాటు ఎన్జిఓలు అనుకున్నారు.
ప్రజానీకంలో చాలామందికి విభజన వలన అంతో యింతో నష్టం వుంది, కొన్ని ప్రాంతాల వారికి లాభమూ వుంది. అయితే ఎక్కువగా నష్టపోయేది – సీమాంధ్రకు చెందిన ఉద్యోగస్తులు, ఉన్నతవిద్య, ఉద్యోగ అవకాశాలకోసం ఎదురు చూసే విద్యార్థులు ! అందుకనే విభజనను ఆపాలన్న తక్కిన అన్ని వర్గాల కంటె వారికి ఎక్కువగా వుంది. ఆంధ్ర ప్రాంతపు నాయకుల నాలికమడత మాటలు చూసి చిర్రెత్తే వాళ్లు ఉద్యమబాట పట్టారు. తెలంగాణ ఉద్యమంలో కూడా యీ వర్గాలే ప్రధాన భూమిక వహించాయి. వాళ్లు మెరుగైన అవకాశాల కోసం ఉద్యమం చేశారు. ఆంధ్రలోని వర్గాల వారు ఉన్నవి పోతాయని, కొత్తవి బొత్తిగా రావని భయపడుతున్నారు కాబట్టి మరింత తీవ్రంగా పోరాడుతున్నారు. వాళ్ల, వాళ్ల కుటుంబాల ఓట్లు గణనీయంగా వున్నాయి కాబట్టి, పోలింగు రోజున ఉద్యోగుల సహకారం చాలా ముఖ్యం కాబట్టి రాజకీయనాయకులు వారిని అదుపు చేయడానికి, అది వీలుకాకపోతే దువ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు కిరణ్పట్ల సానుభూతితో వున్నట్టు తోస్తోంది. కిరణ్ కూడా యిప్పటిదాకా ఎప్పుడూ యివ్వనంత మధ్యంతరభృతి యిచ్చి, మెడికల్ బెనిఫిట్స్ కల్పించి, వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు కిరణ్ పార్టీ పెడితే వీరు తమకు చేతనైనంత సహకరిస్తారన్న అనుమానం కలుగుతోంది.
ఈ సందేహం జగన్‌కు కూడా వున్నట్టుంది. అందుకనే ఉద్యోగివర్గాల ఎన్నికలలో వేలు పెట్టబోయారు. అఫ్కోర్స్, పార్టీ అంటూ పెట్టాక అన్ని వర్గాలలోనూ చొచ్చుకుపోవడం సహజం. ప్రతీ పార్టీకి విద్యార్థి వింగ్, యూనియన్ల వింగ్, వాణిజ్యవర్గాల వింగ్.. యిలా పెట్టుకుని వారిని పార్టీ సానుభూతిపరులుగా మార్చుకుంటారు. ఇది కాంగ్రెసు పార్టీ, కమ్యూనిస్టు పార్టీల నుండి అనాదిగా వస్తున్న సంప్రదాయం. వైకాపా కూడా హైదరాబాదులో అనేక కర్మాగారాల్లో, వాణిజ్య సంస్థల్లో యూనియన్లను తన చేతిలోకి తెచ్చుకునే పనిలో చాలాకాలంగా వుంది. అందువలన తనకు అనుకూలమైన ప్రభుత్వోద్యోగుల సంఘం ఏర్పడాలని అనుకోవడంలో తప్పేమీ లేదు. ఎటొచ్చీ అది 'సమైక్యం' అనే బ్యానర్‌పై జరపాలనుకోవడంతోనే వస్తోంది చిక్కు. అశోక్‌బాబు సమైక్యవాదానికి మంచి స్పోక్స్‌మన్‌గా ఎదిగారననడంలో సందేహం లేదు. అయితే పోనుపోను ఆయనకు మించిన భూమిక నిర్వహించబోయారు. జేజేలకు మురిసిపోయి సంయమనం మరచి, ప్రగల్భాలు పలికి, పలుచనయ్యారు. ఆయన గుణదోషాలు ఎలా వున్నా ఆయనది పాత్ర పరిధి చిన్నదే కాబట్టి లాభనష్టాలు తక్కువే. కానీ రాజకీయనాయకులు సమాజాన్ని ప్రభావం చేయగలిగే స్తోమత కలిగి వున్నారు కాబట్టి వారి ఆలోచనా విధానమే మనకు ప్రధానం.
ఉద్యోగులకు, కిరణ్‌కు సమీకరణం బాగా వుండడం వైకాపా సహించలేకపోతోంది. సోనియా నాటకంలో కిరణ్ తన కప్పగించిన పాత్ర నిర్వహిస్తున్నారని, విభజనకు పరోక్షంగా దోహదపడుతున్నారని పదేపదే ఆరోపిస్తోంది. రాష్ట్రం సమైక్యంగా వుంటే ముఖ్యమంత్రిగా తనను కొనసాగించరు కాబట్టి, సొంత పార్టీ పేరుతో సీమాంధ్రలోనైనా సీట్లు తెచ్చుకోవాలంటే విభజనే శరణ్యమని కిరణ్ నమ్మి ఆచరిస్తున్నారని వైకాపా ఆరోపణ. సేమ్ యివే ఆరోపణలు జగన్‌పై యితరులు మోపుతున్నారు. సోనియాతో కుమ్మక్కు కాకపోతే బెయిలు ఎలా దక్కింది? అతనిపై కేసులు నత్తనడక నడుస్తున్నాయేం? విడిపోతే జగన్‌కు కూడా లాభమే. ఎందుకంటే తెలంగాణ యూనిట్ బాగా దెబ్బ తింది కాబట్టి సమైక్యరాష్ట్రంలో జగన్ సిఎం అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు జగన్ సోనియాను తిట్టినా, కిరణ్ సోనియాను ఎదిరించి పార్టీ పెట్టినా, రేపు ఎన్నికలైన తర్వాత యిద్దరూ సోనియా పంచన చేరతారని చాలామంది అంటూ వుంటారు. సోనియా అధికారంలోకి వస్తేనే అది జరగవచ్చు తప్ప, ప్రతిపక్షంలో వున్న సోనియా పంచన చేరి వీళ్లు బావుకునేది ఏముందని నేనంటాను. కేసుల కారణంగా అధికారంలో ఎవరుంటే వారికే జగన్ వత్తాసు పలకవచ్చు.
కిరణ్ ఎటుపోతారో ఎవరూ చెప్పలేరు. అసలు పార్టీ పెడతారో లేదో కూడా కొందరికి డౌటు కానీ పెట్టడానికే ఛాన్సుంది. ఎందుకంటే సోనియా పేరు చెపితే ఓట్లు రాలవని గ్రహించిన కాంగ్రెసువాళ్లు పక్కచూపులు చూస్తున్నారు. కొత్త పార్టీ వైకాపాలో బెర్తులనీ గబగబా నిండిపోతున్నాయి. పాత పార్టీ టిడిపిలో ప్రతి నియోజకవర్గంలో ముందునుండీ పాతుకుపోయిన నాయకులున్నారు. వాళ్లందరినీ పక్కన పడేసి వీళ్లకు యివ్వగలరా? ఎటూ పోలేని కాంగ్రెసు నాయకులు కిరణ్‌పై ఒత్తిడి తెచ్చయినా పార్టీ పెట్టించవచ్చు. కిరణ్ వ్యక్తిగత గ్లామర్ ప్రశ్నార్థకమే అయినా, సమైక్యవాదానికి ఉన్న బలంతో ఓట్లు రాలవచ్చని వాళ్ల అంచనా. సమైక్యవాదానికి కిరణ్ ఏం చేస్తున్నారు? 'బిల్లు ఆపుతానన్నారు, అసెంబ్లీకి రాకుండా ఆపగలిగారా? స్టార్ బ్యాట్స్‌మన్ అన్నారు, డక్ ఔట్ అయ్యేట్టున్నారు, ఆయన అన్న ఆఖరి బంతి ఎప్పుడు వస్తుంది, ఆట అయిపోయాకనా?' – యిలాటి సెటైర్లు చాలా వేస్తున్నారు. స్టార్ బ్యాట్స్‌మన్, బ్రహ్మాస్త్రం వంటి అతిశయోక్తులు రాజగోపాల్వి. కిరణ్‌వి కావు. ఢిల్లీలోని కేంద్రప్రభుత్వం ఎంత పట్టుదలగా వుందో చూస్తున్నాం. ఆర్థిక వివరాల గురించి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ లేఖ రాస్తే, దానికి హోం శాఖ నుండి వచ్చిన జవాబు చూడండి – ఎంత ఘోరంగా వుందో! 'అన్నీ మేం యిక్కడ పార్లమెంటులో చూసుకుంటాం, మీకు చెప్పనవసరం లేదు' అనేశారు.
కాంగ్రెసు అధిష్టానం ముసాయిదా బిల్లును ప్రెత్యేక విమానంలో పంపింది. మాటిమాటికీ తన పరిశీలకులను పంపి బిల్లు పురోగతిని సమీక్షిస్తోంది. దిగ్విజయ్ వచ్చి 25, 30 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలను దారిలో పెట్టి వెళ్లారని వినికిడి. ఎవరో కుంతియా, యిప్పుడు ఆజాద్ – వీళ్లందరూ బిల్లుకోసమే వచ్చారు. సోనియా సహచరగణమంతా ఫిబ్రవరిలో పార్లమెంటులో బిల్లు పాసవుతుందనే చెపుతున్నారు. మరో పక్క బిజెపి నుండి సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్.. కూడా అదే చెపుతున్నారు. ఇంతమంది కలిసికట్టుగా విభజన రథాన్ని లాగుతూండగా కిరణ్ చిన్న చిన్న అడ్డంకులు పెట్టడం తప్ప మరేం చేయగలరు? కిరణ్ ఏమీ చేయలేదు అనేవాళ్లు ఆయన స్థానంలో రోశయ్యగార్ని వూహించుకుని చూడాలంటాను. ఆయనుంటే యింతైనా జరిగేదా? పోనీ దేవినేని ఉమ, కోడెల, పయ్యావుల కేశవ్ వంటి టిడిపి నాయకులు చేయగలిగేవారా? తన పార్టీ అధినాయకుడి చేత లేఖ విషయం పునరాలోచిస్తాను అనిపించగలిగారా? పోనీ జగన్ సమన్యాయం అనే రోజుల్లో అంబటి రాంబాబు ఆయన చేత సమైక్యం అనిపించగలిగారా? అంతో యింతో పబ్లిక్ స్టాండింగ్ వున్న నాయకులే యిలా వుంటే మొన్నటిదాకా ఒక్క ఎమ్మెల్యే కూడా తన వెంట లేని కిరణ్ తన అధినాయకురాలిని యీ స్థాయికి ఎదురు తిరగడం విశేషం కాదా? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)