Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

బాబు పాలన 'సమ్'చరీ

బాబు పాలన 'సమ్'చరీ

చంద్రబాబు వంద రోజుల పాలన పూర్తయింది. ఏ విషయం మీదయినా మాట్లాడుకోవాలంటే ఏదో ఒక లాండ్ మార్క్ వుండాలి కాబట్టి, మొదటి నెల, మొదటి వందరోజులు, ఆరు నెలలు, ఏడాది ఇలా లెక్కలు వేసుకోవాల్సిందే.

నిజానికి ఎవరి ఆతృత కోసం వాళ్లు లెక్కలు వేసుకోవడం, ప్రకటనలివ్వడం పక్కన పెడితే వంద రోజుల్లో అధ్భుతాలు చేయడం అన్నది కాస్త కష్టమైన విషయం. అయితే ఓ నాయకుడు ఏ రీతిలో ముందుకు వెళ్లబోతున్నాడన్నది మాత్రం కాస్త అంచనాకు అందుతుంది వంద రోజుల్లో. ఆ రీతిగా మాత్రమే చూడాలి చంద్రబాబు పాలనను. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. ఆంధ్ర ప్రజలకు తెలియని వ్యక్తి కాదు చంద్రబాబు. ఆయన పాలనా రీతి తెలుసు కనుకనే ఉవ్వెత్తున వచ్చిన జగన్ వేవ్ ను వద్దనుకుని, బాబును ఎన్నుకున్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి బాబు చేయాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు వున్నాయని జనం అభిప్రాయ పడ్డారని దీంతో స్పష్టమైంది. అందువల్ల ఇప్పుడు జనం ఆశిస్తున్నది చంద్రబాబు నుంచి రోటీన్ పాలన వ్యవహారాలు కాదు. వారికి తెలుసు, వాటి విషయంలో చంద్రబాబు ఎలాగూ ఘటికుడని. అందువల్ల జనం ఆశిస్తున్నది అంతకు మించిన అద్భతం. అలాంటి అధ్భుతానికి వంద రోజులు నథింగ్. అయిదేళ్లకు కూడా ఆ తరహా ప్రగతికి బాటలు పడతాయేమో తప్ప, మరీ సంపూర్ణం కావడం అన్నది అసాధ్యం.

ఇంతకీ ఏమిటి?

జనం బాబును ఎన్నుకున్నది ఎందుకన్నది అందరికీ తెలిసిందే. విభజన నేపథ్యంలో ఆంధ్రకు అన్యాయం జరిగింది. మళ్లీ ఆంధ్ర పునాదుల్లోంచి లేవాలి. ఓ అధ్భుతమైన రాష్ట్రంగా మారాలి. ఇతర రాష్ట్రాలు చూసి అసూయ పడే రేంజ్ లో ఎదగాలి. హైదరాబాద్ ఎలా అయితే మన జనంతో కళకళలాడుతోందో, ఆంధ్రలోని ప్రధాన నగరాలు అలా కనిపించాలి. ఈ దిశగా సాగుతున్నాయి ఆంధ్ర జనాల ఆశలు. వాటికి సంబంధించి మాత్రం ఇంకా బాబు ప్రయత్నాలు ఫలించలేదు. అలా అని ఆయన ప్రయత్నాలు చేయలేదు అనడానికి లేదు. కానీ అందుకు తగ్గ అవకాశాలు ఇక్కడ ముందు తయారు కావాలి. హైదరాబాద్ పై ప్రేమ అంత వేగంగా తగ్గిపోయేది కాదు. కానీ అంతకు మించిన ఆకర్షణ ఆంధ్ర పట్టణాల్లో కనిపించాలి. 

పన్ను రాయతీలు, స్పషల్ ఇన్ టెన్సివ్ లు, ఇలాంటివి సహజంగా పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకుంటాయి. కానీ ఇంతవరకు కేంద్రం ప్రత్యేక హోదా అన్నది ప్రకటించలేదు. ఇరు రాష్ట్రాలకు కావచ్చు, ఒక్క రాష్ట్రానికి కావచ్చు వివిధ రాష్ట్రాల ఎన్నికలు ఇందకు అడ్డంకిగా మారాయన్నది వాస్తవం. ఆ అడ్డు తోలగితే తప్ప కేంద్రం ప్రకటన రాదు. అది వస్తే తప్ప పని జరగదు. ఈ లోగా బాబు ఏదో ఒకటి సాధించాలని కిందా మీదా అయితే పడుతున్నారు. ఏదో ఒక పరిశ్రమ తేవాలి..ఏదో ఒక సంస్థ రావాలి. జనం ముందు తాను కాలర్ ఎగరేయగలగాలి అన్న తపన మాత్రం బాబులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా అంత సులువు కాదు, కొంత కాలం పడుతుంది అని ఆయనకు తెలుసు. కానీ అలా చెప్పడానికి ఆయన సంకోచిస్తున్నారు. ఏదో చేస్తున్నాననే చెప్పాలనుకుంటున్నారు. అందుకోసం కాస్త ఎక్కువ ప్రచారానికి, హడావుడికి కూడా పాల్పడతున్నారు. ఇదిగో తోక, అంటే అదిగో పులి అన్న స్టయిల్ ను అలవర్చుకుంటున్నారు. తీసుకుంటున్న చర్యలను భూతద్దంలో చూపించడంలోనే ఈ వందరోజులు సరిపోయింది. ఏదో చేస్తున్నామన్న భ్రమ జనాలకు కల్పించాలన్న ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇందులో బాబు తప్పిదం కూడా అంతగా లేదు. జనం ఇన్ స్టాంట్ ఫలితాలను కోరుకుంటున్నారు. ఇలాంటి ఫలితాల కోసం బాబు తన దగ్గర మంత్ర దండం ఏదీ లేదని, అయిదేళ్లు  వేచి వుండడని నిర్మోహమాటంగా చెబితే ఈ జనం అర్థం చేసుకోవడం కష్టం. 

పైగా మరి ఎన్నికల ముందు అంతన్నాడింతన్నాడే..గంగరాజు..అన్న టైపులో రివర్స్ క్లాస్ పీకుతారు. అందుకే బాబు తన పనులు తాను చేసుకుంటూనే, వారిని కాస్త భ్రమల్లోకి నెట్టే పని కూడా తలకెత్తుకున్నారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు, స్మార్ట్ సిటీలు, ఇవన్నీ అంత సులువుగా సాధ్యమయ్యేవి కాదు అని ఆయనకూ తెలుసు. కానీ జనానికి అవే చెబుతున్నారు. వారికి కూడా అవేవో వచ్చేస్తున్నాయి అన్న ఆలోచనే బాగుంటోంది. ఈ లోగా కేంద్రం రాయతీల ప్రకటన వస్తుంది. అప్పుడు తలా పరిశ్రమ వస్తాయి. అయిదేళ్ల నాటికి ఎయిర్ పోర్టులు, స్మార్ట్ సిటీలు, పోర్టులు రాకున్నా, అన్ని ప్రాంతాలకు ఎన్నో కొన్ని కొత్త పరిశ్రమలు, సంస్థలు గ్యారంటీగా వస్తాయి. విశాఖ, విజయవాడ మెట్రో వంటి వ్యవహారాలు పేపర్ల మీద లెక్కలు పూర్తి చేసుకుని, పనులకు సిద్ధమవుతాయి. కేంద్రం దయతలిస్తే ఒకటయినా స్మార్ట్ సిటీ ప్రకటన వస్తుంది. 

అప్పుడేం చేస్తారు

అప్పుడు బాబు కచ్చితంగా చేసినవే చెబుతారు. మరోసారి తను ఇంతకాల ఊరించినవాటి గురించి చెబుతారు. ఇన్ని చేసిన తాను వాటిని మాత్రం చేయలేనా అని ప్రజలనే ఆలోచనల్లో పడేస్తారు. చేయాలంటే తాను రావాలన్న ఆప్షన్ వాళ్ల ముందుంచుతారు. దాంతో జనం నిజమే కదా అనుకుంటారు. ఈ మాత్రం అభివృద్ధి అయిదేళ్లలో తెచ్చారు కాబట్టి, మరో అయిదేళ్లు చాన్సిస్తే పోలా అనుకుంటారు. ఇదీ బాబు వ్యూహాలోచన. అది నిజమూ కావచ్చు. ఆ రోజను దృష్టిలో వుంచుకునే ఇప్పుడు బాబు రోజులు గడుపుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఆ రోజు ఏదో ఒక సమాధానం చెప్పాల్సి వుంటుందని ఆయనకు తెలియంది కాదు. అందుకే ఇప్పుడు ఎన్ని ప్రచార పటాటోపాలకు పాల్పడతున్నా, లోలోపల సమ్ థింగ్ చేయడానికే చూస్తున్నారు. 

మరి అడ్డమేది?

మరి ఇంక సమస్యేమిటి? బాబు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి జనాల ఆశలు సజీవంగా వుంచుతున్నారు. మరేదో ఒకటి అయిదేళ్లలో ఎలాగూ సాధిస్తారు. ఇంకేమిటి సమస్య అని అనుకోవచ్చు. కానీ సమస్య వుంది. జనం ఇది ఒక్కటే ప్రాతిపదికగా తీసుకోరు వ్యవహార శైలి కూడా చూస్తారు. గతంలొ బాబు పాలించిన దానికి ఈసారి పాలిస్తున్న దానికి కాస్త భిన్నమైన శైలి కనిపిస్తోంది. గతంలో బాబు చాలా వరకు రాగద్వేషాలకు అతీతంగా వుండేవారు. ఆయనకు సన్నిహితులైన కొంత మందికి మాత్రమే పనులు జరిగేవి. వారే పెరిగి పెద్దయ్యారు. మిగిలిన వారు లోలోపల బాధ పడ్డారు. మనవాళ్లకి బాబు ఏమీ చేయడని, కొందరికే చేస్తారని. వైఎస్ వచ్చాక ఇటు కాంగ్రెస్, అటు దేశం, ఇలా అన్ని పార్టీలకు, చెందిన వారు లబ్ధిపొందారన్నది వాస్తవం. దగ్గరకు రాని వాళ్లది పాపం,. వైఎస్ అందరికీ ఎస్ అన్నారు. మనవాడా..వాళ్ల వాడా అన్నిది చూడలేదు. అందువల్ల అన్ని పార్టీల వ్యాపార వేత్తులు బాగు పడ్టారు. 

ఇప్పుడు బాబు ఈ స్టయిల్ ను కొంత వరకు అడాప్ట్ చేసుకుంటున్నార. మనవాళ్లు అన్నది ఇప్పుడు ఆయనకు కొంచెం ఎక్కువగానే పడుతున్నట్లు కనిపిస్తోంది. దానికి తోడు విజయవాడ గుంటూరుకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత అన్నది ఆయనకు తప్పడం లేదు. అది ఈ వంద రోజుల్లోనే కాస్త స్పష్టమైంది. అయిదేళ్లలో ఈ వ్యవహారాలాలు మరింత స్పష్టమైతే, మిగిలిన ప్రాంతాల వారు తమ వాటాగా అందిన మొరమొరాల కన్నా, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు అందిన స్వీట్లు, బాబు జనాలకు అందిన తాయిలాలపై దృష్టి పెట్టే అవకాశం వుంది. అప్పుడు మాత్రం కాస్త కష్టమవుతుంది. 

అందువల్ల ఈ వందరోజుల మంచి చెడ్డలను ముందుగా లెక్కలు, అంచనాలు వేసుకోవాల్సింది ఇతర పార్టీల వాళ్లు, మీడియా జనాలు కాదు..చంద్రబాబే. తాను వెళ్తున్న దారి ఎలా వుందో, ఆయనే ఆలోచించుకుని తగినమార్పులు చేసుకుంటే ఆయన అనుకున్న గమ్యం చేరగలుగుతారు అయిదేళ్ల తరువాత. లేదంటే జనం ఆలోచనను తక్కువ చేసినవారవుతారు.

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?