Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

లవ్‌లెటర్‌ 2హరీష్‌ : ప్రజలంటే ప్రాంతమా?

లవ్‌లెటర్‌ 2హరీష్‌ : ప్రజలంటే ప్రాంతమా?

డియర్‌ హరీష్‌భాయ్‌!

నువ్వు సావధానంగా చదివి తెలుసుకోవాల్సింది ఒకటున్నది హరీష్‌భాయ్‌!

‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అని నినదించిన గురజాడ జన్మించిన తెలుగుజాతి మనది. తెలంగాణలో ఉన్నా... ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా.. మనది తెలుగుజాతి. ఈ విషయం నువ్వయినా కాదనలేవు. అంటే గనుక.. నీ జనమే నవ్విపోతారు. దేశం అంటే మట్టి, ప్రాంతాలు కాదు.. ప్రాణం ఉన్న మనుషులు అనే ఉదాత్తమైన సందేశాన్ని ఇచ్చిన మహాకవి పాటల్ని బహుశా నువ్వు కూడా చిన్నతనంలో చదువుకునే ఉంటావు. ఆ స్ఫూర్తిని అందుకునే ఉంటావు. 

మరి ఇప్పుడు ఇంత సంకుచితంగా మాట్లాడుతున్నావు ఎందుకు? చంద్రబాబు చేసిన ప్రకటనల గురించి అంతగా ఉడుక్కుంటున్నావు ఎందుకు? తెలుగు ప్రజలు అందరినీ తిరిగి ఒక్కటిచేసే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నదని.. చంద్రబాబు అన్నాడే అనుకో.. అందులో నువ్వు ఉడుక్కుని ఖండించాల్సిన విషయం ఏమున్నదో జనానికి మాత్రం అర్థం కావడం లేదు. తెలంగాణలో కాంగ్రెసును, తెలుగుదేశాన్ని ఖాళీచేసేసి.. ఏకపార్టీస్వామ్యంగా ఎప్పటికీ గద్దె దిగని ఏలుబడి సాగించాలని కోరుకుంటున్న తమరు.. ఏదో ఒక మాయ మాటలు చెప్పి తెదేపా నాయకుల్లో పార్టీని వదలిపోవాలనే ఆవేశాన్ని రెచ్చగొట్టాలని అనుకుంటున్నట్లున్నారు. 

‘‘తెలుగుజాతిని ఒక్కటిచేస్తానని అంటూ విడిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి సీమాంధ్రలో కలిపేస్తానని అంటున్న చంద్రబాబు పార్టీలో తెలంగాణ నాయకులు ఎలా ఉంటారో తేల్చుకోవాలని’’ తమరు హెచ్చరిస్తున్నారు. జాతి ఒక్కటి కావడమంటే.. రాష్ట్రాలు ఒక్కటి కావడమేనా? అయ్యో మీరు అంత సంకుచితంగా ఆలోచించగలరని అసలు ఇన్నాళ్లూ అనుకోలేదు మిత్రమా!

రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం తెలుగుజాతి మధ్య విషబీజాలు నాటారు మీరు! మీరు కలగన్న అధికారం దక్కింది. ఇక విషబీజాల సేద్యం అక్కర్లేదని.. సీమాంధ్రుల్ని వేరుగా చూడాల్సిన అవసరం లేదనే తత్వాన్ని మీ మామ బోధపరచుకున్నారు. కానీ.. రేపటి నాయకుడు అయిన తమరు తెలుసుకోకపోవడం శోచనీయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సాగిన వివాదాలు, శోచనీయమైన పరిణామాల నేపథ్యంలో.. తెలుగుజాతి రెండు రాష్ట్రాల్లోని ప్రజలు మానసికంగా విడిపోయారు. అన్నదమ్ముల మధ్య అనుమానాలు, అపోహలు ప్రబలాయి. 

ఇప్పుడు తెలుగుజాతిని ఒక్కటిచేస్తానని చంద్రబాబు అనడం అంటే.. ఆ అపోహల్ని తొలగించి.. స్నేహసుహృద్భా వాతావరణాన్ని ఇరు ప్రాంతాల, తమరికి సంతృప్తిగా ఉండాలంటే.. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య నెలకొల్పడం అని మాత్రమే చంద్రబాబు ఉద్దేశం. ఈ మాటలను ఆయన మనస్ఫూర్తిగా అన్నారా.. తెలంగాణలో కూడా తమ బేస్‌ కాపాడుకోవడానికి నాటకంలో భాగంగా అన్నారా అనేది వేరే సంగతి. కానీ ఆ మాటలు మాత్రం ఖండనార్హం కావు. ఆ సత్యాన్ని తమరు తెలుసుకుంటే మంచిది. 

మీరు కూడా సుదీర్ఘకాలం తెలంగాణను ఏలవలసిన వారు.. ఇక్కడ మన తెలుగుజాతి సోదరులైన సీమాంధ్రులే కాదు.. ఎన్నో రాష్ట్రాల వారున్నారు. అందరూ సోదరులే అవుతారు. నాయకుడిగా ఆస్ఫూర్తిని నిలుపుకున్నంత కాలమూ మీరు సుభిక్షమైన పాలన సాగించగలుగుతారు. ప్రజల మన్నన పొందగలుగుతారు. ప్రేమతో గ్రహించగలరు.

ప్రేమతో

కపిలముని

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?