Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: నన్ను చూసి ఏడవకురా...

ఎమ్బీయస్‌: నన్ను చూసి ఏడవకురా...

హైదరాబాదులో ఆటోల వెనుక, లారీల వెనుక కనబడే నినాదం - 'నన్ను చూసి ఏడవకురా..'! చాలామంది 'నను చూసి ఎడ్వకురా' అని రాయిస్తూ వుంటారు. అది చదివి నాకు నవ్వు వస్తూంటుంది. 'నిన్ను చూసి కాదు, నీ తెలుగు చూసి ఏడుస్తున్నానురా బాబూ' అని చెప్పాలనిపిస్తుంది. నిజానికి ఆ ఆటో లేదా లారీ డ్రైవర్ని చూసే అవకాశం, అవసరం మనకు ఉండదు. ఇలా రాయించారు కాబట్టి ఓసారి మొహం చూడగానే ఏడుపు వస్తుందేమో పరీక్షించి చూద్దామనిపిస్తుంది.

మొహం కాదు, అతని ఆర్థిక స్థితిగతులు చూసి మనం ఏడుస్తూన్నామని అనుకుంటున్నాడా? భుక్తి కోసం ఆటో లేదా లారీ నడిపేవాణ్ని చూసి అసూయ పడే వాళ్లు జనాభాలో ఎంత శాతం ఉంటారంటారు? ఆ బండేదో నడిపి తాము చాలా ఉన్నత స్థానానికి చేరిపోయామని, తమను చూసి తక్కుంగల జనాలంతా కుళ్లి ఛస్తున్నారనీ వాళ్ల భావనా!? నా అనుమానం - అది వాళ్లను ఉద్దేశించిన నినాదం కాదు. మనందరి మనసుల్లో అనుకునే మాటను లారీ లేదా ఆటో యజమాని అక్కడ రాయించి వుంటాడు. 

మనం తమాషా మనుషులం. లోకంలో మనంత దురదృష్టవంతులం లేరని సణుగుతూ వుంటాం. దేవుడు మనమీద అన్యాయంగా పగ బట్టి యీ ప్రాంతంలో, యీ మతంలో, యీ కులంలో, యీ యింట్లో పుట్టించాడని, ప్రతిభకు తగ్గ అవకాశం, శ్రమకు తగ్గ ఫలితం యివ్వటం లేదని, మన మంచితనాన్ని లోకం కాదు కదా కుటుంబసభ్యులు సైతం గుర్తించటం లేదని ... ఎప్పుడూ ఏడుస్తూంటాం. అదే సమయంలో చుట్టుపక్క వాళ్లందరూ మనను చూసి ఏడుస్తున్నారనీ ఫీలవుతాం. రెండు ఎలా పొసుగుతాయి? పక్కవాళ్లు కుళ్లుకుని చచ్చేటంత గొప్పగా వున్నామని సంతోషించి, తృప్తి పడి, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పవచ్చు. లేదా లోకంలో  అత్యంత హీనస్థితిలో ఉన్నామనీ, మనల్ని చూసి ఈర్ష్య పడేవాడెవడూ లేడు అనుకుని నిశ్చింతగా బతకవచ్చు. రెండూ చేయం. 

ఓకే, వాడెవడో మన కంటె అధమ స్థితిలో వున్నాడు కాబట్టి అసూయపడ్డాడు అనుకుని వాడి మీద జాలిపడవచ్చుగా! అబ్బే, అలా అనుకోం. వాడు మనకు దిష్టి కొట్టాడు అని తిట్టుకుంటాం. నేను అవసరాని కంటె ఎక్కువ తినడం వలననే అరగలేదు అనుకోం, నేను తింటూండగా పక్కవాడు చూసి దిష్టి కొట్టడం వలననే అరగలేదు అనుకుంటాం. మార్కులు రాకపోవడానికి, ప్రమోషన్‌ తప్పిపోవడానికి, ఒళ్లు పెరగడానికి, కాపురం సవ్యంగా జరగకపోవడానికి.. వేయేల ప్రతీ పనికీ, యీ దిష్టికీ ముడి పెట్టేస్తార.

పిల్లలకు దిష్టి చుక్క పెడతాం, పెద్దలకు తాయెత్తులు కడతాం, వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతాం, ఇంటిముందు దిష్టి గుమ్మడికాయ పెడతార, పొలాల్లో దిష్టిబొమ్మలు పెడతార. ఆధ్యాత్మిక పత్రికల వాళ్లు 'దిష్ట్టి పోగొట్టే వినాయకుడు' రేకులు బహుమతిగా యిస్తూంటే విరగబడి కొనేస్తాం. కొన్ని సందర్భాల్లో ఆ దిష్టి కొట్టేవాళ్లను ఐడెంటిఫై కూడా చేసేస్తార. చిన్న పిల్లలకు దిష్టి తీసినప్పుడు 'ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి..' అంటూ యింటిపక్కవాళ్లను ప్రథమ ముద్దాయిలుగా నిలబెట్టి, వాళ్లను తిట్టుకుంటూ మెటికలు విరుస్తాం. బైబిల్‌లో 'లవ్‌ దై నైబర్‌' అన్నారు కానీ యిలాటి సందర్భాల్లో మనం 'సస్పెక్ట్‌ దై నైబర్‌'! వాళ్లను తలచుకుని నిప్పులో ఉప్పురాళ్లు పడేసి పటపటలాడిస్తాం. దిష్టి మీద మనకు ఎంత నమ్మకమంటే వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదని వాపోయే రైతు కూడా పొలంలో దిష్టిబొమ్మ తీయడు, దివాలా తీసి షాపు ఎత్తేసే రోజున కూడా షావుకారు పొద్దున్నే నిమ్మకాయలు కోసి, కుంకం అద్ది అటూయిటూ పడేస్తాడు

హిందీవాళ్లయితే వాళ్లకు దిష్టి కొట్టిన వాళ్లకు ఎలాటి శిక్ష వేయాలో ముందే ప్లాను చేసి పెట్టుకుంటారు. వాహనాల వెనుక వాటి గురించి హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. 'బురీ నజర్‌ వాలే, తేరా ముహ్‌ కాలా' అని! 'నీ మొహం మాడ' అని అర్థమో, లేక మేమే నీ మొహానికి నలుపు రంగు పూస్తాం అనే కార్యాచరణ పథకమో తెలియదు. ఇంకా కొంతమంది మరీ ముందుకు వెళ్లి 'నువ్వు నూరేళ్లు బతకాలి, నీ పిల్లలు సారా తాగితాగి చావాలి' అని శాపాలు పెడతారు. హిందీవాళ్లకు అవతలి వాళ్ల 'జలన్‌'పై కూడా చాలా నమ్మకమని వాళ్ల సినిమా పాటలు వింటే తెలుస్తుంది. అందమైన తమ ప్రేమజంటను చూసి ప్రపంచమంతా ఉడుక్కుని ఛస్తోందని వాళ్లకు మహా కులుకు. ఉడుక్కుంటున్నామని లోకం వచ్చి చెప్పదు. వీళ్ల పాటికి వీళ్లు అనుకుంటారంతే. అనుకుని వాళ్ల మీద కత్తి కడతారు. ఇవి చాలా దశాబ్దాలుగా వింటున్న మాటలు. 

ఇటీవల రెండు దశాబ్దాలుగా తెలుగునాట ప్రబలంగా వినబడుతున్న మాట - నరఘోష! ఇది జ్యోతిష్కులు, న్యూమరాజలిస్టులు, రత్నాలు ధరించమనేవారు, పూజలు, జపాలు చేయించేవారు విరివిగా వాడుతున్న మాట. 'నీకు శత్రువులున్నారు, వారి నుంచి కాపాడుకోవడానికి నువ్వు ఫలానా జపాలు చేయించాలి, ఫలానా రాళ్లు ధరించాలి' అంటున్నారు. 'నాకెవరూ శత్రువులు లేరండీ' అని విన్నవించుకున్నా వినరు. 'నీ పాటికి నువ్వు నీ పని చేసుకుని పోతూ వున్నావు కానీ నరఘోష వుంది. అందుకే నీకు కార్యం సిద్ధించటం లేదు, అనుకున్నది జరగటం లేదు' అని నమ్మబలుకుతారు. నరఘోష అనే పదమే చిత్రంగా తయారైంది.

మనం వాటి జోలికి పోకపోయినా గ్రహాలు మనను గుర్తు పట్టి, మనపై పగబట్టాయని ఎలాగూ చెప్తారు. ఇప్పుడు నరులను కూడా చేర్చారు. కొంతకాలానికి జంతుజాలాన్ని కూడా చేరుస్తారేమో చూడాలి. పాములకు, దయ్యాలకు కూడా మనుషుల కుండే సమస్త అవలక్షణాలూ వున్నాయని టీవీ సీరియల్స్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు. 'ఒక నాగకన్య నీపై మోహపడి, నీ భార్యపై అసూయపడి చంపేద్దామని చూస్తోంది. అదే నీ భార్య అనారోగ్యానికి కారణం. ఈ సర్పఘోషకై హోమాలు చేయించాలి' అనే చెప్పే రోజులు వచ్చినా త్వరలో ఆశ్చర్యం లేదు. జనాలు నిన్ను చూసి ఏడుస్తున్నారు అని చెప్పాలంటే 'నరరోదన' అనాలి. కానీ మంచి ఎఫెక్టివ్‌గా వుండాలని, ఏకంగా 'ఘోష' అనేశారు. అంటే చాలామంది ఒకేసారి పెద్దపెట్టున ఏడ్చి గగ్గోలు పెట్టేశారన్న ధ్వని వుంది. ఆ మాట వినగానే యిదేదో పెద్ద వ్యవహారంలా వుందే అనుకుని ఫీజు దండిగా యిచ్చుకుంటాడు యీ జీవుడు. 

ఈ నరఘోష చెప్పి భయపెట్టడానికి తోడు పెద్ద పార్టీలకై శత్రువులను నిర్జించే ప్రోగ్రాం కూడా పెట్టారు. దాని కోసం ప్రత్యంగిరా దేవిని పూజించాలని కూడా ప్రచారంలోకి తెచ్చారు. ఈవిడ యింతకు ముందు నుంచీ కూడా వుందిట. కానీ నేను యిటీవలే, యిలాటి సందర్భాల్లోనే.. వింటున్నాను. ఒక డిజిపిగారు తన శత్రువుల పని పట్టడానికి రహస్యంగా ఆ దేవికి పూజలు చేయించారని, హైదరాబాదులో ఒక గుడి యిలాటి రహస్య పూజలకు పేరు బడిందనీ వార్తలు వచ్చాయి. గుళ్లల్లో భారీ పూజలు చేయించే సత్తా లేని కొంతమంది యిళ్లల్లో తమంతట తామే చదవడం మొదలుపెట్టారు.

తమకు శత్రువులు లేరని అనుకోవడం కంటె ఉన్నారని, తన బాగు చూడలేక తన పనులకు అడ్డు పడుతున్నారని అనుకోవడం సులభం కదా! డిజిపికి ఆయన స్థాయి శత్రువులుంటే, మనకి మన స్థాయి శత్రువులుంటారని మన భావన. వాళ్లు నశించిపోవాలని మనం దణ్ణాలు పెట్టుకుంటాం. దేవుడు మన గోడు వింటాడా? 'ముద్దయీ లాఖ్‌ బురా చాహే తో క్యా హోతా హై? వహీ హోతా హై జో మంజూర్‌-ఎ-ఖుదా హోతా హై' అని కవి వాక్యం. ఇది కూడా లారీలు మోసుకుని వచ్చే సందేశమే. 'అర్జీదారు అవతలివాడికి రకరకాలుగా నష్టం జరగాలని ఎంత యిదిగా కోరుకున్నా ఏం లాభం? భగవంతుడు ఏది అనుమతిస్తే అదే జరుగుతుంది.' అనేది నమ్మితే మనం లక్ష తిట్టుకోవడం వేస్టు కదా. వాడు చెడు చేస్తే వాడికి పడాల్సిన శిక్ష ఎప్పటికో అప్పటికి పడుతుంది. ఈలోగా మనమెందుకు బుర్ర పాడుచేసుకోవడం? అనుకోవచ్చు కదా!

అంతకంటె ముఖ్యంగా మనం తీవ్రంగా ఆలోచించాల్సింది - అసలు ఎవరైనా మనను చూసి ఏడుస్తారా అని. వాడూ మనలాటి వాడే కదా, మనం యింకోణ్ని చూసి ఏడుస్తున్నామా? మన కంత తీరిక వుందా? ఏడిస్తే ఏం లాభం, అవతలి వాడి ఆస్తిలో ఓ రూపాయైనా తరగదు కదా అనే అవగాహన మనకు లేదా? ఏడవాలంటే ఎందర్ని చూసి ఏడవాలి చెప్పండి. పొద్దున్న పేపరు తెరవగానే, టీవీ ఆన్‌ చేయగానే ఒక అధికారి 200 కోట్లు తినేశాడంటారు, మరో నాయకుడు 200 ఎకరాలు మింగేశాడంటారు. రోజురోజుకి కొత్త పేర్లు. న్యాయంగా కోట్లు సంపాదించేవారి పేర్లు చూసినా రోజూ బోల్డు పేర్లు తారసిల్లుతాయి. మనకు చూస్తే పైసా పుట్టాలంటే చుక్కలు కనబడుతున్నాయి. మరి వాళ్లందరినీ తలచుకుని కుములుతూంటే పొట్ట గడుస్తుందా? మన రాత యింతే అనుకుని రోజువారీ పనిలో పడతాం తప్ప వాళ్లపై పగలు పెట్టేసుకోం. మన గురించి అవతలివాడూ అంతే! 

అసలు వీటన్నిటికీ కారణం మన అహంకారం. మనల్ని మనం చాలా సీరియస్‌గా తీసుకుంటాం. లోకంలో అందరూ అలాగే తీసుకుంటున్నారని అనుకుంటాం. మనం నలిగిన చొక్కా వేసుకుంటే లోకమంతా చూసి విస్తుపోతోందని అనుకుంటాం. నిజానికి ఎవడి లోకంలో వాడుంటాడని, మన గురించి వర్రీ అయ్యే తీరిక ఎవరికీ లేదని గుర్తించం. మనం పైకి రాకుండా ఎవడో పని గట్టుకుని తొక్కేస్తున్నాడని, మనను ఎలా అణచాలా అని నిరంతరం ఆలోచించేస్తున్నాడనీ అనుకుంటాం. మనకు తెలిసున్నవాళ్లలో మనల్ని చూసి ఏడిచేవాడెవడా అని నిదానంగా ఆలోచించి చూడండి. నేను చిన్నపుడు లక్షాధికారి కావడం, కారుండడం గొప్ప  అనుకునేవాణ్ని. అవి నాకు దక్కేసరికి చుట్టూ కారులు, లక్షాధికారులు కనబడ్డారు. అఫ్‌కోర్స్‌, నేనెవరో తెలియనివాళ్లలో కారులు, లక్షలు లేని వారు, పూట 

గడవడం కష్టమైనవారూ ఉన్నారు. కానీ వాళ్లంతా వ్యవస్థపై కోపంగా వుంటారు, ఈ డబ్బున్నవాళ్లందరూ యింతే అని సామూహికంగా తిడతారు తప్ప వ్యక్తిగతంగా నాకేసే వేలు చూపి కసి పెంచుకోరు. నిజానికి వారిలో చాలామంది యిదంతా తమ తలరాత అనీ, పూర్వజన్మలో కర్మఫలమని సర్దిపెట్టుకుంటారు కూడా.  నేను వారిని ఉడికించకపోతే, వెక్కిరించకపోతే, హీనంగా చూడకపోతే నా జోలికి రానే రారు. వారి ఊరూపేరూ తెలియకుండానే నా బతుకు గడిచిపోతోంది. మరి అలాటివారికి నేను  నీ మొహానికి మసి పూస్త్తానంటూ శాపనార్థాలు పెట్టడం దేనికి? 

నిజానికి నూటికి 90 సందర్భాల్లో నో బడీ కేర్స్‌ ఫర్‌ అజ్‌. తక్కిన 10 సందర్భాల్లో కూడా అవతలివాడు మన ప్రత్యర్థిగా వుండవచ్చు. ఆటలో ఎదుటివాణ్ని ఓడించి ప్రైజు కొట్టేద్దామని మనమెలా అనుకుంటావో, మనల్ని ఓడించి ప్రైజు కొట్టేద్దామని వాడూ అనుకుంటాడు. అదే విధంగా ఒకటే వేకెన్సీకై ఇంటర్వ్యూకి యిద్దరు వచ్చినపుడు, ఒకే కాంట్రాక్టుకి యిద్దరు టెండర్లు వేసినపుడు, ఒకే స్థానానికి యిద్దరు పోటీ చేసినపుడు యిద్దరికీ ఆశ వుంటుంది. గమనించాల్సింది ఏమిటంటే యీ సందర్భాల్లో అవతలివాడు ప్రత్యర్థే తప్ప శత్రువు కాదు. వాడు నాశనం అయిపోవాలని కోరుకోము.

ఈసారి కాకపోతే మరోసారి, ఇది కాకపోతే మరోటి అనుకుంటాం. మనది రైల్వే టిక్కెట్టు బుకింగ్‌లో వెయిట్‌ లిస్టు నెంబరు1 అనుకోండి. కన్‌ఫర్మ్‌డ్‌ టిక్కెట్టు వున్నవాడికి ఏదో యిబ్బంది వచ్చి టిక్కెట్టు కాన్సిల్‌ చేసుకోవాలని దేవుడికి మొక్కుకోర. సినిమా టిక్కెట్టు క్యూలో మీ ముందు నిలబడినవాడికి అర్జంటు పని గుర్తుకు వచ్చి క్యూ వదిలిపోవాలని దండం పెట్టుకోర. అలా జరిగితే సంతోషిస్తార తప్ప అలాగే జరగాలని ప్లాన్లు వేయర. అవతలివాడూ అంతే! మూడో వ్యక్తి పోటీకి వస్తే యీ ప్రత్యర్థితో చేతులు కలిపి వాడిని తరిమివేయడానికి చూస్తాం కూడా. 

జీవితంలో ప్రత్యర్థులే తప్ప శత్రువులు వుండరా అంటే కొందరికి ఉండవచ్చు. అది కూడా శాశ్వత శత్రుత్వం ఉండదు. ఒకరి పట్ల మరొకరికి కోపం ఎల్లకాలం ఒకే స్థాయిలో వుండదు. అవసరం యిద్దరినీ కలపవచ్చు. అది గుర్తెరిగితే పగలు కొనసాగించడం వ్యర్థమని బోధపడుతుంది. అందుకనే 'పగ అడగించుటెంతయు శుభంబు' అంటాడు కవి.  అబ్రహాం లింకన్‌ ఎన్నో అవమానాలకు, ఎంతోమంది ద్వేషానికి గురయ్యాడు. ఎన్నో సార్లు నమ్మకద్రోహం పాలబడ్డాడు. అయినా అతను కోపగించుకునేవాడు కాదు. 'అతని పరిస్థితిలో నేను వుంటే అదే చేసేవాణ్నేమో' అనేసేవాడు. 'మనమంతా బేసిక్‌గా ఒక్కలాటి వాళ్లమే.

పెరిగిన వాతావరణం బట్టి, అలవర్చుకున్న సంస్కారం బట్టి, విద్యాబుద్ధుల బట్టి, అలవాట్ల బట్టి, పరిస్థితుల బట్టి, పరిమితుల బట్టి ఒక్కోలా ప్రవర్తిస్తాం. అంత మాత్రానికి అవతలివాణ్ని ద్వేషించవలసిన పని లేదు.' అనేది అతని ఫిలాసఫీ. మనకు సంస్కృత శ్లోకం ఉంది. కమలాలు నీటిలో ఉన్నంత సేపు సూర్యుడు మిత్రుడు. వికసింపచేస్తాడు. అదే కమలం నీటి బయట పడితే శత్రువు. ఎండిస్తాడు. సూర్యుడి స్వభావంలో మార్పు లేదు. కమలం పరిస్థితిలో మార్పు వచ్చింది. దాంతో మిత్రుడు శత్రువయ్యాడు. మన పరిస్థితులు మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తే చాలు, పరోక్ష శత్రువుల గురించి పట్టించుకోనక్కర లేదు. వాళ్ల సంఖ్య కొద్దిగానే వుంటుంది.

ఇది స్థూలంగా చెప్పుకోదగిన విషయం. అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష శత్రువులుంటారు. వారి పట్ల మనం ఎలా వ్యవహరించాలి, వారి గురించి ఏ మేరకు ఆలోచించాలి అనేది వచ్చే వారం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?