Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఆంధ్రకు పరిశ్రమలు తరలివస్తాయా? - 1

రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణ నుండి ఆంధ్రకు పరిశ్రమలు తరలి వస్తాయని చాలామంది అనుకున్నారు. ఆంధ్రకు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా యిస్తామని, 13 జిల్లాలలో సగం కంటె ఎక్కువ 7 జిల్లాలలో బుందేల్‌ ఖండ్‌ తరహా రాయితీలు యిస్తామని, ప్రోత్సాహకాలు యిస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ ప్రకటించారు. మీరు ఐదేళ్లంటున్నారు, మేం ఎలాగూ అధికారంలోకి రావడం ఖాయం, దాన్ని పదేళ్లు చేస్తాం అని వెంకయ్యనాయుడు అన్నారు. వీటన్నిటి దృష్ట్యా ఆంధ్రకు పరిశ్రమలు రావడం తథ్యమనే అందరూ నమ్మారు. ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలలో సాధారణంగా భౌగోళిక పరిస్థితి బాగుండదు. ఆంధ్రలో అయితే ఎగుమతులకు దోహదపడే కోస్తా తీరం వుంది, విద్యావంతులైన, పనిలో నేర్పరులైన స్థానికులున్నారు, డబ్బు వుంది. అందువలన స్పెషల్‌ స్టేటస్‌ ప్లస్‌ యీ సౌకర్యాలు కలిస్తే యిక తిరుగులేని స్థానానికి చేరుకుంటుందని, తెలంగాణను తలదన్నుతుందని, ఐదు పదేళ్ల తర్వాత విడిపోవడం మన మంచికే వచ్చిందనుకుంటారని అందరూ భావించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల వారు తమ రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు రాయితీల కోసం అక్కడకు వెళ్లిపోతారని భయపడి అడ్డుపుల్లలు వేయసాగారు. ఈ హంగామా అంతా చూసి ఆంధ్రవాసులు యింకేముంది, తమ స్థలాలకు గొప్ప డిమాండ్‌ వచ్చేసింది అనుకుంటూ భూమి ధరలు అమాంతం పెంచేశారు. బిజెపి, టిడిపి భాగస్వాములు కాబట్టి ప్రత్యేక హోదా, రాయితీలు వచ్చి తీరతాయని అందరూ అనుకుని పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చినవారు యీ ధరలు చూసి జంకారు. కాస్త తమాయించారు. 

ఈలోగా మోదీ స్వభావం తేటతెల్లమైంది. తెలుగు మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్న చంద్రబాబు కేంద్రం నుంచి వచ్చిన ప్రతీ పైసా తన ప్రతాపమే అని రాయించుకుని తన పాప్యులారిటీ పెంచుకుంటారని, దానివలన తనకేం లాభమనే ఆలోచనతో మోదీ నిధులు బిగబడుతున్నారని అందరికీ అర్థమైంది. పెట్టుబడిదారులు సరే, వేచి చూదాం ఎప్పటికో అప్పటికి యివ్వకపోరు, ఇచ్చాకనే కదులుదాం అని ఆగారు. గత నెలలో ప్రత్యేక హోదా హుళక్కి అని తేల్చేశారు. ఇన్నాళ్లూ ఆశ పెడుతూ వచ్చిన బిజెపి, టిడిపి నాయకులు కూడా ఆ విషయం బాహాటంగా చెప్పుకోవలసి వచ్చింది. మళ్లీ ఆ నోటితోనే ప్రత్యేక హోదా పేరుతో కాకపోయినా దాదాపు ఆ బెనిఫిట్‌ వచ్చేటంత రాయితీలు, ప్రోత్సాహకాలు వస్తాయని చెపుతూ వచ్చారు. ఫిబ్రవరి మొదటివారంలో అదీ బయటకు వచ్చింది. ఎక్సయిజ్‌ మినహాయింపు, యిన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ, ఇన్‌కమ్‌టాక్స్‌ రిబేట్‌, టాక్స్‌ హాలీడే యిలాటివి ఏమీ లేవు. కేవలం యంత్రాలపై 15% ఎడిషినల్‌ డిప్రీసియేషన్‌. 

కంపెనీ లాభాలు సంపాదిస్తూ వుంటే, దానిపై యిన్‌కమ్‌ టాక్స్‌ కట్టేటప్పుడు పొందగల అదనపు సౌకర్యం యిది. ఆదాయపు పన్ను కట్టే స్థాయికి ఒక కంపెనీ రావాలంటే కొన్నేళ్లు పడుతుంది. ఇప్పటికే లాభాల్లో వున్న కంపెనీని ఎక్కణ్నుంచైనా తరలిస్తే యీ సౌకర్యం రాదు. ఎందుకంటే కొత్త మెషినరీ మీదే యీ ఫెసిలిటీ. మెషినరీపై పెట్టే ఖర్చులో 15% ఇన్వెస్ట్‌మెంట్‌ ఎలవన్స్‌ కూడా యిచ్చారు. ఇది ఐదేళ్లలో ఎప్పుడైనా క్లెయిమ్‌ చేయవచ్చు. ఇది కూడా లాభాలు వచ్చే పరిశ్రమకు పనికి వస్తుంది తప్ప తక్కినవారికి పనికిరాదు. ఈ ప్రోత్సాహకాలైనా ఆ 7 జిల్లాలలో పెడితేనే వస్తాయి. అక్కడ యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాగా వుంటే కాస్త ముందడుగు వేయవచ్చు. అవి వెనుకబడిన జిల్లాలని ప్రభుత్వమే ఒప్పుకుంది. అక్కడి పరిస్థితులు బాగు చేయాలంటే రాబోయే ఐదేళ్లలో రూ.24350 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. అంటే ఏడాదికి 4870 కోట్లు అన్నమాట. దానికి బదులు వాళ్లు యీ ఏడాది శాంక్షన్‌ చేసినది రూ.350 కోట్లు! అంటే 7% అన్నమాట. ఈ లెక్కన అక్కడి పరిస్థితులు ఎప్పుడు బాగుపడేను? ఎప్పుడు పరిశ్రమలు వచ్చేను?

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?