రాజకీయానికి సామాన్యుడి హెచ్చరిక.!

సంప్రదాయ రాజకీయాలకు చరమగీతం ఓటుకు నోటు కాదు.. నోటు చూపిస్తే వేటు వేసుడే పబ్లిసిటీ జిమ్మిక్కులకు షాకిచ్చిన హస్తిన ఓటరు దేశ రాజకీయాల్లో కొత్త శకం.  అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ.. చీపురు దెబ్బకు…

సంప్రదాయ రాజకీయాలకు చరమగీతం
ఓటుకు నోటు కాదు.. నోటు చూపిస్తే వేటు వేసుడే
పబ్లిసిటీ జిమ్మిక్కులకు షాకిచ్చిన హస్తిన ఓటరు
దేశ రాజకీయాల్లో కొత్త శకం. 
అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ.. చీపురు దెబ్బకు హస్తిన నుంచి పరార్.!

హస్తిన రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. సామాన్యుడు మరోమారు ముఖ్యమంత్రి పీఠమెక్కుతున్నాడు. నోట్ల కట్టలు కాదు ఎన్నికల్ని శాసించేది.. పసలేని విమర్శలు కాదు రాజకీయాల్లో కావాల్సింది.. అని నిరూపించాయి ఢిల్లీ ఎన్నికలు. సామాన్యుడి దెబ్బకు హస్తం, కమలం కుదేలయ్యాయి. ఇది సామాన్యుడి అసామాన్య విజయం. తాము కోరి తెచ్చుకున్న మార్పు, తమ జీవితాల్లో వెలుగులు నింపాలని సగటు ఢిల్లీ ప్రజానీకం కోరుకుంటోంది. కోటి ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఢిల్లీ ఓటర్లను సామాన్యుడి పార్టీ సంతృప్తి పరచగలగుతుందా.? ఐదేళ్ళ పాలనపై సామాన్యుడి పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా.? దారుణమైన ఓటమిని చవిచూసిన కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ ఎన్నికల నుంచి ఎలాంటి గుణపాఠాల్ని నేర్చుకుంటాయి.?

నోట్లు విసిరితే ఓట్లు రాలతాయ్.. ఇది ఒకప్పటి మాట. కాదు కాదు, ఇది నిత్య సత్యం. రాజకీయ నాయకులు అదే నమ్ముతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ డబ్బులు వెదజల్లుతున్నాయి ఓట్ల కోసం. ఓటర్లూ డబ్బును డిమాండ్ చేస్తున్న సంఘనలు ఎన్నికల వేళ అనేకం వెలుగు చూస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ఇంతేనా.? అయితే వెయ్యి నోటు.. లేదంటే క్రికెట్ కిట్టు. ఇవి కాక చీరలు, వెండి ఆభరణాలు, సారా పాె్యకట్లు.. ఇలా ఓటర్లు ఏం ఆశిస్తారో, వారిని ఎలా ప్రలోభ పెట్టాలో బాగా తెలిసిన రాజకీయ నాయకులు.. ఎన్నికల వేళ పైన చెపకున్న అస్త్ర శస్త్రాలన్నీ సిద్ధం చేసుకోవడం చూస్తూనే వున్నాం. ఓటర్లు ప్రలోభాలకు గురవుతారని కాదు, వారిని ప్రలోభాలకు గురిచెయ్యాలన్న కుటిల ఆలోచన రాజకీయ నాయకులు, పార్టీలదే. అక్కడే మొదలవుతోంది అవినీతి. ఆ అవినీతి దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఆర్థిక ప్రగతి లేకుండా చేస్తోంది. ఓటుకి వెయ్యి పంచినోడు.. కోట్లు సంపాదించకుండా ఎలా వుంటాడు.? ఎన్నికల్లో డబ్బు పంపకాలకి తిరస్కారం ఎదురైనపడే రాజకీయ పార్టీలకు నిజమైన చెంపదెబ్బ తగులుతుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ, అదెప్పుడు.. అదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఢిల్లీ ఓటరు దారి చూపాడు

సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఢిల్లీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం నమోదు చేసింది. మెజార్టీ సీట్లు బీజేపీకి దక్కినా, ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటుకుంది. ఓ సామాన్యుడు, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి, సినీ గ్లామర్ కూడా లేని వ్యక్తి.. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి, తొలి విడతలో వందేళ్ళ చరిత్ర వుందని చెపకునే కాంగ్రెస్ పార్టీని చీపురుకట్టతో ఊడ్చి పడేశాడు. బీజేపీ పండగ చేసుకుంది.. కాంగ్రెస్ ప్రభావం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా తగ్గినందుకు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడే వ్యూహాత్మకంగా అడుగేసింది. ఎవరేమనుకున్నాసరే అనుకుంటూ 49 రోజులేక అధికారాన్ని దూరం చేసుకుంది. సింహం ఓ అడుగు వెనక్కి వేసిందంటే, పది అడుగులు ముందుకు దూకడానికే.. అన్న విషయం అప్పట్లో చాలామందికి తెలియలేదు. అధికారమిస్తే, నీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం రాజీనామా చేస్తావా? అంటూ ఢిల్లీ ప్రజానీకమే ఎదురు తిరిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేశారు. తాను చేసింది తప్పేననీ, ప్రజలకు క్షమాపణ వేడుకున్నారు కేజ్రీవాల్.

ఆ పార్టీల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత.?

మేం గెలిస్తే అది చేస్తాం.. మేం గెలిస్తే ఇది చేస్తాం.. అని ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ గతంలో ఎన్నో మాటలు చెప్పాయి. అధికార పీఠమెక్కాక ప్రజల్ని వంచించాయి. ఇది సగటు ఢిల్లీ ఓటరు మనుసులోని మాట. అయినా, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది, జన్ లోక్‌పాల్ కోసమే కదా.. అన్న ఆలోచన చాలామంది ఓటర్లలో కలిగింది. రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్ళాలని కేజ్రీవాల్ ఆలోచిస్తే, ఎన్నికలు జరగకుండా భారతీయ జనతా పార్టీ తనదైన వ్యూహాన్ని అమలు చేసింది. దాన్ని పసిగట్టలేనంత అమాయకులు కాదు కదా ఢిల్లీ ఓటర్లు. ఇక్కడే భారతీయ జనతా పార్టీ బొక్క బోర్లా పడింది తన వ్యూహంతో. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి వీచినా, ఢిల్లీలోనూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటినా, అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి సీన్ మారిపోయింది. కాంగ్రెస్‌తోపాటు, బీజేపీని కూడా ఢిల్లీ ఓటర్లు పక్కన పడేశారు. ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం.. అనుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుటిల రాజకీయాల ముందు, ఆమ్ ఆద్మీ రాజీనామా ఎపిసోడ్ పెద్ద తప్పిదమేమీ కాదు.. అన్న ఆలోచనలో ఆ పార్టీ వైపే మొగ్గు చూపారు. అలా ఇలా కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి బంపర్ మెజార్టీ కట్టబెట్టాడు ఢిల్లీ ఓటరు.

ఇది చారిత్రక విజయం

ఎన్నికల్లో గెలుపు.. అంటే 34 శాతమో, 36 శాతమో.. అదీ కాదంటే 40 శాతమో ఓట్లు సాధించడంగా మారిపోయింది. పార్టీలు ఎక్కువైపోవడంతో రానున్న రోజుల్లో 20 శాతం ఓట్లు వచ్చిన పార్టీ కూడా అధికార పీఠమెక్కేస్తుందేమోగానీ, ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం చారిత్రక విజయం నమోదయ్యింది. 53 శాతం ఓట్లు దక్కించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటి ఇలాంటి విజయం కాదిది. మొత్తంగా వున్న అసెంబ్లీ స్థానాల్లో 90 శాతానికి పైగా సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వశమయ్యాయి. గతంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే, మిగిలిన ఆనవాళ్ళనూ చెరిపేశారు ఓటర్లు. పనిలో పనిగా బీజేపీని కూడా ఆమ్  ఆద్మీ చీపురుతో ఢిల్లీ ఓటర్లు ఊడ్చి పారేశారు. ఇది కాంగ్రెస్, బీజేపీలేక కాదు.. దేశవ్యాప్తంగా వున్న అనేక రాజకీయ పార్టీలకు సామాన్యుడు పంపిన హెచ్చరిక. కుటిల రాజకీయాలు, సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని నిరూపించిన చారిత్రక ఎన్నికలుగా ఢిల్లీ ఎన్నికల్ని అభివర్ణించొచ్చు.

అది బలుపు కాదు వాపే.!

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ‘ఇది మోడీ బలం..’ అన్నారు చాలామంది. కాదు, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో, కాంగ్రెస్ మీద కసితో జనం బీజేపీకి ఓట్లు గుద్దటంతో ఆ పార్టీకి దక్కిన విజయమది.. అన్నారు ఇంకొంతమంది. కాంగ్రెస్, బీజేపీలకు ఇంకో ప్రత్యామ్నాయం వుండి వుంటే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో రిజల్ట్ ఇంకోలా వుండేదేమో.. అన్న అభిప్రాయాలు ఢిల్లీ ఎన్నికల తర్వాత ప్రముఖంగా తెరపైకొస్తున్నాయి. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. ఇప్పటికైనా బీజేపీ, సార్వత్రిక ఎన్నికల్లో తాము సాధించిన విజయాన్ని బలుపుగా కాకుండా, వాపుగా భావిస్తే, అది దేశానికి మేలు చేస్తుంది.. ఆ పార్టీకీ ఎంతో కొంత మేలు చేస్తుంది. ఎన్నిక సమయంలో దేశ ప్రజలకు ఏం హామీలు ఇచ్చాం? ఎన్నికలయ్యాక ఆ హామీల్ని అమలు చేయడానికి ఏం వంకలు వెతుక్కుంటున్నాం? అని అధికారలోకి వచ్చే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రశ్నించుకోవాలి. కానీ, ‘సంప్రదాయ రాజకీయాలకు’ అలవాటు పడిపోయిన కాంగ్రెస్, బీజేపీ లాంటి ‘చరిత్ర’ కలిగిన రాజకీయ పార్టీలు ఆ పని చేయలేకపోతున్నాయి. అందుకే సామాన్యుడే ధీటుగా స్పందించాల్సి వచ్చింది.

ప్రాంతీయ పార్టీలూ బహు పరాక్

కాంగ్రెస్, బీజేపీలను ఓ సామాన్యుడి పార్టీ ఊడ్చి పారేసింది.. అంటూ ప్రాంతీయ పార్టీలు సంబరపడిపోతున్నాయి. అయితే, జాతీయ పార్టీలకు ధీటుగా ప్రాంతీయ పార్టీలు వక్రమార్గంలో నడుస్తున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో అవసరార్ధం రాజకీయ పొత్తులు పెట్టుకుంటూ, సందర్భానుసారం బ్లాక్‌మెయిలింగ్‌కి దిగుతున్న ప్రాంతీయ పార్టీలు అనేకం వున్నాయి దేశంలో. పూటకో మాట మార్చడం చాలా ప్రాంతీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో సామాన్యుడు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అది ఆమ్ ఆద్మీనా? ఇంకొకటా? అన్నది కాలక్రమంలో తెలుస్తుంది. ఒక్కటి మాత్రం నిజం. ఢిల్లీ ఎన్నికలు దేశంలోని కోటానుకోట్లమంది ఓటర్లలో కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. ఓటుకు నోటు.. అంటూ నోటును ప్రచారంలోకి తెచ్చిన రాజకీయ పార్టీలపై వేటు వేస్తేనే భవిష్యత్తు.. అనే భావన అందరిలోనూ కలుగుతోంది. ఈ మార్పుకి కారణం ముమ్మాటికీ ఆమ్ ఆద్మీ పార్టీనే.

పబ్లిసిటీ జిమ్మిక్కులు పనిచేయవ్

పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ.. ఇదేమన్నా సినిమానా? అన్న అనుమనాలు కలుగుతున్నాయి గత కొన్నాళ్ళుగా దేశంలోని రాజకీయాల్ని చూస్తోంటే. ముఖ్యమంత్రికి పబ్లిసిటీ, అధికారంలో వున్న పార్టీకి పబ్లిసిటీ. అధికారంలోకి రావాలనుకున్న పార్టీకీ పబ్లిసిటీ. పబ్లిసిటీ కోసం రాజకీయ పార్టీలు ఏ గడ్డి తినడానికైనా వెనుకాడ్డంలేదు. కోట్లు ఖర్చుపెడ్తున్నాయి రాజకీయ పార్టీలు ప్రచారం కోసం. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే, ఓ ప్రోడక్ట్‌కి పబ్లిసిటీ కల్పిస్తే, దాని కోసం అయ్యే ఖర్చునంతా ఆ ప్రోడక్ట్ అమ్మకాల ద్వారానే గుంజుకోవాలని చూస్తారు. అది వ్యాపార సూత్రం. కానీ, రాజకీయాలు వ్యాపారం కాదు కదా. మరెందుకు పబ్లిసిటీ కోసం రాజకీయ పార్టీలు ఖర్చు చేస్తున్నట్టు.? ఢిల్లీ ఎన్నికల్నే తీసుకుంటే బీజేపీ భారీగా ఖర్చు చేసింది పబ్లిసిటీ కోసం. కాంగ్రెస్ కూడా ఫర్వాలేదన్పించింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం, జనం మధ్యేక వెళ్ళింది. అంతా ఖర్చులేని ప్రచారమే. మేధావి వర్గాన్ని కదిలించింది. యువతను ఆలోచింపజేసింది. తద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందింది. పెద్దగా ఖర్చు లేకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ విజయ తీరాలకు చేరింది.

హెచ్చరిక ఆమ్ ఆద్మీకీ వర్తిస్తుంది

కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీల్ని సంప్రదాయ పార్టీలంటున్నాం. మరి ఆమ్ ఆద్మీ పార్టీ సంగతేంటి.? ప్రస్తుతానికి ఈ పార్టీ సంచలనం. మిస్టర్ క్లీన్. మరి, భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా వుంటుంది.! అంటే, ముందే చెపకున్నాం కదా, అధికారంలోకి వచ్చే ముందు ఎలా వున్నాం, ఇపడెలా వున్నాం.. అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అధికారం వచ్చిందని మిడిసిపడితే, అది కూడా సంప్రదాయ పార్టీల సరసన చేరిపోతుంది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, సంప్రదాయ పార్టీలకు కొట్టిన దెబ్బ కన్నా, గట్టి దెబ్బ ఆ పార్టీ ఓటర్ల చేతిలో తినాల్సి వస్తుంది. ఓ సారి అధికారమొస్తే రాజీనామా చేసి, అధికారానికి దూరమైన అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే. ‘అనుభవం లేదు..’ అన్న మాటేక ఆస్కారమివ్వకూడదాయన. ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం కష్టం కాదు, దాన్ని ఐదేళ్ళు నిలబెట్టుకోవడం అనేది అత్యంత కష్టమైన ప్రకియ. ఎందుకంటే, సామాన్యుడి పార్టీ నుంచి జనం అద్భుతాల్ని ఆశిస్తున్నారు. ఆ అద్భుతాల్ని జనం ముందుకు తీసుకురావడానికి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాత్రింబవళ్ళు చిత్తశుద్ధితో కష్టపడాల్సి వుంటుంది. లేదంటే పరిస్థితులు ఎలా మారతాయో ఊహించడమే కష్టం.

 సింధు