వరల్డ్ కప్ క్రికెట్‌లో మూడో మూడొందల స్కోర్ నమోదైంది. సౌతాఫ్రికా, జింబాబ్వే జట్ల మధ్య ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన సౌతాఫ్రికా, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనా చివర్లో సెంచరీలతో జట్టును ఆదుకున్నారు దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు మిల్లర్, డుమిని.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే, దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. 10 పరుగులకే తొలి వికెట్‌ని కోల్పోయిన దక్షిణాఫ్రికా, వంద పరుగుల లోపే మొత్తం నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక అక్కడినుంచి మొదలైంది దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ విధ్వంసం. 7 బౌండరీలు, 9 సిక్సర్లతో డేవిడ్ మిల్లర్ సెంచరీ మోత మోగిస్తే, 9 బౌండరీలు, 3 సిక్సర్లతో డుమినీ సెంచరీ బాదేశాడు.
తొలి నాలుగు వికెట్లు వేగంగా తీసిన జింబాబ్వే బౌలర్లకు, మరో వికెట్ లభించలేదంటే డుమినీ, మిల్లర్ ఏ రేంజ్‌లో జింబాబ్లే బౌలర్లను ఆడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 300 పరుగుల మైలు రాయిని దాటితే, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కూడా అదే జోరు కొనసాగించింది. 300 పరుగులు దాటినా రెండు జట్లూ విజయం సాధించాయి.
క్రికెట్‌లో పసికూనగా చెప్తారు జింబాబ్వే గురించి. అలాగని అంత తేలిగ్గా తీసి పారేయడానికి లేదు. ఎందుకంటే, జింబాబ్వే అతి తక్కువ సందర్భాల్లోనే అయినా పెద్ద జట్లను మట్టికరిపించిన చరిత్రను సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా ` జింబాబ్వే మ్యాచ్ ఫలితం ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.