Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : బాలకార్మిక వ్యవస్థ - 1

సత్యార్థి గురించి నేను రాసిన ఆర్టికల్‌ కొందరిని మండించింది. కొందరు నాకున్న (?) పేరు పోతుందని నాపై జాలి పడ్డారు. సినికల్‌గా ఆలోచించడం మానుకోమని సలహాలు చెప్పారు. సత్యార్థి నిజాలేమిటో నేను పరిశోధించి అప్పుడు రాయాలని కొందరన్నారు. నేను బాలకార్మిక వ్యవస్థను బలపరుస్తున్నాను కాబట్టి నేను క్రిమినల్‌ననీ, జైల్లో పెట్టాలని కూడా అన్నారు. వీటన్నిటికీ కలిపి సమాధానంగా రాస్తున్నదే యీ వ్యాసం! మొదటగా వ్యాఖ్యానించవలసినది - 'వయసుకు తగ్గట్టు ప్రవర్తించు' అనే హితోక్తి గురించి. కొందరు నా పాఠకులు నా వయసు గురించి వర్రీ అవుతూంటారు. నన్ను ఖండించేవారు యిలా అంటే, వారిని ఖండించేవారు 'కనీసం ఎమ్బీయస్‌గారి వయసుకైనా నువ్వు గౌరవం యిచ్చి బూతులు మాట్లాడకు' అంటూ రాస్తూ వుంటారు. నాకు రెండూ రుచించవు. నా వాదన తప్పయితే ఖండించాలి, పెద్దముండావాడు ఏదో వాగుతున్నాడులే అని వూరుకోకూడదు. వయసును బట్టి గౌరవించడం  శుభాశుభాలలో కుటుంబసభ్యులకు మాత్రమే పరిమితం. మూఢుడికి వయసు వచ్చినంత మాత్రాన అతడిని గౌరవించవలసిన అవసరం లేదు. ఇక్కడ మనందరమూ జ్ఞానార్థులం. ఎవరికి జ్ఞానం వుంటే వారిని వయసుతో ప్రమేయం లేకుండా గౌరవించాలి. ఆదిశంకరులు గానీ, వివేకానందుడు కానీ తన కంటె వయసులో ఎంతో పెద్దవారిని వాదంలో జయించారు, శిష్యులుగా చేసుకున్నారు. పెద్దవాడు కాబట్టి అశ్లీలపదాలతో నిందించకూడదు అనే వాదన సరికాదు. పెద్దయినా, చిన్నయినా ఎవరి పట్ల అశ్లీలపదాలు వాడకూడదు. వాడితే వారి తలిదండ్రుల పెంపకానికి మచ్చ, వారి సంస్కారానికి కళంకం. అటువంటి పదాలు లేకుండా మన వాదం చెప్పలేకపోతున్నామని, వాదంలో పస లేకపోవడమే బూతులు వాడడానికి కారణమని వారు ఒప్పుకున్నట్లే. ఇంకో విషయం గమనించండి - బలహీనుడే బూతులు వాడతాడు, బలవంతుడు క్రియలో తన సత్తా చూపుతాడు.

నా వ్యాసం వలన సత్యార్థికి ఏ లోటూ రాదని నాకూ తెలుసు. నోబెల్‌ కమిటీ వారు ఆయన పేరు పరిగణించే థలో నేనొక పేద్ధ జర్నలిస్టునై వుండి, ఆయనకు వ్యతిరేకంగా రాసిన ఆర్టికల్‌ అంతర్జాతీయ వార్తాపత్రికలో వచ్చి వుంటే దాని వలన వాళ్లు వూగిసలాడేవారేమో అనుకోవడానికి నాకేమీ అంత కాదు, కుసింత సీను కూడా లేదు. అయినా నేను రాసినది - బహుమతి యిచ్చేసిన తర్వాత! నేను కూడా ఏదీ నిర్ధారణగా రాయలేదు, అవునో కాదో ఏమీ తెలియటం లేదు అని బుర్ర గోక్కుంటూ రాసినది. నా మనసులోని గందరగోళాన్ని పాఠకులతో పంచుకున్నానంతే. నా అభిప్రాయమే సర్వజనుల అభిప్రాయమని ఎక్కడా రాయలేదు. ఇది వ్యక్తిగతమైన అభిప్రాయమే అని స్పష్టంగా రాశాను. దీన్ని వెల్లడించడం వలన నాకున్న 'యిమేజి' (?) పోతుందంటే పోనీయండి. నేను ఏ యిమేజి కోసం పాకులాడను. స్వభావరీత్యా నేను నాన్‌-కన్ఫర్మనిస్టుని. అజ్ఞేయవాదిని. ప్రశ్నించమని ఉపనిషత్తులే చెప్పాయి. ముందుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకుని దాన్ని పట్టుకుని వేళ్లాడడం మంచి లక్షణం కాదు. కొత్త సమాచారం వస్తున్న కొద్దీ మన జ్ఞానం మారుతూ పోతుంది. నేనొక నిరంతర విద్యార్థిని, సత్యార్థిని. కొన్ని పరీక్షల్లో పాస్‌ కావచ్చు, మరి కొన్నిటిలో ఫెయిల్‌ కావచ్చు. రిజల్టుకు భయపడి పరీక్ష రాయకపోతే ఎలా? సత్యార్థి గురించి మీడియా అంతా ఒకలా చెప్తోంది కాబట్టి నేనూ అలాగే చెప్పి తీరాలన్న నియమం లేదు. 

నా వద్ద పూర్తి సమాచారం లేదు. తెలుసుకునే సాధనసంపత్తి లేదు. నిజానిజాలేమిటో యిప్పుడు కాకపోతే డాక్యుమెంట్లు డీ క్లాసిఫై అయినప్పుడు తెలియవచ్చు. అసలు డీక్లాసిఫై చేస్తారో లేదో తెలియదు. నేతాజీ మరణం గురించిన డాక్యుమెంట్లు కాంగ్రెసు ప్రభుత్వం దాచి పెడుతూ వచ్చిందని బిజెపి ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక వాళ్లూ దాస్తున్నారు. బయటకు చెప్పడానికి వీల్లేదు అని చెప్పేశారు కూడా. అందుచేత అధికారికంగా ప్రభుత్వం చెప్పినదే నమ్మి తీరాలి అంటే ఎలా? ప్రభుత్వం యిలా అంటోంది, కానీ కొందరు యిలా సందేహాలు వ్యక్తం చేశారు అని కూడా రాయకూడదా? అసలు నిజాలు ఎప్పటికైనా బయటకు వచ్చే సాధనం వుందా? లలిత్‌ నారాయణ్‌ మిశ్రా హత్య గురించి రాసిన ఆర్టికల్‌ చూడండి. 40 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చినా దానిలోనూ సందేహాలే. నిజం యింకా బయటపడలేదు.  సత్యార్థి గురించి అభిమన్యు సింగ్‌ ఆర్టికల్‌ అక్టోబరులో చదివాను, మన ప్రభుత్వ అధికారులు అలా ఎందుకు ప్రవర్తించారా అని ఆశ్చర్యపడ్డాను.

 నవంబరులో చలసాని నరేంద్ర ఆర్టికల్‌ చదివినపుడు మరో కోణం కనబడింది. ఆలోచనలో పడవేసింది. మరో నెల్లాళ్లకు అనేక అనుమానాలతో, సందేహాలతో యీ వ్యాసం రాశాను. ఈనాడు నిజాలు తెలియవు. కానీ ఎప్పటికో అప్పటికి బయటకు రావచ్చు. అప్పటికి నేను వుండకపోవచ్చు, ఉన్నా జ్ఞాపకశక్తి నశించవచ్చు. నా యీ వ్యాసం చదివినవారికి మనసులో నాటుకుంటే ఆ రోజు దానికీ దీనికీ రిలేట్‌ చేయగలుగుతారు. ''తుగ్లక్‌'' గురించి నేను రాసిన వ్యాసంలో చో రామస్వామి ''పిక్‌విక్‌'' పేరుతో ఇంగ్లీషు వీక్లీ నడిపిన విషయం నా పాఠకుల్లో 90% మందికి తెలియకపోవచ్చు. అదో గొప్ప విషయమని కాదు, చాలా చిన్న విషయమది. కానీ ''తుగ్లక్‌'' పేరుకు ఉత్తరాదివారి స్పందనకు, దక్షిణాది వారి స్పందనకు గల తేడాను ఎత్తిచూపడానికి పనికి వచ్చింది. నేను ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో, ఇంప్రింట్‌లో, సన్‌డేలో చదివిన వ్యాసాల రిఫరెన్సు యిప్పటికీ నాకు మనసులో మెదులుతూనే వుంది. ఇప్పుడా మ్యాగజైన్లు లేవు. కానీ ప్రస్తుత పరిస్థితికి వాటిని ముడి వేయడానికి ఆ జ్ఞాపకాలు పనికి వస్తాయి. ఈ నాటి యీ వ్యాసం మీలో కొందరికి సత్యాన్వేషణకు ముడిసరుకుగా పనికి రావచ్చు. 

లోకమంతా హిట్లరంటే అడిలి చచ్చే రోజుల్లో చాప్లిన్‌కు అతనిలో మానసిక దుర్బలుడు కనబడ్డాడు. అతన్ని వెక్కిరిస్తూ సినిమా తీశాడు. అబ్బే నువ్వలా తీయకూడదు అని అంటే ఒప్పుతుందా? గాంధీని దేశమంతా ఆరాధించే రోజుల్లో తీవ్రంగా విమర్శించినవారూ వున్నారు. నెహ్రూకు కూడా అంతే. ఊరందరిదీ ఒకదారి, ఉలిపికట్టెది మరో దారి అని సామెత. ఉలిపికట్టెకు కూడా సొంత వ్యక్తిత్వం వుందని ఒప్పుకుంటే పేచీ వుండదు. అన్నా హజారేని దేశమంతా ఆకాశానికి ఎత్తేస్తున్నపుడు నేను ఎత్తేయలేదు. పాఠకుల్లో చాలామంది నాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు అన్నా హజారే ప్రభ క్షీణించిపోయింది. ఆయన పేరు చెప్పి ఎంతో హంగామా చేసిన చంద్రబాబుగారు ఆయన హైదరాబాదు వస్తే పలకరించను కూడా లేదు. అరవింద్‌ కేజ్రీవాల్‌ హవా కూడా అంతే. ప్రధానిగా రాహుల్‌ వెర్సస్‌ అరవింద్‌ అంటూ తెగ ఫార్వార్డ్‌స్‌ వచ్చేశాయి. నేను పట్టించుకోలేదు, తిట్లు తిన్నాను. ఇప్పుడు అరవింద్‌ పిఎంగా కాదు, సిఎంగా కూడా పనికి రాకుండా పోయాడు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?