Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 1

విద్యుత్‌ అనేక రకాలుగా తయారవుతోంది - గాలి నుంచి, నీటి నుంచి, నిప్పు నుంచి, ఎండ నుంచి, అణువు నుంచి... ఆఖరికి చెత్త నుంచి! కానీ కలహం నుండి విద్యుత్‌ పుట్టించినవారెవరూ లేరు. ఆ ప్రయోగమేదో కెసియార్‌ చేస్తున్నట్లుగా వుంది. రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభంలో మునిగి వుండగా ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఆయన ఆంధ్రతో కలహమార్గమే ఎంచుకున్నారు. దీనిలో ఆయన సక్సెసయితే యితర రాష్ట్రాలేం ఖర్మ, దేశాలు కూడా ఆ మార్గమే పడతాయి. కెసియార్‌ యిప్పుడే పేటెంటు రిజిస్టర్‌ చేసుకోవడం మంచిది. 

తెలంగాణలో కరంటు పరిస్థితి ఘోరంగా వుందని ఎవరూ చెప్పనక్కరలేదు. రాజధానిలోనే నాలుగు గంటలని అఫీషియల్‌గా చెప్తున్నారు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాదో ఎవరికీ తెలియదు. తమ సర్వీసులు క్రమబద్ధీకరించాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె మొదలెట్టాక మరీ ఘోరం. అదెప్పుడు తెములుతుందో తెలియదు, వాళ్లకి వుద్యోగాలిస్తే నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళన చేస్తారు. ఎన్నికలలో ఎడాపెడా హామీ లివ్వడంతో అందరికీ ఆశలు పెరిగాయి. ఎవరికి ఏం తగ్గినా వూరుకోవడం లేదు. సిటీలో యిలా వుంటే పల్లెల్లో అయితే మూడు గంటలు మాత్రమే కరంటు వస్తోందని రైతులు పరామర్శించ వచ్చిన కాంగ్రెసు నాయకులకు చెప్తున్నారట. మరీ మూడు గంటలా? నమ్మబుద్ధిగా లేదు. 'గృహావసరాలకు ఆపేయండి, పరిశ్రమలకు ఆపేయండి, ప్రస్తుతం రైతులకే యివ్వండి' అని కెసియార్‌ యిచ్చిన ఆదేశాలను అధికారులు సగమే మన్నించారా? రైతుల మాట ఎలా వున్నా పరిశ్రమలకు  కట్‌ చేసి ఒక రోజు పవర్‌ హాలీడే యిచ్చారు. వాళ్లు భోరు మన్నారు. ఇలా వుందాని రెండు రోజులు చేశారు. వాళ్లు భోరుభోరుమన్నారు. రోజుకి రూ. 130 కోట్ల ఉత్పత్తి నష్టమంటూ అశోచామ్‌ వాళ్లు శోకం వ్యక్తం చేశారు. ఉత్పత్తి లేకపోతే పరిశ్రమలు, జీతాలు లేక కార్మికులూ, అమ్మడానికి ఉత్పత్తులు లేక దుకాణాలు, పన్నుల రాబడి తగ్గి ప్రభుత్వమూ అన్నీ పడకేస్తాయి. 

ఈ బాధ భరించలేక చిన్న, చితకా పరిశ్రమలు తట్టాబుట్టా ఎత్తుకుని పోతామని డిక్లేర్‌ చేశారు. ఎక్కడికి వెళతారు? ఎందరు వెళతారు? ఇప్పటికే ఆంధ్రలో కాస్త బేస్‌ వున్నవాళ్లే అటు వెళతారు. కొత్తగా అక్కడ పెట్టాలంటే భూమి ధర మండుతోంది. బాగా లోపలి ప్రాంతాలకు వెళ్లాలి. అక్కడ ఏం సౌకర్యాలున్నాయో తెలియదు. పరిశ్రమ అనగానే అనుబంధ వ్యవస్థలు, మార్కెటింగ్‌ అవకాశాలు వుండాలి. అవి ప్రస్తుతానికి అక్కడ లేవు. లేబరు విషయంలో వెసులుబాటు వుంది. కెసియార్‌ పాలనలో ఆంధ్రద్వేషం ప్రజ్వరిల్లుతున్నకొద్దీ కొత్తగా హైదరాబాదు వచ్చేవాళ్లు తగ్గిపోయారు. ఉన్నవాళ్లలో కొందరు యీ ఎకడిమక్‌ ఇయర్‌ పూర్తయ్యాక వెళితే మంచిదేమో అనుకుంటున్నారు. వీరందరూ తమ స్వగ్రామాల్లో అయితే తక్కువ జీతానికే పని చేయడానికి సిద్ధపడతారు కాబట్టి పరిౖశ్రమలకు జీతాల ఖర్చు తక్కువే వుంటుంది. అయితే అక్కడ స్కిల్‌డ్‌ లేబర్‌ యిప్పుడే దొరకడం కష్టం. నిపుణులు నగరంలోనే వుండడానికి యిష్టపడతారు. వారి ద్వారా కొందరికి తర్ఫీదు యిచ్చి ప్రయోగాలు చేయాలి. ఇక అక్కడ 24 గంటల సరఫరా మాట ఎలా వున్నా, చెప్పుకోదగ్గ కొరతయితే లేదు. అక్కడ భారీ పరిశ్రమలేవీ పెద్దగా లేదు కాబట్టి, వచ్చేందుకు యింకా టైము పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి విద్యుత్‌ అనేది సమస్య కాదు. 

ఈ సానుకూల, ప్రతికూల అంశాలు ఒక్కో పరిశ్రమకు ఒక్కోలా వుంటాయి. అందువలన తెలంగాణ నుంచి కొన్ని పరిశ్రమలు తరలి వెళ్లి ఆశ్చర్యం ఏమీ లేదు. బయట నుంచి వచ్చి కొత్తగా పెడదామనుకున్నవాడు యీ తరలింపు చూసి తటపటాయిస్తాడు. భూమి ఎలాట్‌ చేయించుకుని అనుమతులు రాలేదంటూ కాలక్షేపం చేస్తాడు. మరి యింటింటికి ఉద్యోగం అనేది ఎలా సాధిస్తారు? విద్యుత్‌ సమస్య పరిష్కరించనిదే పరిశ్రమలే కాదు, దుకాణాలు, చిన్న వ్యాపారాలు కూడా నడవవు. ఐటీ పరిశ్రమల్లో కూడా 'ఎట్‌ హోమ్‌' పని చేసే ఉద్యోగులు చేయలేని స్థితి. అందరూ ఆఫీసులకు వచ్చి చేస్తామంటే కంపెనీకి ఖర్చు ఎక్కువ. జనరేటర్లకే బోల్డు అవుతుంది. కాస్ట్‌ కటింగ్‌ కోసం నిరంతరం దారులు వెతికే ఐటీ కంపెనీలు యీ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మార్గాంతరాలు, రాష్ట్రాంతరాలు వెతుకుతాయి. 

పరిస్థితి యింత ఘోరంగా వుంటే తెరాస ప్రభుత్వం ఏం చేస్తోంది? 'ఎంత ఖర్చయినా ఫర్వాలేదు కొనమని ఆదేశాలిచ్చాం' అంటూ చెప్తే ఎలా? 'ఆదేశాల గురించి చెప్పవద్దు, కొనుగోళ్ల గురించి చెప్పండి, ఎక్కణ్నుంచి ఎంత కొన్నారో చెప్పండి' అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. నిన్న కెటియార్‌ వివరణ యిచ్చారు. ఆయన విద్యుత్‌ శాఖా మంత్రి కాదు, అసలు మనకు ఆ శాఖకు మంత్రే లేడు. ఆయన అది చేస్తాం, యిది చేస్తాం అంటూ చాలా చెప్పి 'దసరా, బతకమ్మ పండుగల్లో 17.5 మిలియన్‌ యూనిట్లను కొన్నాం, గత కొద్ది రోజులుగా (చాలా గడుసుగా ఎన్ని రోజులో చెప్పలేదు) సరాసరి 14 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేస్తున్నాం' అన్నారు. డిమాండ్‌, సప్లయి, రెండిటి మధ్య అంతరం - యివీ ముఖ్యం. అవి చెప్పలేదు. మాకు ఏం తెలిసినా తెలియకపోయినా మీరు కొన్నది, కొంటున్నది సరిపోవటం లేదని, అందుకే కరంటు కోతలనీ మాత్రం బాగా అర్థమవుతోంది. అదే రోజు తెరాస ప్రభుత్వం ఒమిషన్స్‌, కమిషన్స్‌ గురించి బాబు పూర్తి వివరణ యిచ్చారు. పనిలో పనిగా తామేం చేశామో కూడా చెప్పారు. ఆ అంకెలు చూస్తే జూన్‌-సెప్టెంబరుల మధ్య తెలంగాణ కంటె ఆంధ్ర ఎక్కువ కరంటు కొంది. అదీ వీళ్ల కంటె యూనిట్‌కు మూడు రూపాయలు తక్కువ ధరతో! పరిశ్రమలు, విద్యుత్‌ వినియోగం తెలంగాణలో ఎక్కువ. ఇక్కడ ఎక్కువ కొనాల్సింది. కానీ కొనలేదు. ఒప్పందాలు కూడా వాళ్లు ఎక్కువ కుదుర్చుకున్నారు. తెలంగాణకు కేంద్రం ఎన్టీపిసి నుండి పెద్దగా ఎలాట్‌ చేయలేదని, అక్కడి సర్కారు చేసిన ప్రతిపాదనలకు స్పందించలేదని చెపుతూ రాష్ట్రస్థాయిలో మునిగిపోయిన విద్యుత్‌ యూనిట్లను యింకా పునరుద్ధరించ లేకపోయారని యిలా వీళ్ల లోటుపాట్లన్నీ బయటపెట్టారు. 

దీనికి వెంటనే తెలంగాణ ప్రభుత్వ ప్రతినిథులు సమాధానం చెప్తారేమోనని చూశా. ఏమీ రాలేదు. జగదీశ్‌రెడ్డిగారు బాబును కొరివిదెయ్యం (ఇదేం ఉపమానం? కొరివిదెయ్యంలోంచి వెలుగు వస్తుంది కదా!? ఏ అంధకారాసురుడో అనవచ్చుగా) అని తిట్టి సరిపెట్టారు. ఇలాటి పరిస్థితుల్లో మూడేళ్లలో పరిస్థితి చక్కబడుతుందని, కరంటు ధారాళంగా వస్తుందని యిచ్చే హామీలను నమ్మి మనం కాళ్లు బారచాపి కూర్చోవాలా? ఓ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ 'ఆఫ్టర్‌ వన్‌ ఇయర్‌..' అంటూ యింటి అద్దె దగ్గర్నుంచి బకాయి పెడతాడు. ఏమిటంటే - ఏడాది తర్వాత కింగ్‌ అవుతావని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడట, యితను నమ్ముతాడు. మనం కూడా 'ఆఫ్టర్‌ థ్రీ యియర్స్‌' అనుకుంటూ జపం చేయాలి. అసలు మూడేళ్ల తర్వాత రాజెవరో? రంగడెవరో? అప్పుడు కూడా 'ఆంధ్రావాళ్లు అడ్డుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరంటు తీగ వేస్తూ వుంటే కాకుల రూపంలో వచ్చి కొరికేశారు' అని చెప్తారేమో! విభజన జరిగితే తెలంగాణకు విద్యుత్‌ కష్టాలు తప్పవు అని కిరణ్‌ కుమార్‌ రెడ్డి నెత్తి నోరు కొట్టుకుని చెపితే అప్పుడు హేళన చేసినది కెసియార్‌ ప్రభృతులు కాదా? 'స్కూలు టీచర్లా మ్యాప్‌లు చూపించి చెపుతున్నాడు. ఎలా చేయాలో మాకు తెలుసు. గోదావరి గట్టుమీద రెండు గుంజలు పాతి ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెప్పిస్తా' అన్నారు. ఏవీ ఆ గుంజలు? వర్షాలకు కొట్టుకుపోయాయా? (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?