Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : మమతకు యీ స్థాయి గెలుపు ఎలా దక్కింది?

ఎమ్బీయస్‌ : మమతకు యీ స్థాయి గెలుపు ఎలా దక్కింది?

మొత్తం 294 సీట్లు వున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో మమత గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయి కానీ 45% ఓట్లతో 2011 కంటె 27 సీట్లు పెరిగి 211 (ఎన్నిక జరిగినది 293 స్థానాల్లోనే) వస్తాయని ఎవరూ వూహించలేదు. 2011లో కాంగ్రెసుతో కలిసి పోటీ చేసి 39% ఓట్లు తెచ్చుకుంది. 2014 లోకసభ ఎన్నికలలో దేశమంతా మోదీ జపం చేస్తున్నా తమిళనాడులో జయలలిత, బెంగాల్‌లో మమత ఆ ప్రభంజనాన్ని తట్టుకున్నారు. అప్పుడు తృణమూల్‌ ఒంటరిగా పోటీ చేసి 40% ఓట్లు తెచ్చుకుని 214 అసెంబ్లీ సెగ్మంట్లలో గెలిచింది.  ఇప్పుడు ఓటింగు శాతం మరింత పెరిగింది. అంతేకాదు, దాని హిట్‌ రేట్‌ (గెలిచిన స్థానాలు/పోటీ చేసిన స్థానాలు) 72% వుంది. ఇది చాలా ఘనమైన రికార్డు. ఇన్నాళ్లూ తృణమూల్‌కు రాష్ట్రపు దక్షిణ జిల్లాలలో వున్న 191 స్థానాల్లో పట్టు వుండేది. ఈ సారి అవన్నీ గెలుస్తూనే 4 ఉత్తర జిల్లాల్లో కూడా బలం సాధించింది. 

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో లెఫ్ట్‌కు పట్టు వుండేది. పంచాయితీ అధికారులను బెల్లించో, బెదిరించో మమత తనవైపుకి తిప్పేసుకుంది. ఆమె చేపడుతున్న రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి పథకాల వలన ప్రయోజనం పొందాలంటే అధికార పార్టీలో చేరి తీరాలని వాళ్లందరికి అనిపించేట్లా చేసింది. ప్రభుత్వోద్యోగులకు ఎంతిచ్చినా చాలదంటూనే వుంటారని తెలుసు కాబట్టి వాళ్ల డిఎలు ఆపేసి ఆ నిధులను మళ్లించి సంక్షేమ పథకాలపై వ్యయాన్ని మూడింతలు పెంచింది. కమ్మర్షియల్‌ టాక్స్‌ బేస్‌ పెంచి మధ్యతరగతి వారిని యిబ్బంది పెట్టి వాటినీ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు వినియోగించింది. మమత హయాంలో గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ 15% పెరిగింది. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో దేశంలోనే బెంగాల్‌ రెండవ స్థానం ఆక్రమించింది. అందుకే  గ్రామీణ ప్రాంతాలు మమతకు దన్నుగా నిలిచాయి. వాళ్లొక్కళ్లే కాదు, ఫ్లయివోవరు కూలిపోయిన కలకత్తా నగరంలో కూడా తృణమూల్‌ విజయదుందుభి మోగించింది. ఆమె నియంతృత్వ పోకడలు, ఆమె కార్యకర్తల హింసాత్మక ధోరణులు మేధావులకు, మధ్యతరగతివాళ్లకు రుచించకపోయినా, ఆమె హయాంలో పరిశ్రమలు రాలేదని నిరుద్యోగులు, ఆర్థికవేత్తలు విమర్శించినా సాధారణ ప్రజలు ఆమెకు పట్టం కట్టడానికి కారణం ఆమె సాధారణ జీవనశైలి! అయితే యింతటి ఘనవిజయానికి ఆ వివరణ చాలదు. లెఫ్ట్‌-కాంగ్రెసు పొత్తు వైఫల్యం మమత గెలుపుకు ఎంతో దోహదపడింది. 

గతంలో కంటె తృణమూల్‌కు పెరిగిన 5% ఓట్లు ఎక్కడివి? ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా 40% కంటె కొంత తగ్గినా బిజెపి, కాంగ్రెసుల ఓట్లు సంపాదించడం చేతనే యీ పెరుగుదల కనబడుతోంది అనుకోవాలి. బిజెపి సంగతి తీసుకుంటే పార్లమెంటు ఎన్నికలలో వారికి 17% రాగా యీసారి 10% మాత్రమే వచ్చాయి. ఆ 7% బిజెపి ఓటర్లు సిద్ధాంత రీత్యా తాము వ్యతిరేకించే లెఫ్ట్‌కు గాని, కాంగ్రెసుకు గాని వేసి వుండరని సులభంగా వూహించవచ్చు. బిజెపితో బాటు తృణమూల్‌ కాంగ్రెసు నుంచి కూడా కొన్ని తెచ్చుకుని వుండాలి. ఎందుకంటే లెఫ్ట్‌కు 2011లో 40% ఓట్లు వచ్చాయి, 2014లో 30% వచ్చాయి. ఈ సారి కాంగ్రెసుతో కలిసినా యిద్దరికీ కలిపి కనీసం 42% రావలసినది 32% వచ్చాయి! బెంగాల్‌లో లెఫ్ట్‌, కాంగ్రెసు ఎన్నడూ కలిసి లేవు. దశాబ్దాల తరబడి కార్యకర్తలు ఒకరితో మరొకరు కలహిస్తూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా కలిసి పనిచేయాలంటే వాళ్ల వలన కాలేదు. ఫలితాల తర్వాత చూస్తే లెఫ్ట్‌ ఓటర్లు తమ పార్టీ చెప్పిన ప్రకారం కాంగ్రెసుకు ఓటేయగా, కాంగ్రెసు కార్యకర్తలు, ఓటర్లు తమ పార్టీ అభ్యర్థి లేని చోట లెఫ్ట్‌కు వేసే బదులు తృణమూల్‌కు ఓటేశారని తేలుతోంది. కాంగ్రెసుకు గతంలో కంటె రెండు సీట్లు పెరిగి 44 వచ్చాయి. అది పోటీ చేసినది 92 సీట్లే. దాని హిట్‌ రేట్‌ 48% వుంది. గతంలో 10% ఓట్లు తెచ్చుకునే కాంగ్రెసు యీ సారి రాష్ట్రం మొత్తం మీద చూస్తే 12% ఓట్లు సంపాదించింది. పోటీ చేసిన నియోజకవర్గంలోని ఓటర్లను తీసుకుని చూస్తే 40% మంది వేసినట్టు లెక్క. 

జనాభాలో 28% వున్న ముస్లిములు చాలాకాలంగా లెఫ్ట్‌కు ఓటేస్తూ వచ్చారు. మమత తనను తాను ముస్లిము పక్షపాతిగా ప్రదర్శించుకుంది. వారికి అనేక సౌకర్యాలు సమకూర్చింది. అయినా పార్టీ దెబ్బ తిన్నదెక్కడైనా వుందంటే ముస్లిములు మెజారిటీలో వున్న మాల్డా, ముర్షీదాబాద్‌, ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలలోనే. ముస్లిములు తక్కువగా వున్న ప్రాంతాల్లో వాళ్లు యీసారి లెఫ్ట్‌ను కాదని ఆమెకే ఓటేశారు. వింతగా తోచినా యీసారి బిజెపి ఓట్లు కూడా మమతకు పడ్డాయి. ఎందుకంటే లెఫ్ట్‌-కాంగ్రెసు రెండూ బిజెపికి పరమశత్రువులే. వాళ్లిద్దరూ కలిసి బెంగాల్‌లో చేసే ప్రయోగం విజయవంతమైతే వేరే చోట కూడా యిదే పునరావృతం కావచ్చు. ఇక్కడ దాన్ని విఫలం చేయాలంటే, ఆ కూటమి అభ్యర్థి ఓడిపోయేట్లా చూడాలి. అందువలన తమ పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు లేని చోట్ల వారు తృణమూల్‌కు ఓటేశారు. గతంలో ఏ సీటూ లేని బిజెపి 291 స్థానాల్లో పోటీ చేసి 3 సీట్లు గెలిచింది. దాని హిట్‌ రేట్‌ 1%. రాష్ట్రప్రజల్లో దానికి 10% మంది ఓటేశారు. నెగ్గినవారిలో రాష్ట్ర అధ్యక్షుడు కూడా వున్నాడు. 

ప్రతిపక్ష కూటమిలో పెద్ద పార్టీ అయిన సిపిఎం 148 సీట్లలో పోటీ చేసి గతంలో కంటె 14 తక్కువగా 26 గెలిచింది. అంటే దాని హిట్‌ రేట్‌ 18% మాత్రమే. రాష్ట్రం మొత్తం మీద చూస్తే 20% దానికి ఓట్లేశారు. పోటీ చేసిన నియోజకవర్గంలోని ఓటర్లను తీసుకుంటే 39% మంది వేశారు. లెఫ్ట్‌ ఫ్రంట్‌లో భాగస్వామిగా 25 సీట్లలో పోటీ చేసిన ఫార్వర్డ్‌ బ్లాక్‌కు 9 తగ్గి 2 మాత్రమే వచ్చాయి. దాని హిట్‌ రేట్‌ 8%. రాష్ట్రం మొత్తం మీద చూస్తే 3% దానికి ఓట్లేశారు. పోటీ చేసిన నియోజకవర్గంలోని ఓటర్లను తీసుకుంటే 33% మంది వేశారు. 19 సీట్లలో పోటీ చేసిన ఆర్‌ఎస్‌పికి 3 దక్కాయి. సిపిఎం తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్న డా|| సూర్య కాంత మిశ్రా ఓడిపోయాడు. 1972లో సిపిఎంకు 14 సీట్లు వచ్చాయి. అప్పుడు  కాంగ్రెస్‌ వారు పోలీసుల సహాయంతో ఎన్నికలు రిగ్‌ చేశారనేది బహిరంగ రహస్యం. జ్యోతి బసు కూడా ఓడిపోయారు. ఎమర్జన్సీ ఎత్తివేసిన తర్వాత జరిగిన 1977 ఎన్నికల నుండి 1991 వరకు 170 ప్లస్‌ తెచ్చుకుంటూ వచ్చింది. 1996లో, 2001 ఎన్నికలలో 20 తగ్గాయి. 2006లో మళ్లీ 176 తెచ్చుకుంది. అక్కణ్నుంచి 2011కి 40కి పడిపోయింది. ఇప్పుడు యింకా కిందకు పడిపోయి 26 తెచ్చుకుంది. 1972లా యీసారి రిగ్‌ అయిందని అనడానికి లేదు. చాలాకాలం అధికారంలో వుండడం చేత పార్టీలో అలసత్వం ఏర్పడిందని, ప్రజలు విసుగెత్తి పోయారని అనుకోవాలి. తృణమూల్‌ శారదా స్కాములో యిరుక్కున్నా మదన్‌ మిత్రా తప్ప తక్కినవారు ఓడిపోలేదు. నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ బయటకు వచ్చినా జనాలు పట్టించుకోలేదు. పారిశ్రామిక ప్రగతి ఏమీ జరగకపోయినా మమతనే ఆదరించారు. సరైన ప్రత్యామ్నాయం తయారయ్యేవరకు మమతకు ఢోకా లేనట్టుంది. గెలిచిన అభ్యర్థుల ఓట్ల శాతం, విన్నింగ్‌ మార్జిన్‌ వివరాలు పూర్తిగా తెలిసిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది. 

బిహార్‌లో కాంగ్రెసు-నీతిశ్‌-లాలూ కూటమి బాగానే పనిచేసింది. కానీ బెంగాల్‌లో కాంగ్రెసు లెఫ్ట్‌ పట్ల పాతపగలను వదులుకోలేక పోయింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మీరు పొత్తుధర్మం పాటించాలని గట్టిగా చెప్పే నాయకత్వం రాష్ట్రంలో కాని, కాంగ్రెసు హెడ్‌ క్వార్టర్స్‌లో కాని లేదు. కాంగ్రెసుతో పొత్తు వుండాలని వాదించిన సిపిఎం నాయకులందరూ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని నింద పడవలసి వుంటుంది. సిద్ధాంతాలపై రాజీ పడ్డారు, కానీ కాంగ్రెసు దగా చేసింది. బెంగాల్‌లో జరిగిన మోసాన్ని లెఫ్ట్‌ మర్చిపోదు. కేంద్రంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా లెఫ్ట్‌తో కూడిన మూడో ఫ్రంట్‌ మద్దతుతో కాంగ్రెసు కానీ, కాంగ్రెసు మద్దతుతో మూడో ఫ్రంట్‌ కానీ ఏర్పడే అవకాశాలు పూర్తిగా దెబ్బ తింటాయి.  ఏది ఏమైనా సిపిఎంలో బెంగాల్‌ నాయకులు యిన్నాళ్లూ పెద్దన్న పాత్ర వహిస్తూ వచ్చారు. పేరుకు జాతీయ పార్టీయే గాని, బెంగాల్‌ ప్రయోజనాల చుట్టూనే సిపిఎం రాజకీయాలు నడిపింది. ఇక బెంగాల్‌ నాయకులకు మొహం చెల్లదు. సొంత రాష్ట్రంలో యింత ఘోరంగా విఫలమయ్యాక వారు మిగతావారికి ఏం సుద్దులు చెప్తారు? కార్మిక, కర్షక, ఉద్యోగి సంఘాలను సంఘటితం చేసి ప్రజాసమస్యలపై ప్రజలను ఉత్తేజితులను చేస్తే తప్ప లెఫ్ట్‌కు బెంగాల్‌లో భవిష్యత్తు లేనట్లే. ఎందుకంటే మమత విఫలమయ్యే పక్షంలో ఆ స్థానం భర్తీ చేయడానికి కాంగ్రెసు, బిజెపి పోటీ పడతాయి. రెండింటిలో ఎవరు సృజనాత్మకంగా ఉద్యమాలు చేపడితే వారికి గుర్తింపు వస్తుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?