Advertisement

Advertisement

indiaclicks

Home > Articles - MBS

మొదటి ప్రపంచయుద్ధంలో భారతీయుల పాత్ర

1914 జూన్‌ 28 న ఒక సెర్బియన్‌ విప్లవకారుడు ఆస్ట్రియా రాజకుమారుణ్ని, భార్యను హత్య చేశాడు. దీని వెనుక సెర్బియా హస్తం వుందని భావించిన ఆస్ట్రియా ఆ దేశంపై జులై 28 న యుద్ధం ప్రకటించింది. సెర్బియాతో తనకున్న మిత్రత్వం వల జార్‌ చక్రవర్తుల పాలనలో వున్న రష్యా దానికి మద్దతుగా సైన్యాన్ని మోహరించింది. ఆస్ట్రియాకు సన్నిహితంగా వున్న జర్మనీ రష్యాపై ఆగస్ట్‌ 1 న యుద్ధం ప్రకటించింది. రష్యాతో తమకున్న సంధి కారణంగా ఫ్రాన్సు రష్యాకు మద్దతుగా నిలిచింది. దాంతో జర్మనీ బెల్జియం ద్వారా ఫ్రాన్సుపై దండెత్తింది. బెల్జియం తటస్థ ప్రతిపత్తికై హామీ యిచ్చి యిప్పుడు ఉల్లంఘించిన జర్మనీకి బుద్ధి చెప్పడానికి బ్రిటన్‌ యుద్ధంలోకి దిగింది. ఇలా యూరప్‌లో పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభమైంది. 1915 వచ్చి అది ప్రపంచంలోని యితర దేశాలకు కూడా పాకి నాలుగేళ్లపాటు సాగింది. బ్రిటన్‌కు వలసదేశంగా వున్న భారతదేశం కూడా దానిలో పాల్గొంది. యుద్ధం పూర్తయ్యాక రెండేళ్లకు దానిలో మరణించిన సైనికుల స్మృత్యర్థం ఢిల్లీలో ఇండియా గేట్‌ నిర్మించింది బ్రిటన్‌ ప్రభుత్వం. 2014 జులై 28 కి మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమై నూరేళ్లు పూర్తయిన సందర్భంగా దాన్ని గుర్తు చేసుకుంటూ గ్లాస్గోలో కామన్‌వెల్త్‌ దేశాధినేతలు కలిశారు. ఆ సందర్భంగానైనా ఆ యుద్ధంలో మనవాళ్ల పాత్రను ఎత్తిచూపవలసిన అవసరం వుంది.

ఆ యుద్ధంలో ఇండియన్లు పాల్గొన్నారన్న విషయం గుర్తుందా లేదా అని ఈ ఏడాది మొదట్లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ వాళ్లు సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్నవారిలో  చాలామందికి గుర్తు లేదు. 25% మంది పాల్గొన్నారు కానీ బ్రిటిషువారికి వ్యతిరేకంగా పోరాడారు అని చెప్పారు. ఇలాటి సర్వేయే రెండేళ్ల క్రితం బ్రిటన్‌లో నిర్వహిస్తే సగం కంటె ఎక్కువమంది మందికి ఇండియా పాలు పంచుకుందో లేదో తెలియదు, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేసి వుంటే ఏ వెయ్యి మంది సైనికులో పోరాడి వుంటారు అన్నారు. నిజానికి ఆ యుద్ధంలో మనవాళ్లను పాల్గొనమని, బ్రిటిషువారికి మద్దతుగా పోరాడమని మహాత్మా గాంధీతో సహా నాయకులందరూ ప్రోత్సహించారు - యుద్ధానంతరం స్వాతంత్య్రం యిస్తామని బ్రిటన్‌ యిచ్చిన హామీని నమ్మి! అంతేకాదు వస్తురూపంగా కూడా భారతీయుల పాత్ర ఎంతో వుంది. 37 లక్షల టన్నుల ఆహారపదార్థాలు, 10 వేలమంది నర్సులు, 1.70 లక్షల జంతువులు, 14.60 కోట్ల పౌండ్ల ధనం.. యివన్నీ కాకుండా 11 లక్షల భారతీయ సైనికులు! వీరిలో 74 వేలమంది హతులయ్యారు. స్వాతంత్య్రం వచ్చాక యిప్పటిదాకా జరిగిన అన్ని యుద్ధాలలో మరణించిన సైనికుల మొత్తం సంఖ్య కంటె యిది 5 రెట్లు ఎక్కువ. 

ఈ సైన్యం భారత్‌లో వాయువ్యప్రాంతం శత్రువశం కాకుండా కాపాడింది, అంతేకాదు ఈజిప్టు, సింగపూర్‌, చైనాలలో బ్రిటిషు ఆయుధాగారాలను కాపలా కాసింది.  మన సైన్యంలో 60% మంది పశ్చిమాసియాలోని మెసపొటేమియా (ఇప్పటి ఇరాక్‌)లో విజయాలు సాధించారు. అక్కడ వుండే రోజుల్లో 1916లోనే ఒక్క ఏడాదిలో 2 లక్షల మంది ఇండియన్లు రోగాల పాల బడ్డారు.10% మంది ఈజిప్టు, పాలస్తీనాలను గెలిచారు.  1917లో జెరూసలెంను గెలిచినది మనవాళ్లే. అక్కడి డోమ్‌ ఆఫ్‌ ద రాక్‌ను రక్షించే బాధ్యతను ఇండియన్‌ ముస్లిం పటాలానికి అప్పచెప్పారు. యుద్ధానంతరం ఇండియన్లకు 13 వేల గాలంట్రీ అవార్డులు బహూకరించారు. ఆనాటి యుద్ధం వలన భారతీయులు యుద్ధకళలో కూడా ప్రావీణ్యత సంపాదించారు. మన పాత్రను యితరులు విస్మరించినా మనం మాత్రం విస్మరించరాదు. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?