Advertisement

Advertisement


Home > Articles - MBS

వామపక్షాల అభ్యర్థులూ టిక్కెట్లు కొనుక్కుంటున్నారు

డబ్బున్నవాళ్లు రాజకీయాల్లోకి వద్దామనుకుంటే పార్టీకి డబ్బిచ్చి టిక్కెట్టు కొనుక్కుని, రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతున్నారనేది బహిరంగ రహస్యం. వామపక్షాలు ఈ  పద్ధతికి దూరంగా వుంటారని అనుకుంటూ వుంటారు. వాళ్లూ మినహాయింపు కాదని కేరళలోని తిరువనంతపురం విచారణలో తేలింది. 2014 పార్లమెంటు ఎన్నికలలో ఆ సీటు నుండి ముగ్గురు పోటీపడ్డారు. కాంగ్రెసు నుండి శశి థరూర్, బిజెపి నుండి రాజగోపాల్, సిపిఐ తరఫున బెన్నెట్ అబ్రహాం! బెన్నెట్ ఓడిపోవడమే కాక మూడో స్థానంలో నిలిచాడు. దాంతో సిపిఐ నాయకత్వానికి కళ్లు తిరిగి, ఓటమిపై విచారణ ప్రారంభించింది. అబ్రహాం వైద్యుడు. చర్చి ఆఫ్ సౌత్ ఇండియా నడిపే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజీకి డైరక్టర్. డొనేషన్లకు సీట్లు అమ్మడంలో ఆ కాలేజీకి చాలా పేరుంది. వామపక్షాలకు చెందిన విద్యార్థిసంఘాలు బెన్నెట్‌కు వ్యతిరేకంగా చాలా ఆందోళనలు నిర్వహించాయి. కాలేజీ యాజమాన్యం పోలీసుల సహాయంతో వాళ్లను అణచివేసింది. మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు అమ్ముకోవడం చట్టబద్ధమే కాబట్టి బెన్నెట్‌పై ఎవరూ కోర్టుకి వెళ్లలేకపోయారు కానీ, వామపక్షవాదులకు అతనిపై కోపం వుంది. అలాంటి బెన్నెట్‌ను సిపిఐ తన అభ్యర్థిగా నిలబెట్టడం వారికి రుచించక ఓట్లేయలేదని తేలింది. మరి సిపిఐ అతన్ని ఎందుకు ఎంపిక చేసినట్లు?

డబ్బు కోసమే అన్నారు పార్టీలో కార్యకర్తలు కొందరు. కోట్ల రూపాయలిచ్చి బెన్నెట్ టిక్కెట్టు కొనుక్కున్నాడని వారి వాదన. ‘అబ్బే, అదేం కాదు, గెలవడమే ముఖ్యం. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులిద్దరూ నాయర్లే. నియోజకవర్గంలో అత్యధికంగా వున్న నాయర్ ఓట్లను వాళ్లిద్దరూ చీల్చుకుంటారు కాబట్టి నాడార్ క్రిస్టియన్ అయిన బెన్నెట్ సులభంగా గెలుస్తాడని అనుకుని నిలబెట్టాం’ అంటున్నారు నాయకులు. కానీ ఆ వాదనను ఎవరూ నమ్మకపోవడంతో సిపిఐ రాష్ట్రనాయకత్వం ఒక కమిషన్ వేసి నిజానిజాలు తెలుసుకోమంది. అయితే దానిలో వేసినవారందరూ టిక్కెట్టు ఇచ్చిన నాయకులకు సన్నిహితులు కావడంతో మళ్లీ ఆందోళన చెలరేగింది. అప్పుడు సభ్యుల్ని మార్చారు. ఈ కమిషన్ పార్టీ క్యాడర్ నుండి పై దాకా 7 మందిని కలిసి వివరాలడిగింది. బెన్నెట్‌ను కూడా విచారించింది. డబ్బు చేతులు మారిందని నిర్ధారణకు వచ్చి, చివరకు సీనియర్ నాయకులైన సి. దివాకరన్, పి. రామచంద్రన్ నాయర్, వి.శశిలను తప్పు పట్టింది. వాళ్లు దురుద్దేశంతో బెన్నెట్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారని, వారిని శిక్షించాలని సిఫార్సు చేసింది. ముగ్గురిలో శశి తీర్పుకు వ్యతిరేకంగా తిరగబడి, పార్టీ విడిచిపెడతానని బెదిరించాడు. తను రూ. 1.7 కోట్లు పార్టీకి ఇచ్చి టిక్కెట్ కొనుక్కున్నానన్న ఆరోపణను ఖండిస్తూ బెన్నెట్ తనను అభ్యర్థిగా నిలబడమని పార్టీయే ఒత్తిడి చేసిందని చెప్పాడు. దీని ప్రకంపనలు సిపిఎంపై కూడా పడ్డాయి. తిరువనంతపురం టిక్కెట్‌ను బెన్నెట్‌కు ధారాదత్తం చేసినందుకు తమ పార్టీ కూడా బాధ్యత వహించాలని ఆ పార్టీ నాయకుడు ఎం.ఏ. బేబీ అన్నారు. ఎర్నాకులం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన క్రిస్టీ ఫెర్నాండెజ్‌ను సమర్థించినందుకు మరో నాయకుడు ఎం.ఎం.లారెన్సు విమర్శించారు. పోనుపోను అన్ని పార్టీలూ ఒకే తీరుగా తయారవుతున్నాయి.

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?