Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అనావృష్టి, అతివృష్టి.. రెండూ ఒకే సీజన్‌లో..!

అనావృష్టి, అతివృష్టి.. రెండూ ఒకే సీజన్‌లో..!

ఈ సీజన్‌ ఆరంభంలో వర్షాలు లేక తలపట్టుకున్నారు.. ఇప్పుడు వర్షాలు ఎక్కువై తలపట్టుకుంటున్నారు... ఇదీ రాయలసీమ రైతాంగం పరిస్థితి. భారీ వర్షాలతో రాయలసీమ అతలాకుతలం అవుతోంది. రికార్డు స్థాయి వర్షపాతాలు, కాలువలు ఏరులై పారుతున్నాయి. కురుస్తున్న వర్షాలు కొన్నిచోట్ల అత్యంత భారీగా కురుస్తుండగా, మరికొన్ని చోట్ల కూడా మంచి వర్షపాతం నమోదవుతోంది. ప్రత్యేకించి కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో కూడా బాగానే వర్షాలు వస్తున్నాయి.. కడప, కర్నూలు జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని అనంతలో మరింత ఎక్కువగా వస్తున్నాయి వర్షాలు.

ఈ వర్షపాతంతో కొంత ఆనందమే ఉన్నప్పటికీ ఇదే సమయంలో బాధ కూడా కలుగుతోంది. చాలాచోట్ల వర్షపాతం అధికమై పంటలు నాశనం అవుతున్న పరిస్థితి. ప్రధాన పంట వేరుశనగ, కాస్త లేటుగా విత్తుకున్న పత్తి, కుసుమ(ప్రొద్దుతిరుగుడు) పంటలు ఎటూ కాకుండా పోతున్నాయి. తీవ్రమైన వర్షాలతో పంట చేతికి అందే పరిస్థితి కనిపించడం లేదు. వేరుశనగ విత్తనాలకు పంటమీదే మొలకలు వచ్చే పరిస్థితి.

ఇప్పుడు వస్తున్న వర్షాలు వేరుశనగ చెట్లను పెరగనిస్తున్నాయి కానీ, కాయ దిగుబడి వస్తుందనే నమ్మకాన్ని హరించి వేస్తున్నాయి. సీజన్‌ ఆరంభంలో పొడిపొడిగా వర్షాలు వచ్చాయి. చాలామంది విత్తనాలు వేసుకున్నారు. ఆ అరకొర వర్షంతో కొన్నిచోట్ల విత్తనమే మొలకెత్తలేదు. మరికొన్ని చోట్ల విత్తనాలైతే మొలకెత్తాయి కానీ... ఆ తర్వాత వరణుడు మొహం చాటేశాడు. దీంతో వేరుశనగ పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది.

దీంతో మరోసారి కరువు తప్పదనే అంతా ఫిక్సయ్యారు, రెండునెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. అది ఖరీఫ్‌ పంటకు అత్యంత కీలక సమయం. వర్షం రాకపోవడంతో వేరుశనగ నేలకు అంటుకుపోయింది. ఇక అంతా ఆశలు వదిలేసుకున్నారు.

అయితే సెప్టెంబర్‌ రెండోవారం నుంచి వర్షం తగులుకుంది. ఒక్కోచోట ఒక్కోరోజున భారీ వర్షాలు వచ్చాయి. ఇక రుతుపవనాలు తిరోగమనం దశకు వచ్చేసరికి అత్యంత భారీ వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాలు కొన్నిచోట్ల చెరువులను కుంటలను నింపుతున్నాయి. ఖరీఫ్‌ పంటను దెబ్బతీసినా.. కనీసం రబీకి అయిన ఉపయుక్తం అవుతాయనేది చిన్ని ఆశ.

ఇక కొన్నిచోట్ల మాత్రం.. వస్తున్న వర్షాలు పంటలను నాశనం చేయడమే కానీ, చెరువులను కుంటలను నింపడంలేదు. ఇలాంటి ప్రాంతాల పరిస్థితి అగమ్యగోచరంగా అగుపిస్తోంది. అయితే కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటం.. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యానికి చేరడం కొంత ఊరటను ఇచ్చే అంశాలు. రాయలసీమకు న్యాయంగా దక్కాల్సిన నీళ్లు దక్కితే.. రైతన్నకు అంతో ఇంతో ఊరట లభించే అవకాశం ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?