Advertisement

Advertisement


Home > Articles - Special Articles

బాబోయ్‌ స్వైన్‌ఫ్లూ..!

బాబోయ్‌ స్వైన్‌ఫ్లూ..!

స్వైన్‌ఫ్లూ.. అని అందరం అనేస్తున్నాంగానీ, అసలు ఆ పేరుతో ప్రచారంలో వున్న వైరస్‌ పేరు హెచ్‌1ఎన్‌1. ఐదేళ్ళ క్రితం ప్రపంచాన్ని వణికించిందీ వైరస్‌. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్‌గా వుంది. మళ్ళీ ఇప్పుడు విజృంభిస్తోందది. వాతావరణ పరిస్థితులు చల్లగా వుంటే విజృంభించే హెచ్‌1ఎన్‌1 ఇప్పుడెందుకో.. కాస్త వేడి వాతావరణంలోనూ సత్తా చాటుకుంటోంది.

ఆ మధ్య తెలంగాణలో ఎక్కువగా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా దారుణంగానే వుంటోంది. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడ్తున్నవారు ఈ వైరస్‌ దెబ్బకు ప్రాణాలు కోల్పోయే అవకాశం వుందని వైద్య నిపుణులు చెబుతోంటే, వారితోపాటు.. యువకుల్నీ కబళించేస్తోంది స్వైన్‌ఫ్లూ.

కారణాలేంటి.? అని వైద్యులు తలపట్టుక్కూర్చుంటున్నారు. హెచ్‌1ఎన్‌1 వైరస్‌ కొత్త రూపు సంతరించుకుందని కొందరు, ఆ అవకాశాలు లేకపోలేదుగానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి అయితే కన్పించడంలేదని కొందరు.. ఇలా ఎవరికి వారు తమ వాదన విన్పిస్తున్నారు. మరోపక్క, మరణాల రేటు మాత్రం భయాందోళనలు కల్గిస్తోంది.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటిదాకా వెయ్యికి పైగా మరణాలు నమోదయ్యాయి. స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ జరిగిన కేసుల సంఖ్య 19 వేలు దాటిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రతతో స్వైన్‌ఫ్లూని నివారించవచ్చనీ, తగిన వైద్యం కూడా వుందని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా, స్వైన్‌ఫ్లూ విషయంలో పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో సాధారణంకన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతోంటే, అధిక ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లోనూ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన స్వైన్‌ఫ్లూని నివారించడంతోపాటు, స్వైన్‌ఫ్లూ బాధితులకు మెరుగైన చికిత్స అందించే దిశగా చర్యలు చేపట్టాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?