Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఛీ..భీ..ఐ.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?

ఛీ..భీ..ఐ.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?

సీబీఐ.. దేశంలోనే అత్యున్నతస్థాయి విచారణ సంస్థ ఇది. దురదృష్టవశాత్తూ ఇది 'పంజరంలో చిలుక'లా మారిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం, ఈ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసింది గతంలో.! రాజకీయ పెత్తనం పెరిగిపోవడంతో 'సీబీఐ' కాస్తా, జనం దృష్టిలో 'ఛీ..భీ..ఐ..'లా మారిపోయిందనడం అతిశయోక్తి కాదేమో.! 

ఒకటా.? రెండా.? అనేక కేసులు, వాటిల్లో సీబీఐ పరువు పోయింది తప్ప, ఆయా కేసుల్లో నిందితులకు మాత్రం శిక్ష పడలేదు. కొన్ని కేసుల్లో అయితే, అమాయకులు శిక్షలను అనుభవించాల్సి వచ్చింది. ఎందుకిలా జరుగుతోంది.? సమాధానం సింపుల్‌, అన్నిట్లోనూ అవినీతి పెరిగిపోయినట్లే, సీబీఐ మీదా అవినీతి మరకలు పడటమే. 

సీబీఐ డైరెక్టర్లుగా పనిచేసినవారిపైనా అనేక కేసులు నమోదయ్యాయి. వారితో సంబంధాలు పెట్టుకున్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, బ్రోకర్ల వ్యవహారాలు ఎప్పటికప్పుడు వెలుగుచూస్తూనే వున్నాయి. మరి, ఈ పరిస్థితి మారదా.? ఈ ప్రశ్న వేసేంతలోపే, సీబీఐ ఇమేజ్‌ని డ్యామేజీ చేసే ఇంకో సంఘటన వెలుగు చూసింది. 

అది ఢిల్లీ - గుర్‌గావ్‌లోని రేయాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌. రెండో తరగతి విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఆ బాలుడిపై, అదే స్కూల్‌కి చెందిన బస్‌ డ్రైవర్‌ లైంగిక దాడికి యత్నించాడనీ, కుర్రాడు ప్రతిఘటించడంతో చంపేశాడనీ అప్పట్లో వచ్చిన వార్తలు పెద్ద దుమారమే రేపాయి. బస్‌ డ్రైవర్‌ అరెస్టయ్యాడు. స్కూలుపై చర్యలు తీసుకోవడమూ చూశాం. ఇంతలోనే పెద్ద ట్విస్ట్‌. అసలు, ఆ కుర్రాడిని చంపింది బస్‌ డ్రైవర్‌ కాదు, అదే స్కూల్‌లో చదువుతోన్న సీనియర్‌ స్టూడెంట్‌ అని సీబీఐ సంచలన ప్రకటన చేసింది. 

తాజాగా ఆరోపణలు ఎదుర్కోంటోన్న ఆ సీనియర్‌ విద్యార్థి తరఫున అతని తండ్రి మాట్లాడుతూ, 'ఈ కేసుతో నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు..' అని గగ్గోలు పెడుతున్నాడు. అయితే, హత్య జరగడానికి ఓ రోజు ముందు, పోర్న్‌ సినిమాలు చూస్తూ, ఆ సీనియర్‌ విద్యార్థి ఉద్రేకానికి లోనయ్యాడనీ, అతడే లైంగిక దాడికి యత్నించాడనీ సీబీఐ అంటోంది. దాంతోపాటుగా, పరీక్షల భయం సహా ఇతర కారణాలు, పరీక్షలు వాయిదా వేయించాలన్న ఆలోచన.. ఇవన్నీ సీనియర్‌ విద్యార్థి మృగంలా మారి, రెండో తరగతి చదువుతున్న స్టూడెంట్‌ని చంపేయడానికి దారి తీసిన పరిస్థితులని సీబీఐ వాదిస్తోంది. 

ఏమో, ఇక్కడ సీబీఐ వాదనే నిజం కావొచ్చు. కానీ, కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే, ఆరుషి తల్వార్‌ హత్య కేసులో ఏమయ్యింది.? తల్లిదండ్రులే హంతకులని సీబీఐ తేల్చింది. ఆరుషి తల్లిదండ్రులు జైలుకి వెళ్ళారు. చివరికి న్యాయస్థానం, వారిని నిర్దోషులుగా తేల్చింది. అంటే, ఇక్కడ సీబీఐ వాదన పూర్తిగా తప్పనే కదా అర్థం.! మరి, రేయాన్‌ స్కూల్‌ విద్యార్థి ప్రద్యుమన్‌ హత్యని సీబీఐ డీల్‌ చేస్తున్న విధానం సరైనదేనా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. 

ప్రపంచంలోనే మేటి 'ఇన్వెస్టిగేషన్‌' సంస్థల్లో సీబీఐ ఒకటని మనం గర్వంగా చెప్పుకుంటాం. అదే నిజమైతే, ఆరుషి విషయంలో ఎందుకలా జరిగింది.? పొలిటికల్‌ లీడర్స్‌ కేంద్రంగా నడిచే కుంభకోణాల విచారణ జరిగే ప్రతిసారీ, సీబీఐ మీద ఎందుకు బురద చల్లబడ్తోంది.? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి వుంది. సమాధానం దొరుకుతుందో లేదో, ఈలోగా సీబీఐ కాస్తా, జనం ఛీదరించుకునేలా 'ఛీ..భీ..ఐ' అనిపించుకుంటుండడం దురదృష్టకరం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?