Advertisement

Advertisement


Home > Articles - Special Articles

గబ్బు పట్టించే 'పబ్బు'లంటే ఆ కిక్కే వేరప్పా.!

గబ్బు పట్టించే 'పబ్బు'లంటే ఆ కిక్కే వేరప్పా.!

పాత సినిమాల్లో క్లబ్‌ డాన్సులుండేవి. వాటిల్లో డాన్సులు చేయడానికి 'వ్యాంప్‌'లని పిలవబడే నటీమణులుండేవారు. అయితే, ఆ క్లబ్‌ డాన్సులపై నిషేధంతో, వ్యాంప్‌లు కాలగర్భంలో కలిసిపోయి, ఐటమ్‌ బాంబులు తెరపైకొచ్చిన విషయం విదితమే. అక్కడా, ఇక్కడా జరిగేదొక్కటే.. అదే అంగాంగ ప్రదర్శన. కానీ, జస్ట్‌ పేరు మారిందంతే. అది నేరం, ఇది ఆహ్లాదం.! 

పబ్‌ కల్చర్‌ పెరిగిపోయాక, ఐటమ్‌ బాంబుల్ని మించిపోతున్నారు అక్కడ డాన్సులేసేవాళ్ళలో చాలామంది. తప్పతాగి, ఒంటిమీద సోయ లేకుండా చిందులేయడమే పబ్‌ కల్చర్‌. అంత సోయ లేకుండా అక్కడి పరిస్థితులుంటే, తాగుతున్నది కేవలం మద్యమేనా.? దాంతోపాటుగా డ్రగ్స్‌ కూడా మిక్స్‌ అవుతున్నాయా.? అన్నదెలా తెలుస్తుంది.? 

మద్యం, సిగరెట్‌ ఇచ్చే కిక్‌ కాదు, అంతకు మించిన 'డ్రగ్స్‌' కిక్‌ పబ్బుల్లో లభిస్తుంది. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. అక్కడ అశ్లీల నృత్యాలుంటాయి.. ఇంకా చాలా చాలా జరుగుతుంటాయి. అయినా, ప్రభుత్వాలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తాయి. అప్పుడప్పుడూ, వాటిపై దాడులు జరిగినా, ఆ తర్వాత వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చేస్తుంటుంది. పబ్‌ కల్చర్‌ వుంటేనే, అది మెట్రో సిటీ కింద లెక్క.. అన్న భావన కూడా లేకపోలేదు. అందుకే, ఈ పబ్‌ కల్చర్‌ చిన్నసైజు పట్టణాలకీ పాకేస్తోంది. 

హైద్రాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం తర్వాత ఈ పబ్‌ కల్చర్‌పై చర్చ షురూ అయ్యింది. నిజానికి, పబ్‌లలో డ్రగ్స్‌ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూడటమే ఆశ్చర్యం. డ్రగ్స్‌ ఎక్కువగా చెలామణీ అయ్యేది పబ్స్‌లోనేనని చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు. అలాంటిది, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు నోటీసులు వెళ్ళాయి.. సినీ ప్రముఖుల విచారణా షురూ అయ్యింది.. తీరిగ్గా పబ్స్‌ నిర్వాహకుల్ని 'మీటింగ్‌'కి తెలంగాణ ఎక్సయిజ్‌ శాఖ పిలవడమేంటట.? 

పబ్‌ల ద్వారా వచ్చే ఆదాయం సహా అనేక అంశాలు, ఆ పబ్‌లను పాలకులు పెంచి పోషించడానికి కారణమవుతున్నాయి. పబ్బుల్లో తాగి తందనాలాడేసి, ఆ తర్వాత అదే మైకంతో వాహనాలు నడిపి, ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు కొందరు. అయినాసరే, పబ్స్‌పై కన్నెర్రజేసింది లేదు. పబ్‌ కల్చర్‌, మొత్తంగా మన సంస్కృతీ సంప్రదాయాల్ని సర్వనాశనం చేసేస్తున్నాసరే.. పాలకులకు అదేమీ పట్టదు. ఎందుకంటే, ఎవడి ఖర్మ వాడిది.. తాగాలనుకున్నోడికి ఓ ప్లేస్‌.. అదీ చట్టబద్ధంగా.. అన్నది పాలకుల వాదన కావొచ్చుగాక.! కానీ, అనుమతులిచ్చి ఊరుకోవడంలేదు.. అక్కడి అక్రమాలకు పాలకుల అచేతనావస్థే పరోక్షంగా కారణమవుతోంది. 

పబ్‌ కల్చర్‌ని రాత్రికి రాత్రి 'బ్యాన్‌' చేస్తే, డ్రగ్స్‌ అనే వైరస్‌ సమాజం నుంచి తేలిగ్గానే ఎలిమినేట్‌ అయిపోతుంది. కానీ, అంత ధైర్యం మన పాలకులకెక్కడిది.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?