Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జయ...విజయకు ఇంకా ప్రజాకర్షణ ఉందా?

జయ...విజయకు ఇంకా ప్రజాకర్షణ ఉందా?

జయ, విజయ అంటే రాజకీయ నాయకురాళ్లుగా మారిన మాజీ హీరోయిన్లు జయసుధ, విజయశాంతి. వైఎస్‌ రాజశేఖరెడ్డి హయాంలో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెసు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జయసుధ ఆ పార్టీలో ఉండలేక, ఉండి ఏం చేయాలో అర్థకాక కొంతకాలం కిందట టీడీపీలో చేరారు. జయసుధ కంటే విజయశాంతి రాజకీయ చరిత్ర పెద్దది. టీఆర్‌ఎస్‌ నాయకురాలిగా ఓ వెలుగు వెలిగారు. 'తెలంగాణ బిడ్డ' అనే ముద్ర వేయించుకున్నారు. టీఆర్‌ఎస్‌లోనే ఉంటే, అదీ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌, కవితలతో మంచిగా ఉన్నట్లయితే ప్రత్యేక రాష్ట్రంలో అందలం ఎక్కేవారు. కాని అదృష్టం చేజారిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెసు తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయాక ఇంటికే పరిమితమైపోయారు. వీరిద్దరి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం? కాంగ్రెసు, టీడీపీ నాయకులు వీరి గురించి ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి కాబట్టి. ఏమాలోచిస్తున్నారు?

వీరికి ఇప్పటికీ ప్రజలను ఆకర్షించే శక్తి ఉందని, వీరి సినిమా గ్లామర్‌ సజీవంగా ఉందని, వచ్చే ఎన్నికల యుద్ధంలో వీరిని ముందు నిలిపి ఓట్లు సంపాదించాలని ఆలోచిస్తున్నారట...! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల రాజకీయాల్లో సినిమా గ్లామర్‌ బాగానే ఉపయోగపడినమాట వాస్తవమే. స్వయంగా నటరత్న ఎన్టీఆరే ముఖ్యమంత్రి అయ్యారు కదా. కాని ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అని ప్రశ్నించుకుంటే అవునని చెప్పడం కష్టం. సినిమా గ్లామర్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ క్రేజ్‌ ఉందేమోగాని తెలంగాణలో అంతగా లేదనే చెప్పొచ్చు. సినిమా తారలతో ప్రచారం చేయించి లేదా వారిని అభ్యర్థులుగా నిలబెట్టి ఓట్లు సాధించుకోవడం తెలంగాణలో వర్కవుట్‌ కాదు. ఈ నేపథ్యంలో వెటరన్‌ హీరోయిన్‌లైన జయసుధ, విజయశాంతి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, టీడీపీలకు ఎలా ఉపయోగపడతారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

2014 తరువాత ఈ ఇద్దరు తారలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే అజ్ఞాతంలో ఉన్నారు. విజయశాంతి కాంగ్రెసులోనే ఉన్నా లేనట్లుగా ఉన్నారు. ఓటమి తరువాత ఆమెకు పార్టీ ఊసే లేకుండాపోయింది. జయసుధ ఓటమి తరువాత కాంగ్రెసులో కొనసాగినంత కాలం ఇలాగే ఉన్నారు. టీడీపీలో చేరాక కూడా మార్పు లేదు. ఈమధ్య ఆంధ్రాలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరుకావడం మినహా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ కనబడలేదు. వచ్చే ఎన్నికలనాటికి జయసుధ టీడీపీలోనే కొనసాగవచ్చేమోగాని, విజయశాంతి అంతరంగం కనిపెట్టడం కష్టం.  ఆమె కాంగ్రెసులోనే ఉంటుందని నమ్మకమేమిటి? ఒక దశలో వీరిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరాలని ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి కేసీఆర్‌ అంగీకరించలేదో, ఒప్పందాలు కుదరలేదో తెలియదు. ఇక విజయశాంతికి తెలంగాణ బిడ్డగా ముద్రపడినా జయసుధ మీద ఆ ముద్ర లేదు.

కాబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఆమెను తెలంగాణలో ఉపయోగించుకుంటుందా? ఆంధ్రాలో ప్రయోగిస్తుందా? తెలియదు. ఆమె టీడీపీలో చేరినా ఏ రాష్ట్ర నాయకురాలనేది స్పష్టత లేదు.  ఆమె వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇమేజ్‌, మతం కారణంగా ఒకసారి విజయం సాధించారు తప్ప ప్రజాదరణ ఉన్న నాయకురాలు కాదు. మాటల్లో, చేతల్లోనూ విజయశాంతి అంతటి వేగం లేదు. వీరిద్దరికీ ఇంకా సినిమా గ్లామర్‌ ఉందని, అది ఓట్లు తెచ్చిపెడుతుందని టీడీపీ, కాంగ్రెసు నాయకులు ఎందుకు నమ్ముతున్నారో అర్థంకాడంలేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో, ఆంధ్రాలో కొందరు సినిమా నటీనటులను కాంగ్రెసు, టీడీపీ తెర మీదికి తెస్తాయనే ఊహాగానాలు సాగుతున్నాయి. కొందరి పేర్లూ ప్రచారమవుతున్నాయి. ఈ ప్రచారంలో నిజానిజాలను ఇప్పుడే నిర్థారించలేం. పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ రంగంలోకి దిగే అవకాశముంది. 2019 ఎన్నికల్లో పక్కా అని ఆంధ్రాలో జరిగిన చేనేత ఉద్యమ సభలోనూ పవర్‌ స్టార్‌ ప్రకటించారు. మరి ఆయన సినిమా తారలను రంగంలోకి దించుతారా? చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?