Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఖైదీ, శాతకర్ణి.. ఇక్కడికెందుకొస్తారు.?

ఖైదీ, శాతకర్ణి.. ఇక్కడికెందుకొస్తారు.?

సినిమాల్లో అంటే, ఖైదీ రైతు సమస్యల కోసం పోరాడేస్తాడు.. శాతకర్ణి తెలుగు జాతి ఆత్మగౌరవమంటూ మీసం మెలేసేస్తాడు. రియల్‌ లైఫ్‌లో మాత్రం అటు ఖైదీ, ఇటు శాతకర్ణి సైలెంటయిపోతారు. అదే మరి సినిమాకీ, రియల్ లైఫ్ కీ వున్న తేడా.

ఆంధ్రప్రదేశ్ - ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తెరపైకొచ్చింది. తమిళనాడులో జల్లికట్టు కోసం అంతా ఐక్యంగా పోరాటం చేయడంతో, కేంద్రం దిగొచ్చింది. మరి, అదే పోరాట పటిమ ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు కన్పించదు.? ఇదే ప్రశ్న అందరి మెదళ్ళనీ తోచేస్తోంది. జల్లికట్టు కోసం తమిళ సినీ పరిశ్రమ మొత్తంగా స్పందించింది.. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం ఎందుకు తెలుగు సినీ పరిశ్రమ స్పందించదు.? అంటూ, జనం తమను తాము ప్రశ్నించుకుంటున్నారిప్పుడు. 

సమైక్య ఉద్యమంలో 'ఆంధ్రా మేధావి'గా తెరపైకొచ్చిన చలసాని శ్రీనివాస్‌, 'ఖైదీ, శాతకర్ణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరఫున నిలబడాలి..' అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు చట్ట విరుద్ధం. ఇప్పుడా చట్టాన్ని సవరించేందుకే ఉద్యమం నడుస్తోందక్కడ. ప్రత్యేక హోదా, రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన హక్కు. దాన్ని ఆంధ్రప్రదేశ్‌ సాధించుకోలేకపోవడం దురదృష్టకరం. 

చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయింది. ప్రస్తుతం ఆయన ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బాలకృష్ణ అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. పలు సందర్భాల్లో అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణ తూతూ మంత్రంగా ప్రత్యేక హోదాపై స్పందించారంతే. ఈ ఇద్దరూ ఈ సంక్రాంతికి తమ తమ సినిమాలతో సక్సెస్‌లు కొట్టారు. మరి, అంతలా వారి సినిమాల్ని సక్సెస్‌ చేసిన ప్రజల కోసం రాజకీయ పోరాటానికి సంసిద్ధులు కాలేరా.? 

అన్నట్టు, ఇంకో సినీ పొలిటికల్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ వున్నారండోయ్‌.. ఆయన ట్విట్టర్‌లో ప్రత్యేక హోదా కోసం మాట్లాడతారు.. అప్పుడప్పుడూ బహిరంగ సభలు పెడ్తారు.. అంతే, మళ్ళీ సైలెంటయిపోతారు. ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్‌కి కరువు ఏమీ లేదు. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌, చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహిస్తున్న రోజా సినీ రంగానికి చెందినవారే. 

పార్టీలను పక్కన పెట్టాల్సిన పనిలేదు.. ఆయా పార్టీల వేదికల మీదనుంచే ప్రత్యేక హోదాతోపాటు, రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా దక్కిన హామీల గురించీ పోరాడితే.. ఈ క్రమంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఎంత బాగుంటుంది.? చాలా చాలా బాగుంటుంది.. కానీ, ఆ బాగు కోసం వాళ్ళంతా కలవాలి కదా.? ఆ ఐక్యత మనకెక్కడిది.? వాళ్ళలో అంత చిత్తశుద్ధి ఎక్కడిది.? అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం తప్ప, ప్రజల సెంటిమెంట్లతో వీళ్ళకి పనేంటి.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?