Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అక్కడ మెగాఫ్యాన్స్ ను కొట్టేవాడు లేడు

అక్కడ మెగాఫ్యాన్స్ ను కొట్టేవాడు లేడు

తెలుగు రాష్ట్రాల్లో మీడియా అంటే ఒక వర్గానిదే పైచేయి. తిమ్మిని బమ్మిని చేయాలన్నా, బమ్మిని తిమ్మిని చేయాలన్నా ఆ వర్గానిదే హవా. జగన్ ను జనం ముందు దోషిగా నిలపాలన్నా, బాబును అంతెత్తున కూర్చోపెట్టాలన్నా, బాహుబలిని  పుష్కరస్నాన సమానంగా చూపించి, హిట్ చేయాలన్నా ఇలా ఏం చేయాలన్నా కూడా ఆ మీడియాది అందెవేసిన చేయి. 

కానీ రానురాను మాధ్యమాలు మారుతున్నాయి. స్వతంత్ర మాధ్యమాల హవా పెరుగుతోంది. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్, యూ ట్యూబ్ లు ముందుకు వచ్చాయి. వీటి మీద ఎవరి ఆధిపత్యమూ లేదు. ఎంత చేసుకోగలిగితే అంతా చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం రెండు రాష్ట్రాల్లో మీడియాను శాసిస్తున్న వర్గం పప్పులు ఉడకడం లేదు. ట్విట్టర్, వాట్సప్, ఫేస్ బుక్ లను మెగాఫ్యామిలీకి వెన్నుదన్నుగా నిలచిన ఒక వర్గం, అలాగే మెగా హీరోలను అభిమానించేవారు వాడినంతగా, నందమూరి ఫ్యామిలీని అభిమానించేవారో, లేదా ఆ వర్గానికి చెందిన వారో వాడలేకపోతున్నారు. 

ఈ విషయం ఖైదీ 150, శాతకర్ణి సినిమాల విషయంలో క్లియర్ గా కనిపించింది. ఖైదీ విషయంలో ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ లలో మెగాభిమానులు చెలరేగిపోయారు. ట్వీట్ లు కానీ, రకరకాల పోస్టింగ్ లతో, ట్వీట్లతో, అప్ డేట్ల తో, కామెంట్లతో హోరెత్తించారు. అలాగే ఫేస్ బుక్ లో రకరకాల విడియోలు, ఫొటొలు ప్రచారానికి తెచ్చారు. శాతకర్ణి థియేటర్ల దగ్గర జనాలు లేనట్లు, శాతకర్ణి సినిమాలో జనాలు నిద్రపోతున్నట్లు, చిన్న విడియోలు, ఫొటోలు తెగ ప్రచారంలోకి వచ్చాయి. ఫేస్ బుక లోకి వచ్చినవన్నీ వాట్సప్ లోకి చలామణీలోకి వచ్చాయి. 

ఇది చాలక శాతకర్ణి పై ఏ ఆంధ్రుల ఆత్మగౌరవం అని ప్రచారం సాగిస్తున్నారో, దానికి వ్యతిరేకంగా అన్నట్లు, రకరకాల చిన్న చిన్న వ్యాసాలు, కథనాలు వండి వాటిని వాట్సప్ లో చలామణీ చేసారు. ఇలా అన్ని రకాలుగా శాతకర్ణిపై ముప్పేట దాడి జరిగింది. ఈ దాడిని బాలకృష్ణకు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ అనుకూలంగా వ్యవహరించే మీడియా సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయింది. ఇక్కడ మాత్రం ప్రింట్, విజువల్ మీడియా కన్నా, సోషల్ మీడియానే ప్రాధాన్యత వహించింది. కేవలం ఖైదీకి అనుకూల ప్రచారం నిర్వహించడమే కాకుండా, శాతకర్ణి థియేటర్లు ఖాళీగా వున్నట్లు, శాతకర్ణి టికెట్ లు అలాగే అమ్ముడు కాకుండా వుండిపోయినట్లు ప్రచారం సాగింది. అదే సమయంలో ఖైదీ కలెక్షన్ల విషయంలో ఎవరికి తోచినట్లు వారు ప్రచారం సాగించారు. 150 కోట్ల గ్రాస్ అన్నంతగా ప్రచారం వాట్సప్ ల్లో సాగింది. 

చిత్రమేమిటంటే, సాధారంణగా ఈ సోషల్ మీడియాను తెలుగుదేశం పార్టీ చాలా సమర్థవంతంగా వాడుకుంటుంది. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. కానీ ఇప్పుడు బాలయ్య బాబు సినిమా విషయానికి వచ్చేసరికి, ఆ వర్గం పూర్తిగా చేతులు ఎత్తేసినట్లు కనిపించింది. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే, ఇదే తీరు ఎన్నికల్లో సాగితే తెలుగుదేశం పార్టీకి కష్టమే అవుతుంది.

- సాయి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?