Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: చిన్నదాన నీకోసం

సినిమా రివ్యూ: చిన్నదాన నీకోసం

రివ్యూ: చిన్నదాన నీకోసం
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: శ్రేష్ఠ్‌ మూవీస్‌
తారాగణం: నితిన్‌, మిష్తి, నాజర్‌, అలీ, నరేష్‌, సితార, ధన్యా బాలకృష్ణన్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు
మాటలు: హర్షవర్ధన్‌
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ
సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌
నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖిత రెడ్డి 
కథ, కథనం, దర్శకత్వం: ఎ. కరుణాకరన్‌
విడుదల తేదీ: డిసెంబర్‌ 25, 2014

‘తొలిప్రేమ’ తర్వాత చాలా కాలం స్ట్రగుల్‌ అయిన డైరెక్టర్‌ కరుణాకరన్‌ డార్లింగ్‌, ఉల్లాసంగా ఉత్సాహంగాతో ఫామ్‌లోకి వచ్చాడు. కరుణాకరన్‌ గత చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’ నిరాశ పరిచినా కానీ ‘ఇష్క్‌’తో తిరిగి ట్రాక్‌ ఎక్కేసిన నితిన్‌తో అతను ‘చిన్నదాన నీకోసం’ తలపెట్టే సరికి దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక మంచి లవ్‌స్టోరీ ఎక్స్‌పెక్ట్‌ చేసారు. సొంత బ్యానర్‌లో హ్యాట్రిక్‌ కొట్టాలని ఏరి కోరి ఈ సినిమా చేసిన నితిన్‌కి ‘చిన్నదాని’తోను అదృష్టం కలిసి వచ్చిందా? 

కథేంటి?

నందినిని (మిష్తి) చూడగానే ప్రేమలో పడిపోతాడు నితిన్‌ (నితిన్‌). సకల కళలు తెలిసిన నందినిని ఇంప్రెస్‌ చేయడానికి నానా పాట్లు పడుతుంటాడు. అనుకోకుండా నితిన్‌తో నందినికి అవసరం పడుతుంది. ఆ తర్వాత అతడిని వదిలించుకుందామన్నా కానీ కుదరదు. ఒకసారి చెప్పాపెట్టకుండా బార్సిలోనా వెళ్లిపోతుంది నందిని. ఆమె తన దగ్గర దాచి పెట్టిన సంగతేంటో తెలిసిపోయిన నితిన్‌ కూడా అక్కడికి వెళతాడు. ఇంతకీ నందిని గతమేంటి? ఆమె ఎందుకని నితిన్‌కి చెప్పకుండా దేశం వదిలి వెళ్లిపోయింది?

కళాకారుల పనితీరు:

ఇరవై సినిమాలు చేసేసిన నితిన్‌కి ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. సక్సెస్‌తో వచ్చిన కాన్ఫిడెన్స్‌తో మరింత ఈజ్‌తో నటించేస్తోన్న నితిన్‌ ఇందులోను క్యాజువల్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. చాలా మామూలుగా ఉన్న ప్రథమార్థం వినోదాత్మకంగా అనిపించడంలో నితిన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. ఇంత ఫామ్‌లో ఉన్న నితిన్‌ కూడా ద్వితీయార్థంలో ఏం చేయలేక చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. రెండు పాటల్లో మంచి డాన్స్‌ మూమెంట్స్‌తో అలరించాడు.

Video: Exclusive Interview With Nithiin 

మిష్తి పర్‌ఫార్మెన్స్‌ బాగానే ఉంది కానీ కొన్ని చోట్ల లిప్‌ సింక్‌ మిస్‌ అయింది. కథ అంతా తన చుట్టూ తిరుగుతుంది కనుక ఈ పాత్రకి ఎస్టాబ్లిష్డ్‌ హీరోయిన్‌ని తీసుకుని ఉంటే బాగుండేది. నాజర్‌కి ఇలాంటి పాత్రలు అలవాటే కనుక అవలీలగా చేసేసారు. ద్వితీయార్థంలో కామెడీ భారాన్ని అలీపై మోపారు కానీ అతని కోసం మంచి సీన్లు. డైలాగులు రాసుకోకపోవడంతో అతనూ ఏం చేయలేకపోయాడు. మధు, జోష్‌ రవి చేసిన గే కామెడీ చిరాకు పెడుతుంది. నరేష్‌, సితార కాంబినేషన్‌లో నితిన్‌ చేసిన సీన్స్‌ బాగున్నాయి. 

సాంకేతిక వర్గం పనితీరు:    

‘ఇష్క్‌’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలకి సూపర్‌హిట్‌ ఆల్బమ్స్‌ అందించిన అనూప్‌ రూబెన్స్‌ ఈసారి ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయలేకపోయాడు. టైటిల్‌ సాంగ్‌ మినహా మరేవీ క్యాచీగా లేవు. పాటల చిత్రీకరణ మాత్రం బాగుంది. సినిమాటోగ్రాఫర్‌, కొరియోగ్రాఫర్స్‌ అనూప్‌ చేసిన బిలో యావరేజ్‌ పాటలకి విజువల్‌గా వేల్యూ తీసుకొచ్చారు. ఆండ్రూ మరోసారి తన సినిమాటోగ్రఫీతో రొమాంటిక్‌ మూవీస్‌కి తనే బెస్ట్‌ ఆప్షన్‌ అనిపించుకున్నాడు. కలర్‌ఫుల్‌ విజువల్స్‌ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. ఎడిటర్‌ ఎంత కష్టపడినా, వీలయినంత క్రిస్ప్‌గా ఉంచాలని తనవంతు కృషి చేసినా ప్రయోజనం లేకపోయింది. హర్షవర్ధన్‌ డైలాగ్స్‌ అక్కడక్కడా నవ్విస్తాయి. కానీ అతను కూడా ‘గుండెజారి..’, ‘మనం’ స్థాయిలో తన పెన్‌ పవర్‌ చూపించలేకపోయాడీసారి. శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన గత చిత్రాల్లానే ఇది కూడా రిచ్‌గా ఉంది. ప్రొడక్షన్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవలేదు. 

కరుణాకరన్‌ గురించి చెప్పుకుంటే ఇప్పటికీ అతని తొలి చిత్రం ‘తొలిప్రేమ’ గుర్తుకొస్తుంది. దశాబ్ధంన్నర క్రితం చేసిన ఆ సినిమా రేంజ్‌ అద్భుతాన్ని మళ్లీ అతను ఎప్పుడూ చేయలేకపోయాడు. డార్లింగ్‌, ఉల్లాసంగా ఉత్సాహంగాతో మెప్పించినా కరుణాకరన్‌ ఎక్కువసార్లు డిజప్పాయింట్‌ చేస్తున్నాడు. ‘చిన్నదాన నీకోసం’ కూడా అతను తీసిన బ్యాడ్‌ ఫిలింస్‌ లిస్ట్‌లోకే చేరుతుంది. ఫస్ట్‌ హాఫ్‌ వరకు తన మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకున్నా అటుపై ఒక్కసారిగా సినిమా గ్రాఫ్‌ని పాతాళానికి పడేసాడు. 

హైలైట్స్‌:

  • నితిన్‌
  • ఎంటర్‌టైనింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌

డ్రాబ్యాక్స్‌:

  • కరుణాకరన్‌ డైరెక్షన్‌
  • అనూప్‌ మ్యూజిక్‌
  • డిజప్పాయింటింగ్‌ సెకండ్‌ హాఫ్‌

విశ్లేషణ:

హీరో హీరోయిన్ల మధ్య కీచులాటలతో మొదలయ్యే ప్రేమ కథ.. కరుణాకరన్‌ ట్రేడ్‌ మార్క్‌. ఇందులో కూడా కరుణాకరన్‌ తన మార్క్‌ని విడిచిపెట్టకుండా కేవలం వినోదంతోనే కాలక్షేపాన్ని ఇచ్చేసాడు. దాదాపు చాలా సినిమాల్లో చూసే సీన్లే అయినా కానీ కంప్లయింట్‌ చేయకుండా మరోసారి వాటిని ఎంజాయ్‌ చేసేట్టు తెరకెక్కించాడు. ఇంటర్వెల్‌ దగ్గర ఇచ్చిన ట్విస్ట్‌ ఏంటనేది ఊహించేయడం పెద్ద కష్టమేం కాదు. అందుకేనేమో సెకండాఫ్‌ మొదలు కాగానే అసలు సంగతి రివీల్‌ చేసేసారు. 

ఫస్ట్‌ హాఫ్‌ ముగిసిన తర్వాత ‘చిన్నదాన నీకోసం’పై పెద్దగా అంచనాలేం ఏర్పడవు. ఒక కాలక్షేప ప్రేమకథా చిత్రమే అనుకుంటారు తప్ప ద్వితీయార్థంపై అంచనాలు పెంచుకుని చూడరు. అయినప్పటికీ ఈ చిత్రం ద్వితీయార్థంలో పూర్తిగా నిరాశ పరుస్తుందంటే సెకండ్‌ హాఫ్‌ ఎంత బ్యాడ్‌గా ఉందనేది అర్థం చేసుకోండిక. ఎందుకో తెలుగు సినిమాల్లో విదేశాల్లో తీసిన ఎపిసోడ్స్‌ చాలా కృతకంగా ఉంటాయి. అయితే చాలా చిత్రాల్లో ఈ ఫారిన్‌ ఎపిసోడ్‌ ఫస్ట్‌ హాఫ్‌లో అయిపోతుంది. తర్వాత ఆ లోటుని ద్వితీయార్థంలో తీర్చి పాస్‌ అయిపోతుంటాయి. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే పరంగా సెకండ్‌ హాఫ్‌లోనే ఫారిన్‌ ఎపిసోడ్‌ పడిరది. చాలా చిత్రాల మాదిరిగానే ఆ ఎపిసోడ్‌ పేలవంగా తయారైంది. ఫలితంగా ‘చిన్నదాన నీకోసం’ ఫస్ట్‌ హాఫ్‌లో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ కనుమరుగై సెకండ్‌ హాఫ్‌ సహనాన్ని పరీక్షిస్తుంది. 

Video:China Daana Neekosam Public Talk

క్లయిమాక్స్‌ కూడా చాలా హడావుడిగా వచ్చి పడిపోతుంది. అంతవరకు నితిన్‌ని విపరీతంగా ద్వేషించిన మిష్తి ఒకే సీన్లో అతనిపై అంతులేని ప్రేమ కురిపించేసి ఒక విషాద గీతం కూడా పాడేసుకుంటుంది. ఈ ద్వితీయార్థాన్ని నిలబెట్టేందుకు అలీని తీసుకొచ్చి, గే కామెడీతో ఒక పెద్ద సీక్వెన్స్‌ నడిపించి, చివరకు పవన్‌కళ్యాణ్‌ ‘బద్రి’ సీన్‌ని కూడా వాడేసుకున్నా ఫలితం లేకపోయింది. తొలిప్రేమలో పోస్ట్‌ కార్డుల సీన్‌ని ఇందులో పెయింటింగ్స్‌తో రిపీట్‌ చేసినా కానీ ఆ సినిమాలోని ఫీల్‌లో కనీసం పది శాతమైనా జనరేట్‌ కాకపోవడంతో ‘చిన్నదాన నీకోసం’ తీవ్రంగా నిరాశ పరుస్తుంది. 

నితిన్‌ లైవ్‌లీ పర్‌ఫార్మెన్స్‌, ఎంటర్‌టైనింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే ‘చిన్నదానికి’ సేవింగ్‌ గ్రేస్‌. సెకండ్‌ హాఫ్‌లో ఒక్కచోట అయినా పడిపోయిన గ్రాఫ్‌ మళ్లీ పైకి లేవకపోవడంతో ఓవరాల్‌గా ఈ చిత్రం నిరాశ పరుస్తుంది. అయితే కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, నితిన్‌పై ఆడియన్స్‌కి పెరిగిన కాన్ఫిడెన్స్‌ ఈ చిత్రానికి హాలిడే పీరియడ్‌లో కలిసి వచ్చే అవకాశముంది. కథాబలాన్ని నమ్ముకుని ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందేతో పెద్ద హిట్లు కొట్టిన నితిన్‌ ఇప్పుడు పూర్తిగా ఎక్స్‌టర్నల్‌ ఫ్యాక్టర్స్‌ మీదే ఆధారపడాలి. ఒక ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ చూడాలని వెళ్లినా, ఒక కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేసినా నిరాశే మిగుల్తుంది. 

బోటమ్‌ లైన్‌: కాస్త వినోదం పంచి... బాగా విసిగించిన ‘చిన్నది’. 

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?