Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: గంగ

సినిమా రివ్యూ: గంగ

రివ్యూ: గంగ
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌
తారాగణం: రాఘవ లారెన్స్‌, తాప్సీ, నిత్యా మీనన్‌, కోవై సరళ, సుహాసిని, జయప్రకాష్‌, పూజ రామచంద్రన్‌, మనోబాల, శ్రీమాన్‌ తదితరులు
నేపథ్య సంగీతం: తమన్‌
కూర్పు: కిషోర్‌
ఛాయాగ్రహణం: రాజవేల్‌ ఓల్హివీరన్‌
నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు
కథ, కథనం, దర్శకత్వం: రాఘవ లారెన్స్‌
విడుదల తేదీ: మే 1, 2015

హారర్‌కి కామెడీని జోడించి దానికి కమర్షియల్‌గా ఎంతటి రీచ్‌ ఉందనేది ముందుగా చూపించింది ‘ముని’. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కాంచన’ హారర్‌ కామెడీలపై చాలా మంది దృష్టి పెట్టేలా చేసింది. బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ సృష్టించడమే కాకుండా ట్రెండ్‌ సెట్‌ చేసేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో హారర్‌ కామెడీలు అనేకం తెరకెక్కుతున్నాయి. వాటిలో చాలా వరకు విజయవంతం అవుతున్నాయి. ఇక ఈ జోనర్‌ని పాపులరైజ్‌ చేసిన రాఘవ లారెన్స్‌ తన ముని సిరీస్‌లో మూడో సినిమాని ‘గంగ’ పేరుతో తెరకెక్కించాడు. 

ఇది కూడా అచ్చంగా ముని, కాంచన టెంప్లేట్‌నే ఫాలో అవుతుంది. దెయ్యాలంటే భయపడిపోయే రాఘవ (లారెన్స్‌) పడిపోయిన తమ ఛానల్‌ టీఆర్పీ రేటింగ్స్‌ పెంచడానికి ప్లాన్‌ చేసిన ఫేక్‌ హారర్‌ షోకి కెమెరామెన్‌గా వెళతాడు. ఆ షోకి డైరెక్టర్‌ నందిని (తాప్సీ). ఒక బీచ్‌ హౌస్‌లో ఈ షోని ప్లాన్‌ చేస్తారు. అయితే వారు ఊహించని విధంగా నిజంగానే కొన్ని ఆత్మలు వారిని వెంటాడడం మొదలవుతుంది. నందినిని ఒక ఆత్మ ఆవహించడంతో రాఘవ, అతని తల్లి (కోవై సరళ) ఇబ్బందుల్లో పడతారు. నందినిని ఆవహించిన ఆత్మ ఎవరిది, దాని కథేంటి?

ముని, కాంచన చిత్రాలకి ఫార్ములా వర్కవుట్‌ అయింది కానీ కథాపరంగా చాలా లొసుగులున్నాయి. అయితే మాస్‌ ఆడియన్స్‌ ఆ బలహీనతల్ని పట్టించుకోకుండా ఆ చిత్రాల్ని విజయవంతం చేసారు. అందుకే లారెన్స్‌ ఈసారి కూడా వాళ్లనే టార్గెట్‌ చేసాడు కానీ ‘కాంచన’ చిత్రాన్ని విమర్శించిన వారిని సైతం మెప్పించే ప్రయత్నాలేవీ చేయలేదు. ‘కాంచన’ సీక్వెల్‌గా ‘గంగ’ నుంచి ఏమి ఆశిస్తామో అవన్నీ ఇందులో ఉన్నాయి. ఆ చిత్రంలోని బలహీనతలు, తప్పులతో సహా! అయితే దీనినుంచి ఏది ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చనే దానికి ముందుగా రెండు సినిమాలు ప్రిపేర్‌ చేసి ఉన్నాయి కనుక ఈసారి లారెన్స్‌ పని ఈజీ అయిపోయింది. లౌడ్‌ కామెడీ, క్రూడ్‌ కామెడీ, అతిగా అనిపించే ఎమోషన్స్‌, టీవీ సీరియల్స్‌ గర్వపడే గ్రాఫిక్స్‌.. వగైరా, వగైరా అవలక్షణాలెన్నో ఉన్నాయి. అయితే ఏంటి? తన టికెట్‌ డబ్బులకి సరిపడా వినోదం దక్కిందని సగటు మాస్‌ ప్రేక్షకుడు బలంగా ఆమోద ముద్ర గుద్దేస్తుంటే!

‘కాంచన’ చూసిన వారికి అది నచ్చకపోయినా కానీ ‘గంగ’ కొంతవరకు ఎంటర్‌టైన్‌ చేస్తుంది. బహుశా క్యారెక్టర్లతో ఇంతకుముందే ఉన్న పరిచయం వల్లో, దీనినుంచి ఎలాంటి వినోదాన్ని ఆశించాలనేది ముందే ఐడియా ఉండడం వలనో, లేక ఈ ఎక్సెంట్రిసిటీకి, స్టుపిడిటీకి కాస్త అలవాటు పడడం వలనో.. కారణం ఏదైనా కానీ ‘గంగ’లో కొన్ని ఎంజాయబుల్‌ మొమెంట్స్‌ అయితే ఉన్నాయి. ప్రధానంగా ప్రథమార్థం కామెడీ, హారర్‌ పర్‌ఫెక్ట్‌ మిక్స్‌తో బాగానే అలరిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు ముప్పయ్‌ నిముషాలు సినిమాకి హైలైట్‌గా చెప్పుకోవాలి. అయితే అదే టెంపోని ద్వితీయార్థంలో కొనసాగించలేకపోయాడు లారెన్స్‌. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు తేలిపోయాయి. 

ఏం జరిగిందనే సస్పెన్స్‌ని ఎక్కువ సేపు ఉంచడం కోసమని ఫ్లాష్‌బ్యాక్‌ని వెనక్కి నెడుతూ వెళ్లారు కానీ తీరా ఫ్లాష్‌బ్యాక్‌ చాలా రొటీన్‌గా ఉండి ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఆ వెంటనే వచ్చే క్లయిమాక్స్‌ కూడా వీక్‌గా ఉండడంతో చివరి గంటలో ‘గంగ’ బాగా విసిగిస్తుంది. కామెడీ, హారర్‌ రెండూ బ్యాక్‌సీట్‌ తీసుకుని రివెంజ్‌ డ్రామా హైలైట్‌ అయి, అది కూడా ఓవర్‌ బోర్డ్‌ వెళ్లి చాలా నస పెడుతుంది. అయితే ప్రథమార్థంతోనే ఈ చిత్రంతో ‘కాంచన’ అభిమానులకి పైసా వసూల్‌ అయిపోతుంది. ‘కాంచన’ ప్రభావం వల్ల ‘గంగ’లోని బలహీనతలు మరుగున పడి ఆర్థికంగా విజయం వరిస్తుంది కానీ నిజంగా లారెన్స్‌కి ‘ముని 4’ కూడా తీసే ఉద్దేశం ఉంటే మాత్రం ఈసారి జాగ్రత్త పడాలి. 

నటన పరంగా లారెన్స్‌ ముందు రెండు సినిమాల్లో ఏం చేసాడో అదే చేసాడు. తాప్సీ చాలా వరకు బాగానే చేసింది కానీ... తనని ఆత్మ ఆవహించినప్పుడు మాత్రం చిత్ర విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. వాటిని డీకోడ్‌ చేయడం అంత తేలిక కాదు. గ్రాఫిక్స్‌ జత కలిసినప్పుడు మినహా తనంతట తానుగా భయపెట్టాల్సిన ఏ సందర్భంలోను తాప్సీ రాణించలేకపోయింది. ఊహించని క్యారెక్టర్‌లో నిత్యామీనన్‌ మరోసారి తన టాలెంట్‌ చూపించింది. ఇంతకుముందు మనం చూసిన నిత్యామీనన్‌కి ఇందులోని ‘గంగ’కి చాలా తేడా కనిపిస్తుంది. వీక్‌ ఫ్లాష్‌బ్యాక్‌లో ఆకట్టుకునే పార్ట్‌ అంటూ ఏదైనా ఉంటే అది నిత్యామీనన్‌ పర్‌ఫార్మెన్స్‌ మాత్రమే. కోవై సరళ తన మార్కు కామెడీతో మాస్‌ని అలరించింది. ముని సిరీస్‌కి లారెన్స్‌తో పాటు కోవై సరళ కూడా మస్ట్‌ అయిపోయింది. ఆమె లేకుండా ఈ సిరీస్‌ని ముందుకి తీసుకెళ్లడం లారెన్స్‌ వల్ల కూడా కాకపోవచ్చు. దాదాపు నటీనటులందరూ ఓవరాక్షన్‌ చేసారు. బహుశా అది ‘ముని’ సిరీస్‌కి ట్రేడ్‌మార్క్‌ అనుకోవచ్చు. 

సక్సెస్‌ఫుల్‌ సినిమాకి రీమేక్‌ కదా అని దీని స్టాండర్డ్‌ పెంచడానికి ప్రయత్నమేం జరగలేదు. క్వాలిటీ పరంగా, టెక్నికల్‌ అవుట్‌పుట్‌ పరంగా ఇది టార్గెట్‌ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకునే రూపొందింది. లారెన్స్‌ తీసే ఇతర సినిమాలకీ, ముని సిరీస్‌కి టెక్నికల్‌గా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఎంత తక్కువ బడ్జెట్‌లో తీస్తే, క్వాలిటీ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత లాభమనేది లారెన్స్‌ ఆలోచన అయి ఉండొచ్చు. అందుకే ‘గంగ’ కూడా టెక్నికల్‌గా సబ్‌స్టాండర్డ్‌ ప్రోడక్ట్‌ అనిపిస్తుంది. అయితే ముందే చెప్పినట్టు ఈ చిత్రాన్ని మెచ్చే ప్రేక్షకులకి అలాంటి అంశాల గురించిన చింత ఉండదు. వారు ఎంటర్‌టైన్‌ అయినంత సేపు సినిమా క్వాలిటీ ఎంత, ఖర్చెంత, లొకేషన్స్‌ ఏంటి వగైరా వాటి గురించి అస్సలు ఆలోచించరు. 

కాంచన మాదిరిగానే ‘గంగ’ కూడా బాక్సాఫీస్‌ని ఒక ఊపు ఊపేసి పోతుందనిపిస్తుంది. సెకండాఫ్‌ని సరిగ్గా హ్యాండిల్‌ చేసినట్టయితే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌కి సంచనలాలకి తెర తీసి ఉండేది. మైనస్‌లు ఉన్నప్పటికీ కాంచనకి తగ్గ సీక్వెల్‌గా తెరకెక్కి టార్గెట్‌ ఆడియన్స్‌ని మెప్పించడంలో ఈ చిత్రం సక్సెస్‌ అయింది. ఈ సిరీస్‌ని ఇంకా వైడర్‌ ఆడియన్స్‌కి తీసుకెళ్లే స్కోప్‌ ఉన్నా కానీ లారెన్స్‌ దానిని మిస్‌ చేసుకున్నాడనిపించింది. 

బోటమ్‌ లైన్‌: మాస్‌ని అలరించే హారర్‌ కామెడీ

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?