పెద్దలు చెబుతుంటారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. చాలా సందర్భాల్లో ఇది నిజమని నిరూపితమయ్యింది.. అవుతూనే వుంది. తాజాగా నేపాల్‌లో సంభవించిన తీవ్ర భూకంపం నుంచి ఒక్కొక్కరుగా మృత్యుంజయులు బయటపడ్తున్నారు. మొన్నటికి మొన్న నాలుగు రోజులపాటు కేవలం మూత్రం తాగి ఓ వ్యక్తి తన ప్రాణాల్ని కాపాడుకుని, సహాయక సిబ్బంది పుణ్యమా అని బయటపడ్డ ఉదంతం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
తాజాగా ఈ రోజు ఓ మహిళ ఐదు రోజులపాటు భూకంప శిధిలాల కింద జీవచ్ఛంలా బతికి సహాయక సిబ్బంది అందించిన సహాయంతో బయటి ప్రపంచాన్ని చూసింది. నిన్న నెలల వయసున్న ఓ చిన్నారి కూడా ఇలానే భూకంప శిధిలాల నుంచి సజీవంగా బయటపడ్డాడు. ఆరు వేల మందికి పైగా భూకంపంలో మృత్యువాత పడగా, మృత్యుంజుయులుగా బయటపడ్తున్నవారు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు.
‘ఇది మాకు పునర్జన్మ..’ అని శిధిలాల నుంచి బయటపడ్తున్నవారు చెబుతోంటే, ఓ వ్యక్తికి జీవం పోసిన ఆనందాన్ని పొందుతున్నారు సహాయక సిబ్బంది. రోజుల తరబడి శిధిలాల కింద మృతదేహాలు కుళ్ళిపోవడంతో వస్తున్న దుర్గంధాన్ని లెక్క చేయకుండా, ఎవరైనా ప్రాణాలతో బతికి వున్నారేమోనని శ్రమిస్తున్న సహాయక సిబ్బందికి ఎవరైనా ఎలా కృతజ్ఞతలు తెలపగలరు. వారి తెగువకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం.