ఈవారం అంత కన్ ఫ్యూజ్డ్ వారం సినిమా రంగానికి మరోటి లేదేమో? శుక్రవారం ఉదయాన్నే..ఉత్తమవిలన్ వాయిదా అన్న వార్త. అంతలోనే గంగ కూడా అన్న మరోవార్త. ఇంతలో గంగ వస్తుంది. కేవలం డెభై ఎనబై లక్షల సమస్య, పేమెంట్ అయిపోయింది..క్లియరెన్స్ ఇచ్చేస్తారు అని మరో విషయం. ఇంతలో తమిళ సినిమాలు చూసి సమీక్షలు రాసేయడం..అంతలోనే విడుదల కాలేదని తెలిసినాలుక కరుచుకుని తీసేయడం.
సరే ఆఖరికి కథ సుఖాంతం అయింది థియేటర్లలోకి గంగ ప్రవేశించింది. జనం బారులు తీరారు. గంగకు సమస్యలు ఎన్ని వున్నా, ఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు రానంత ఆసక్తి ఆ సినిమాకు వచ్చింది. మొత్తానికి మరక మంచిదే అన్నట్లు, ఆలస్యం కావడం కూడా నిర్మాతకు మంచే చేసినట్లుంది.
సరే..మరి ఇంతకీ ఉత్తమ విలన్ సంగతే ఏమీ తెలియడం లేదు. పాపం..కమల్..ఆయన సినిమా థియేటర్లో షో పడే వరకు నమ్మకం వుండడం లేదు ఈ మధ్య. పైగా ఆ సినిమా అయిదారు నిమషాలు తక్కువగా మూడు గంటలు అంటున్నారు. మరి ఎలా వుంటుందో ఏమో?