Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కేరింత

సినిమా రివ్యూ: కేరింత

రివ్యూ: కేరింత
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, విశ్వనాధ్‌, పార్వతీశం, శ్రీదివ్య, తేజస్వి మదివాడ, సుకృతి, నిత్య నరేష్‌, పవిత్ర తదితరులు
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
కూర్పు: మధు
ఛాయాగ్రహణం: విజయ్‌ కె. చక్రవర్తి
నిర్మాత: రాజు
దర్శకత్వం: సాయికిరణ్‌ అడివి
విడుదల తేదీ: జూన్‌ 12, 2015

‘‘జ్ఞానం రావాలంటే బోధి చెట్టు కింద కూర్చోనక్కర్లేదు, మంచి ఫ్రెండుంటే చాలు!’’

ఫ్రెండ్స్‌, లవ్‌, ఆంబిషన్స్‌.. ఇవే లోకంగా బతికేసే కుర్రకారు ‘కేరింత’ ఇది. స్టూడెంట్‌ లైఫ్‌, ఆ జ్ఞాపకాలు, ఆ అనుభూతులు, ఆ అనుభవాల నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. ‘కేరింత’ కూడా ఆ బాపతు సినిమానే. మొదలైన కాసేపటికి ‘హ్యాపీడేస్‌’ క్యారెక్టర్లని ‘త్రీ ఇడియట్స్‌’ స్టయిల్లో ప్రెజెంట్‌ చేస్తున్న సగటు యూత్‌ సినిమా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ టైమ్‌కి యంగ్‌స్టర్స్‌ని టార్గెట్‌ చేసిన ఒక సాధారణ సినిమా అనిపించినదే... ఆ తర్వాత బలమైన ఎమోషన్స్‌తో తెలీకుండానే కట్టి పడేస్తుంది. 

ఒక స్క్రిప్ట్‌ పరిపూర్ణత సాధించడంలో క్యారెక్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎంతటి రోల్‌ ప్లే చేస్తుందనేదానికి ‘కేరింత’ పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌. లీడ్‌ క్యారెక్టర్స్‌ అన్నిటిపై బాగా వర్క్‌ చేయడం వల్ల, వాటిని సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చేయడం వల్ల కథ ముందుకి వెళ్లే కొద్దీ ఆ క్యారెక్టర్లతో లవ్‌లో పడిపోతాం. వారి ఆనందాన్ని ఆస్వాదిస్తూ, వారి బాధల్ని అనుభవిస్తూ, వారి విజయాల్ని హర్షిస్తూ మనసులోనే కేరింతలు కొడతాం. ఒక సగటు యూత్‌ఫుల్‌ సినిమా అనిపించినదే అయినా క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ కనెక్ట్‌ అయి ట్రావెల్‌ చేసేలా చేయడంలోనే ‘కేరింత’ స్పెషల్‌గా నిలిచింది. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయినపుడు ఎక్కడో చూసినట్టు అనిపించిన సన్నివేశం ఇబ్బంది పెట్టదు. ఎప్పుడూ ఇవేనా అనిపించే ఫార్ములా తాలూకు క్లీషేస్‌ ఇంప్రెషన్‌ పోగొట్టవు. చివరి మజిలీ ఏంటనేది ముందే తెలుస్తున్నా ఆ ప్రయాణం బోర్‌ కొట్టదు. 

యూత్‌ఫుల్‌ ఫీలింగ్స్‌కి ఎమోషనల్‌ డెప్త్‌ ఇచ్చి అన్ని వయసుల వారిని ఆకట్టుకోవడంలో దిల్‌ రాజు గత సినిమాలైన బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం సక్సెస్‌ అయ్యాయి. ‘కేరింత’ ఎమోషనల్‌ హై ఇవ్వడంలో సక్సెస్‌ అవడమే కాదు... ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవకుండా టార్గెట్‌ ఆడియన్స్‌నీ అలరిస్తుంది. ఈ చిత్రంలో కొన్ని పాత్రల తీరుతెన్నులు చూస్తే శేఖర్‌ కమ్ముల తీసిన హ్యాపీడేస్‌ సినిమా పదే పదే గుర్తుకొస్తుంటుంది. పాత్రల స్వభావాలు, వాటిలో వచ్చే పరివర్తన, చేరుకునే గమ్యం చూస్తే ‘త్రీ ఇడియట్స్‌’ స్ఫూర్తి తీసుకున్నట్టు అనిపిస్తుంది. లవబుల్‌ క్యారెక్టర్స్‌ తీర్చి దిద్దడంలో, ఆ పాత్రల నడుమ అందమైన అలరించే మధుర క్షణాలు సృష్టించడంలో, ఆ పాత్రలు సజీవంగా అనిపించేట్టు చేయడంలో ‘కేరింత’ సోల్‌ దాగుంది. అదే ఈ చిత్రానికి ప్లస్‌ అయింది. 

ఫ్రెండ్సే ప్రపంచం అనుకునే వాళ్లు, స్వఛ్ఛమైన ప్రేమ అనుభూతుల్ని ఆస్వాదించేవాళ్లు ఇన్‌స్టంట్‌గా కేరింతతో రిలేట్‌ చేసుకుంటారు. సో.. టార్గెట్‌ ఆడియన్స్‌ నుంచి యాక్సెప్టెన్స్‌ పరంగా ఢోకా లేదు. అయితే కేవలం ఆ ఒక్క యాంగిల్‌ని మాత్రమే కన్సిడర్‌ చేసి, దానిమీదే ఫోకస్‌ పెట్టి ఉంటే ‘కేరింత’ గురించి ప్రత్యేకించి చెప్పుకోడానికంటూ ఏమీ ఉండేది కాదు. హ్యాపీడేస్‌తో పాటు ‘క్యాంపస్‌ లైఫ్‌’ బేస్‌ చేసుకున్న చాలా చిత్రాల్లో కనిపించని కోణాన్ని ‘కేరింత’ హైలైట్‌ చేస్తుంది. ప్రతి క్యారెక్టర్‌ తాలూకు విజయం మనసుని తట్టేలా, ప్రతి ఎమోషన్‌ తాలూకు భారం మనకి తెలిసేలా చేయడంలో ఈ చిత్ర దర్శకుడు సాయికిరణ్‌ అడివి చాలా సక్సెస్‌ అయ్యాడు. సరదాగా సాగిపోయే ప్రథమార్థం కంటే.. ఎమోషనల్‌గా ఉన్న ద్వితీయార్థం ఈ చిత్రానికి పాజిటివ్‌ పాయింట్‌ అయింది. మిక్కీ జె. మేయర్‌ అందించిన ఆల్బమ్‌ ‘హ్యాపీడేస్‌’ స్థాయిలో చార్ట్‌బస్టర్‌ కాకపోయినా కానీ ‘మిల మిల మిలా మిలా, సుమగంధాల, స్వరంలో ఆగిందే కేరింత..’ పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పరంగా మిక్కీ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఈ చిత్రం మరో లెవల్‌కి చేరుకోవడంలో అతనే హీరో పాత్ర పోషించాడు.

సుమంత్‌ అశ్విన్‌ పరిణితి చూపించాడు. శ్రీదివ్య సహజంగా నటించింది. విశ్వనాధ్‌ నటన అంతగా ఆకట్టుకోదు. చాలా కీలకమైన ఈ పాత్రకి నటన తెలిసిన నటుడ్ని తీసుకుని ఉండాల్సింది. తేజస్వి ఫర్వాలేదు. మూడు జంటల్లో మోస్ట్‌ లైకబుల్‌ పెయిర్‌ మాత్రం పార్వతీశం, సుకృతిదే. శ్రీకాకుళం యాసతో పార్వతీశం అక్కడక్కడా హద్దులు దాటినా కానీ ఈ చిత్రంలో బెస్ట్‌ మూమెంట్స్‌ అన్నీ తన క్యారెక్టర్‌కే దక్కాయి. ఈ క్యారెక్టరే ఈ కథకి నెరేటర్‌ కూడా. సుకృతి పాత్ర పరిచయం అయినప్పుడు ఎలాంటి ఇంప్రెషన్‌ వేయకపోయినా, నెమ్మదిగా మనపై గ్రో అవుతూ చివరికి వచ్చే సరికి అందరికంటే ఎక్కువ ఆకట్టుకుంటుంది. కొత్తమ్మాయి అయినా ఇంత మెచ్యూర్డ్‌ క్యారెక్టర్‌ని అంత ఇంప్రెసివ్‌గా పర్‌ఫార్మ్‌ చేసినందుకు సుకృతిని మెచ్చుకోవాలి. సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ చేసిన వాళ్లంతా తమకున్న పరిమితుల్లో తమ వంతు చేయగలిగింది చేసారు. అబ్బూరి రవి రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఇలాంటి సినిమాకి అవసరమైన మూడ్‌ని సెట్‌ చేసింది. దిల్‌ రాజు మరొక్కసారి తన అభిరుచిని చాటుకున్నాడు. 

సరదాగా సాగిపోయే కుర్రకారు సంగతులు, అనుభూతులతో ‘కేరింత’ యువ హృదయాలని కొల్లగొట్టేలా తెరకెక్కింది. మరి ఆ బలంతో బాక్సాఫీస్‌నీ కొల్లగొడుతుందో లేదో చూడాలి. 

బోటమ్‌ లైన్‌: కుర్రకారు కేరింతల హోరు!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?