Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: నిర్మలా కాన్వెంట్‌

సినిమా రివ్యూ: నిర్మలా కాన్వెంట్‌

రివ్యూ: నిర్మలా కాన్వెంట్‌
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌
తారాగణం: నాగార్జున, రోషన్‌, శ్రేయ శర్మ, ఆదిత్య మీనన్‌, రవి ప్రకాష్‌, సూర్య, అనిత చౌదరి, తాగుబోతు రమేష్‌, ఎల్బీ శ్రీరామ్‌ తదితరులు
సంగీతం: రోషన్‌ సాలూరి
ఛాయాగ్రహణం: ఎస్వీ విశ్వేశ్వర్‌
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, నిమ్మగడ్డ ప్రసాద్‌
రచన, దర్శకత్వం: నాగ కోటేశ్వరరావు
విడుదల తేదీ: సెప్టెంబరు 16, 2016

నిర్మాతల్లో నాగార్జున ఒకరు, శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడు, అంతే కాక ప్రత్యేక పాత్రలో నాగార్జున ఉండనే ఉన్నారు... ఇలా 'నిర్మలా కాన్వెంట్‌'కి ఆకర్షణలు చాలానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో నాగార్జున ఉన్న ఫామ్‌కి, ఆయన జడ్జిమెంట్‌కి 'నిర్మలా కాన్వెంట్‌' ఫెయిలవుతుందని ఎవరూ అనుమానించరు. ఆయన నిర్మాణంలో మరో 'ఉయ్యాల జంపాల' అవుతుందని ఆశిస్తే 'నిర్మలా కాన్వెంట్‌' మాత్రం నిరాశనే మిగిల్చింది. రోషన్‌ మొదటి సినిమాతో మెప్పించగలిగాడు, తను చేసిన సపోర్టింగ్‌ రోల్‌లో నాగార్జున మెరిసారు కానీ 'నిర్మలా కాన్వెంట్‌' కథాబలం లేక, కొత్తదనం అస్సల్లేక నిరుత్సాహపరిచింది.

'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' కాన్సెప్ట్‌కి నేటివిటీని జోడించి ఒక 'ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ లవ్‌స్టోరీ' అందించాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. పేదింటి అబ్బాయి, పెద్దింటి అమ్మాయి ప్రేమలో పడడం, అమ్మాయి తరఫు వారు ఆ ప్రేమకు అడ్డుపడడం అనాదిగా చూస్తోన్న ప్రేమకథే. ఈ కథకి 'ఛాంపియన్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌' (మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో) గేమ్‌ షోని జత చేయడమనేది ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ అని పేపర్‌పై అనిపించి ఉండొచ్చు. ఈ కథకి నిమ్మగడ్డ ప్రసాద్‌, నాగార్జున కనక్ట్‌ కావడానికి కారణం కూడా ఇదే అయి ఉండొచ్చు. నాగార్జున తెర మీదకి వచ్చిన తర్వాత కథలో కాస్త చలనం వచ్చిన మాట వాస్తవమే కానీ ఆయన చేసిన సపోర్టింగ్‌ రోల్‌ని క్యాష్‌ చేసుకునే స్టఫ్‌ స్క్రీన్‌ప్లేలో లేకపోవడంతో ఆయన సైతం ఏమీ చేయలేకపోయారు.

టీనేజ్‌ రొమాన్స్‌ని సరిగ్గా ప్రెజెంట్‌ చేస్తే ఆ ఏజ్‌ వాళ్లు ఇన్‌స్టంట్‌గా కనక్ట్‌ అవడానికి, మిడిల్‌ ఏజ్‌ వాళ్లు నోస్టాలిజిక్‌గా ఫీల్‌ అవడానికి ఆస్కారముంటుంది. అయితే ప్రేమకథపై ఎక్కువ ఫోకస్‌ పెట్టకుండా, వాళ్లిద్దరూ ప్రేమించుకోవడానికి బలమైన కారణాలేమీ లేకుండా స్టోరీని నెక్స్‌ట్‌ ఫేజ్‌కి తీసుకుపోవడం వల్ల లవ్‌స్టోరీ వల్ల ఉపయోగం లేకుండా పోయింది. గేమ్‌ షోలో ఆడే అవకాశం ఇప్పించమని నాగార్జున దగ్గరకి రోషన్‌ వెళ్లే సన్నివేశాల్లో కానీ, తర్వాత ఆ గేమ్‌ ఆడే విషయంలో కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవడంతో ఉత్కంఠకి తావు లేకుండా పోయింది. ఇక ఆ గేమ్‌లో అడిగే ప్రశ్నలు కూడా పేలవంగానే అనిపించడంతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో ఉండే మ్యాజిక్‌ కూడా ఇది రిఫ్లెక్ట్‌ చేయలేకపోయింది. 

గేమ్‌ ఆసక్తికరంగా మార్చడానికా అన్నట్టు ఆప్షన్స్‌ ఉండవు, లైఫ్‌ లైన్స్‌ ఉండవు అని పెట్టారు కానీ నిజానికి నాలుగు ఆప్షన్లు ఉన్నప్పుడే ఈ గేమ్‌ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. లైఫ్‌ లైన్స్‌ ఉండడం వల్ల ఉత్కంఠ రేకెత్తించే వీలు చిక్కుతుంది. ఇదే కథకి బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ టెక్నిక్‌తో స్క్రీన్‌ప్లే రాసినట్టయితే కాస్తయినా ఎఫెక్టివ్‌గా ఉండేదేమో. స్ట్రెయిట్‌ నెరేషన్‌ కారణంగా ఆసక్తిగా కూర్చోబెట్టే పాయింట్‌ అంటూ లేకుండా పోయింది. 

10/10 ఐక్యూ ఉన్న కుర్రాడు క్విజ్‌ ప్రోగ్రామ్‌లో కూర్చుంటే ఇక అతను ఓడిపోవడానికి అవకాశమెలా ఉంటుంది? లైవ్‌ గేమ్‌ షో ఆడుతున్న కుర్రాడిని ఏదైనా చేయడానికి విలన్లకి ఛాన్సెలా వస్తుంది? దీంతో ఆ వ్యవహారమంతా చప్పగా సాగిపోతుంది. రచన, దర్శకత్వ పరంగా చాలా లోపాలున్న ఈ నిర్మలా కాన్వెంట్‌కి రోషన్‌, శ్రేయ ప్రధానాకర్షణగా నిలిచారు. రోషన్‌ చూడ్డానికి బాగున్నాడు, తన ఏజ్‌కి బాగానే నటించాడు కూడా. శ్రేయ కూడా అందంగా ఉంది, చక్కగా హావభావాలు పలికించింది. నాగార్జున తన రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ చేసి, మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్‌గా ఏం చేస్తున్నారో అదే ఈసారి వెండితెరపై చేసారు. ఆయన హాండ్‌సమ్‌ లుక్స్‌, గ్రేస్‌ఫుల్‌ ప్రెజెన్స్‌ అభిమానులని అలరిస్తాయి. సపోర్టింగ్‌ కాస్ట్‌లో కనిపించింది కాసేపే అయినా ఎల్బీ శ్రీరాం మెప్పించారు. జోగి బ్రదర్స్‌, తాగుబోతు రమేష్‌ల కామెడీ నవ్వించలేదు. 

రోషన్‌ సాలూరి కంపోజ్‌ చేసిన పాటల్లో 'కొత్త కొత్త భాష', 'ఒక్కోసారి ఓ ముద్దు' బాగున్నాయి. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్‌ విశ్వేశ్వర్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. చక్కని విజువల్స్‌తో ఈ ప్రేమకథని కలర్‌ఫుల్‌గా ప్రెజెంట్‌ చేసాడు. నిర్మాణ పరంగా రాజీ పడలేదు. దర్శకుడు నాగ కోటేశ్వరరావు కాంటెంపరరీ ప్లాట్‌ ఎంచుకున్నా కానీ దానిని పాత పద్ధతుల్లో తెరకెక్కించడం వల్ల నిర్మలా కాన్వెంట్‌ మెప్పించలేదు. కాన్సెప్ట్‌గా విన్నప్పుడు, పేపర్‌పై ఉన్నప్పుడు వర్కవుట్‌ అయ్యేదే అనిపించిన దానికి సినిమాటిక్‌ ట్రీట్‌మెంట్‌ కుదరక, కట్టిపడేసే స్క్రీన్‌ప్లే లేక అంతిమంగా ఒక అవుట్‌డేటెడ్‌ ప్రోడక్ట్‌గా షేప్‌ తీసుకుంది.

బోటమ్‌ లైన్‌: ఓల్డ్‌ స్కూల్‌!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?