ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నినదిస్తున్న మాట వాస్తవం. కానీ, ఆ నినాదంలో చిత్తశుద్ధి ఎంత.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. కేంద్రం, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసి, 'ప్రత్యేక సాయం' పేరుతో ప్యాకేజీ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాకా ఊదుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా ప్రత్యేక హోదా పేరుతో వైఎస్ జగన్ ఏం చేసినా, దానివల్ల ఉపయోగం వుంటుందా.? ఛాన్సే లేదు.
తెలంగాణ ఉద్యమంలో, కేంద్ర మంత్రుల మీదా, ఎంపీల మీదా మొదట విపరీతమైన ఒత్తిడి ఏర్పడింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్ళల్లోంచి బయటకు రాలేని పరిస్థితుల్ని తెలంగాణ రాష్ట్ర సమితి సృష్టించింది. ఇక, తెలంగాణ ఇవ్వక తప్పదు.. అనే పరిస్థితిని తీసుకొచ్చాకగానీ, అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై ముందడుగు వేయలేదు.
ఆ సమయంలో టీఆర్‌ఎస్‌కి వున్న బలం చాలా చాలా తక్కువ. ఆ మాటకొస్తే, రాజకీయ పోరాటం విషయంలో కేసీఆర్ ఒక్కరే ముందున్నారు. కేసీఆర్ వెంట తిరిగిన చాలామంది నేతలు, ఉద్యమాన్ని తాకట్టు పెట్టి మరీ, ఇతర పార్టీల్లోకి జంప్ చేసిన సందర్భాలున్నాయి. అప్పటి కేసీఆర్ బలంతో పోల్చితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కి వున్న రాజకీయ బలం చాలా చాలా ఎక్కువే. పైగా, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రధాన ప్రతిపక్షం.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావడం, కేంద్రంపై ఒత్తిడి పెంచడం.. ఇవన్నీ పెద్ద విషయాలే కావు. కానీ, ప్రతిసారీ వైఎస్ జగన్ వ్యూహాత్మక తప్పిదాలకే పాల్పడుతున్నారు. తీరిగ్గా యువభేరి కార్యక్రమాలంటున్నారు.. సమయం సందర్భం లేకుండా దీక్షలంటున్నారు.. ఏవేవో చేస్తున్నారు. 'చేస్తున్నాం.. అంటే చేస్తున్నాం..' అన్నట్లు తప్ప, జగన్‌కి ప్రత్యేక హోదా విషయంలో చిత్తశుద్ధి వున్నట్లు మాత్రం కన్పించడంలేదు.
'నేనేం మాట్లాడినా అభివృద్ధికి వ్యతిరేకం అంటున్నారు..' అంటూ తన గురించి తాను వివరణ ఇచ్చుకోవడానికే వైఎస్ జగన్‌కి సమయం సరిపోవడంలేదు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల వేళ, ప్రభుత్వం నుంచి ప్రకటన రాబట్టి, ఆ తర్వాత సభలో ప్రత్యేక హోదాపై ప్రతిపక్షం గళం విప్పి వుంటే బాగుండేది. కానీ, ప్రకటన చేశాక మాట్లాడటానికేమీ వుండదు.. అనే సాకుతో సభలో గందరగోళం సృష్టించారు. చివరికి జరిగిందేంటి.? అసెంబ్లీలో ప్రతిపక్షం హద్దులు దాటింది.. చర్యల కోసం ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు.. ఇదీ పరిస్థితి.
సరైన రాజకీయ వ్యూహాలతో ముందడుగు వేస్తే, ప్రతి విషయంలోనూ అధికార పార్టీకి ప్రతిపక్షం షాక్ ఇవ్వొచ్చు. పోలవరం ప్రాజెక్టు అయినా, పట్టిసీమ అయినా, రాజధాని అయినా, రైల్వే జోన్ అయినా, ప్రత్యేక హోదా అయినా, ప్యాకేజీ అయినా.. సవాలక్ష అంశాలున్నాయి. దేంట్లోనూ ప్రతిపక్షం సరైన పాత్ర పోషించకపోవడం అధికార పార్టీకి కలిసొస్తోంది. నిర్భయంగా చంద్రబాబు కేంద్రం అందించే ప్రత్యేక సాయానికి జై కొడ్తున్నారంటే, అసలు ప్యాకేజీ అన్న పదాన్నే కేంద్రం వాడకపోయినా చంద్రబాబు థ్యాంక్స్ చెప్పారంటే.. ప్రతిపక్షం అసమర్థతను చూసుకునే.
ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా పేరుతో జగన్ యువభేరి కావొచ్చు, ఇంకొకటి కావొచ్చు.. ఏ కార్యక్రమాలు చేసినా, అవి కూడా ఈవెంట్ల తరహాలోనే వుంటాయి. కేంద్ర మంత్రుల్ని నిలదీశాయా.? ఎంపీల్ని ప్రశ్నించారా.? ప్రతిపక్షంగా, వైఎస్సార్సీపీ బీజేపీ – టీడీపీ కూటమిపై ఏ విషయంలో, ఏ పద్ధతుల్లో ఒత్తిడి తెచ్చింది.? ప్చ్.. ప్రతిపక్షం వైఫల్యం, అధికారంలో వున్న పార్టీలకు వరంగా మారిపోయింది.. తద్వారా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది.