Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: సూర్య వర్సెస్‌ సూర్య

సినిమా రివ్యూ: సూర్య వర్సెస్‌ సూర్య

రివ్యూ: సూర్య వర్సెస్‌ సూర్య
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.
తారాగణం: నిఖిల్‌, త్రిధ చౌదరి, మధుబాల, తనికెళ్ల భరణి, సత్య, వైవా హర్ష, తాగుబోతు రమేష్‌ తదితరులు
మాటలు: చందు మొండేటి
సంగీతం: సత్య మహవీర్‌
కూర్పు: గౌతమ్‌ నెరుసు
నిర్మాత: మల్కాపురం శివకుమార్‌
రచన, ఛాయాగ్రహణం, దర్శకత్వం: కార్తీక్‌ ఘట్టమనేని
విడుదల తేదీ: మార్చి 5, 2015

ఎండ తగిలితే చనిపోయే చిత్రమైన వ్యాధి ఉన్న కథానాయకుడు ఒకమ్మాయి ప్రేమలో పడితే ఏమవుతుంది? ఐడియాలోనే బోలెడంత కొత్తదనం ఉంది కదూ. ఐడియా కొత్తగా ఉన్నప్పటికీ ఈ కథని సినిమాగా తెరకెక్కించడానికి చాలా పరిమితులు కూడా ఉన్నాయి. రాత్రిపూట తప్ప బయటకి వెళ్లలేని వ్యక్తి గురించిన కథ అయినపుడు అతను ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఎలాంటి వ్యక్తుల్ని కలుస్తాడు... ఇలా అన్నిట్లోను లిమిటేషన్స్‌ ఉంటాయి. వాటికి లోబడి కథని ఆసక్తికరంగా నడిపించడంతో పాటు, అందులోనే వినోదాన్ని పండించాలి. కార్తీక్‌ ఘట్టమనేని చేసిన ప్రయత్నానికి పరిమితులు ఉన్నాయనేది అంగీకరించాల్సిన విషయమే అయినప్పటికీ దాని వల్ల అతను తీర్చిదిద్దిన చిత్రానికి ఇంతకంటే బాగా అనిపించే అవకాశం లేదని మాత్రం అనలేం.

వినోదం పండించడానికి ఆ పరిధుల్లోనే ఎంత అవకాశం ఉందనే దాని కోసం అన్వేషించాలి. రాత్రి పూట సంచరించే కథానాయకుడి పాత్రతో ఎలాంటివి చేయించి ఆకట్టుకోవాలో శోధించాలి. తను ఎంచుకున్న అంశానికి పరిమితులు ఉండి ఉండొచ్చు కానీ ఆలోచనలకి కూడా వాటిని అప్లయ్‌ చేయాల్సిన అవసరం లేదు కదా. దర్శకుడు కొత్తగా అనిపించే ఒక ఐడియాని పుట్టించగలిగాడు కానీ దానిని వెండితెరపైకి మలిచే యత్నంలో ఇమాజినేషన్‌ పరంగా విఫలమయ్యాడు. నిఖిల్‌ని కిడ్నాప్‌ చేసి ఐలండ్‌కి తీసుకెళ్లడం... అతడికి అక్కడ్నుంచి బయట పడే దారి లేకపోవడం, తనని కిడ్నాప్‌ చేయించిన వాడికే తన కథ చెప్పడం... ఏదీ ఆసక్తికరంగా అనిపించలేదు. ఏదో వెలితి ఈ చిత్రంలో అడుగడుగునా కనిపిస్తుంది. ఫ్రెష్‌నెస్‌కి లోటు లేకపోయినా కానీ కథ పక్కదారి పడుతుందేమో, ఇంతకంటే బాగా నడిపించి ఉండొచ్చునేమో అనే భావన అనుక్షణం మదిలో మెదులుతుంటుంది. 

కథలోకి నాయిక ప్రవేశించిన తర్వాత అయినా పరిస్థితిలో మార్పు వస్తుందనుకుంటే ఆ ప్రేమకథా వ్యవహారాన్ని కూడా చాలా సాదాసీదాగా నడిపించేసారే తప్ప ఎక్కడా ఆ ప్రేమ గాఢతని చూపించలేకపోయారు. ఇంటర్వెల్‌కి ముందు హీరోయిన్‌ కోసం తన పరిస్థితిని లెక్క చేయకుండా బయటకి వచ్చేసే హీరో.. కార్లో వినాయకుడి బొమ్మ, వర్షం, ఫైట్‌... ఈ సీన్‌ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఫైనల్‌గా ఈ సినిమా ఆకట్టుకోవడానికి ఏముండాలనేది దర్శకుడు గ్రహించాడనిపిస్తుంది. కానీ ఆ తర్వాత మళ్లీ అలాంటి స్ట్రయికింగ్‌ సిట్యువేషన్‌ ఒక్కటైనా క్రియేట్‌ చేయడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. హీరోయిన్‌కి సర్‌ప్రైజ్‌లు ఇవ్వడానికి హీరో వేసే ట్రిప్‌, అక్కడ జరిగే తంతు, ఆ తర్వాత కారులో పోలీస్‌తో ప్రహసనం ఏవీ కూడా ఎఫెక్టివ్‌గా లేవు. ఈ ప్రేమ సక్సెస్‌ అవ్వాలనే బలమైన ఫీలింగ్‌ ప్రేక్షకులకి కలిగించడంలో, పాపం ఇతని పరిస్థితి ఎవరికీ రాకూడదు అనే సానుభూతి కథానాయకుడి పాత్రపై తెప్పించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. 

ఈ కథలో అలాంటి సన్నివేశాలకి, అనుభూతులకి చోటు ఇవ్వనప్పుడు ‘సూర్యుడు’ మబ్బుల మాటు నుంచి వచ్చి ప్రకాశించే అవకాశాన్ని కల్పించనట్టే. కనీసం పతాక సన్నివేశాల్లో అయినా ఫీల్‌ వర్కవుట్‌ చేస్తాడని చూస్తే అక్కడా ఫ్లాట్‌ నెరేషన్‌ డామినేట్‌ చేస్తుంది. ఐలండ్‌ నుంచి బయటపడ్డానికి పడే పాట్లు కానీ, తన ప్రేమని హీరోయిన్‌కి అర్థమయ్యేలా చెప్పడానికి టీవీ స్టూడియోలో చేసే విన్యాసాలు కానీ అటు వినోదాన్ని అందించలేక, ఇటు ఆసక్తి రేకెత్తించలేక, కనీసం ప్రేమ తాలూకు అనుభూతిని కలిగించలేక, ‘సూర్య’ కథలో ఉన్న బలానికి సరిపడా దన్నుని ఇవ్వలేక అంతిమంగా నిరాశపరిచాయి. 

నిఖిల్‌ నటుడిగా చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. ఈ చిత్రంలోని తన పర్‌ఫార్మెన్స్‌ నిస్సందేహంగా అతని కెరీర్‌ బెస్ట్‌ అని చెప్పాలి. కొత్త కథల కోసం అతను పడుతోన్న తపనని, పాత్రకి తగ్గట్టుగా కనిపించడానికి పడుతోన్న తాపత్రయాన్ని మెచ్చుకోవాలి. ఈ క్యారెక్టర్‌ కోసం చాలా బరువు తగ్గడమే కాకుండా దీనిని రక్తి కట్టించడానికి శాయశక్తులా కృషి చేసాడు. తన పరిస్థితికీ, ప్రేమకీ మధ్య నలిగిపోయే పాత్రలో లోపం లేకుండా నటించి ఆకట్టుకున్నాడు. అతనికి త్రిధ ఇచ్చిన సపోర్ట్‌ కూడా కమెండబుల్‌. కొత్త నటి అయినా కానీ ఎక్కడా తడబడకుండా నటించింది. మధుబాల నటన కాస్త అతిగా అనిపించింది. తనికెళ్ల భరణి అక్కడక్కడా మెరిపించినా చాలా సందర్భాల్లో ఆయనా శృతి మించినట్టు అనిపిస్తుంది. సన్నివేశాలు, సంభాషణలు సహకరించకపోవడంతో కమెడియన్స్‌ అందరూ సో సో అనిపించారు. 

కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడిగా కంటే ఛాయాగ్రాహకుడిగా రాణించాడు. ఈ కథకి అవసరమైన ఫీల్‌ని పుట్టించడంలో దర్శకుడిగా కార్తీక్‌ సక్సెస్‌ కాలేదు. అయితే కొత్త రకం ప్రయత్నం చేయాలనే తపనని మాత్రం అభినందించాలి. నేపథ్య సంగీతం బాగుంది. సంభాషణల్లో కొన్ని ఆకట్టుకునేవి ఉన్నప్పటికీ క్యాజువల్‌ కాన్వర్‌జేషన్స్‌ మాత్రం విసిగించాయి. ‘సూర్య వర్సెస్‌ సూర్య’ విడుదలకి ముందు కలిగించిన ఆసక్తి కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమైంది. ఇలాంటి కాన్సెప్ట్స్‌ని ఇంట్రెస్టింగ్‌ మూవీగా మలచడం అంత ఈజీ కాదనేది అంగీకరించాల్సిన విషయమే అయినప్పటికీ ఎటెంప్ట్‌ చేసినపుడు ఎఫర్ట్స్‌ కూడా హండ్రెడ్‌ పర్సెంట్‌ పెట్టి తీరాలి. అప్పుడే రిజల్ట్‌ కూడా కోరుకున్నట్టు వస్తుంది. కథ చాలా డిఫరెంట్‌గా ఉంది కదా ఇక దానిని ఎలా తీసినా కానీ బాగుందనేస్తారు అన్న క్యాజువల్‌నెస్‌ చిత్రీకరణలో కనిపించింది. లీడ్‌ క్యారెక్టర్‌కి ఉన్న ఎమోషనల్‌ స్ట్రగుల్‌ని ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్‌ చేయడంలోనే పొరపాటు జరిగింది. రాసుకున్న సన్నివేశాలన్నీ చాలా మామూలుగా ఉండడంతో, వినోదం పండుతుందని ఆశించిన అంశాలు మిస్‌ఫైర్‌ అవడంతో, అతి కీలకమైన ప్రేమకథలో సంఘర్షణని సరిగ్గా తెర మీదకి తీసుకు రాలేకపోవడంతో ‘తప్పక చూడాలి’ అనిపించాల్సిన సినిమా కాస్తా... ‘చూస్తే చూడండి’ అనే లెవల్లోనే ఆగిపోయింది. 

కొత్త ప్రయత్నం, సరికొత్త ఆలోచన, నిఖిల్‌ హార్డ్‌వర్క్‌, కలర్‌ఫుల్‌ సినిమాటోగ్రఫీ... లాంటి పాజిటివ్స్‌ తప్ప ఈ చిత్రానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు మిస్‌ అయ్యాయి. ఎమోషనల్‌గా కనెక్ట్‌ చేయలేకపోవడం, ఎంగేజింగ్‌గా ప్రెజెంట్‌ చేయలేకపోవడంతో ఈ చిత్రం ఒక ప్రయత్నంగా మిగిలిపోయిందే తప్ప చూసి తీరాల్సిన అద్భుతం అనిపించుకోలేకపోయింది. 

 బోటమ్‌ లైన్‌: మబ్బు చాటు సూరీడు!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?