కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యే. పైగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. ఆయన దూకుడుతో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాల్లో పార్టీని ఒడ్డున పడేస్తారు అని చంద్రబాబు తలచి కిరీటం పెట్టారు. అయితే అచ్చెన్నకు ధీటుగా అదే టెక్కలి నుంచి వైసీపీ ఇంచార్జి దువ్వాడ శ్రీనివాస్ ని పెద్దల సభలో ఎమ్మెల్సీని చేయడం ద్వారా జగన్ కూడా అంతే దూకుడుగానే పావులు కదిపారు.
ఈ మధ్యన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అచ్చెన్న సొంత గ్రామం నిమ్మాడలో నాలుగు దశాబ్దాల తరువాత సర్పంచ్ పదవికి ఎన్నికలు పెట్టించి ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేసిన ఘనతను దువ్వాడ శ్రీను సొంతం చేసుకున్నాడు. అంతే కాదు, ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిని ఆకట్టుకున్నాడు.
టెక్కలిలో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని అచ్చెన్నను ఓడించాలన్న కసితో పనిచేస్తున్న దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి ఒక విధంగా వైసీపీ అధినాయకత్వం ఇచ్చిన బహుమానం, అదే సమయంలో ఆయనకు ఇచ్చిన బిగ్ టాస్క్ గా కూడా చెప్పుకోవాలి.
ఇప్పటిదాకా పోటీ చేయడమే కానీ చట్ట సభల్లో ప్రవేశించని దువ్వాడ తనకు దక్కిన ఎమ్మెల్సీ పదవితో పూర్తిగా ఆనందభరితుడు అవుతున్నాడు. నా దేవుడు జగన్ నాకు ఇచ్చిన దీవెన ఇది అంటున్నాడు.
ఇప్పటిదాకా తన రాజకీయం ఒక లెక్క. ఇకపైన మరో లెక్కగా సాగుతుంది అంటూ దువ్వాడ గట్టిగానే సౌండ్ చేస్తున్నాడు. మరి దువ్వాడ దూకుడు చూస్తూంటే సిక్కోలులో భీకరమైన రాజకీయ పోరుకి నిమ్మాడ ఒక చిన్న ట్రైలర్ అనే అనుకోవాలేమో. ఇక ముందుంది అసలైన సినిమా అన్న మాట.