Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: చెక్

సినిమా రివ్యూ: చెక్

చిత్రం: చెక్
రేటింగ్‍: 2.25/5
తారాగణం: 
నితిన్, రకుల్ ప్రీత్, ప్రియ ప్రకాష్ వారియర్, సంపత్ రాజ్, సాయి చంద్, పోసాని, మురళి శర్మ, హర్ష వర్ధన్, చైతన్య కృష్ణ తదితరులు
ఎడిటింగ్: సనాల్ అనిరుద్ధన్
కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్
సంగీతం: కళ్యాణి మాలిక్
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి
విడుదల తేదీ: 26 ఫిబ్రవరి 2021

ఐదేళ్ల తర్వాత చంద్రశేఖర్ ఏలేటి సినిమా వస్తుండడం, కరోన లాక్డౌన్ కి కాస్త ముందుగా "భీష్మ" తో సూపర్ హిట్ కొట్టిన నితిన్ లాక్డౌన్ తర్వాత వెండితెర మీద తొలిసారి దర్శనమివ్వడం, ఒక ఔటాఫ్ ద బాక్స్ కథని ఎంచుకుని దానికి "చెక్" అని టైటిల్ పెట్టడం, కంటికింపైన తారాగణం..అన్నీ కలిసి ఈ చిత్రం కొంత ఆసక్తిని పెంచుతూ వచ్చింది.

కథలోకి పెద్దగా వెళ్లకుండా విషయం చెప్పుకోవాలంటే...

హాలీవుడ్లో చాలా ప్రిజన్ సినిమాలు వచ్చాయి. ఆద్యంతం కట్టిపారేసే షషాంక్ రిడెంప్షన్, ఎస్కేప్ ఫ్రం అల్కట్రాజ్ లాంటివి ఎన్నో ఉన్నాయి. జైల్లో స్థితిగతులు, ఖైదీల దయనీయ కథలు, తెలివిగా జైల్లోంచి తప్పించుకోవడం వాటిల్లో ఆసక్తిగా ఉంటాయి. వాటిల్లో ఎమోషన్, లాజిక్ సమపాళ్లలో ఉన్నవే సక్సెస్ అయ్యాయి. ఆమాటకొస్తే ఏ భాషా చిత్రమైనా ఎమోషన్ పండితేనే మంచి సినిమా అవుతుంది. లాజిక్ ని, వాస్తవికతని దాటి సర్కస్ చేస్తే మాత్రం ఎమోషన్ అందకపోగా లోపాలు కూడా కనపడతాయి. 

పైన చెప్పుకున్న ఇంగ్లీష్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందినట్టుగా ఉన్న చిత్రం ఈ "చెక్". 

ఆదిత్య(నితిన్) టెర్రరిజం కేసులో నిందితుడుగా అరెస్ట్ అవుతాడు. అయితే అతను కేవలం ఒక వైట్ కాలర్ క్రిమినలే తప్ప టెర్రరిస్ట్ కాదు. లాయర్ మానస (రకుల్ ప్రీత్) అతనిని నిరపరాధిగా నిరూపించాలని ప్రయత్నిస్తుంటుంది. జైల్లో ఒక ముసలాయన (సాయిచంద్) ఉంటాడు. అతనొక చెస్ ప్లేయర్. అతనితో ఆడుతూ చెస్ లో నైపుణ్యం సంపాదిస్తాడు ఆదిత్య. ఆదిత్యకి గతంలో యాత్ర (ప్రియ ప్రకాశ్ వారియర్) తో ఒక ప్రేమకథ ఉంటుంది. ఆ యాత్ర ఎవరు? ఆదిత్య జైల్లోంచి బయటపడతాడా? ఇంతకీ, అతని విడుదలకి, చెస్ కి సంబంధం ఏమిటి? ఇవన్నీ తెర మీద చూడాలి. 

కథ ఎత్తుకోవడం బాగుంది కానీ ఇక్కడున్న ప్రధానమైన ఛాలెంజ్ చెస్ ఆట. హీరో ఆడుతున్న చెస్ ఆటకి ప్రేక్షకులు కనెక్ట్ అవడం కష్టం. క్రికెట్, కబడ్డిలాంటి శారీరకపరమైన ఆటలతో డ్రామా పండినట్టు చెస్ లాంటి మైండ్ గేం తో పండించడం కష్టం. 

కథనం విషయానికొస్తే ఈ సారి ఏలేటి కాస్త వెనకబడ్డారనే చెప్పాలి. ఎంతో పకడ్బందీగా, ఉత్కంఠభరితంగా చెప్పాల్సిని కథని అటు ఇటు గా తీసారు. 

అతికీ అతకని సీన్లు చాలానే ఉన్నాయి ఇందులో. టెర్రరిజం కేసులో కోర్టులో హాజరుపరచడానికి హీరోని తీసుకొస్తారు పోలీసులు. ఆ సమయంలో ఒక పక్కన జడ్జ్ గారి మనవరాలు ఒక పిల్లాడితో చెస్ ఆడుతుంటుంది (అవును కోర్టు ప్రాంగణంలోనే). కాస్త దూరంగా సంకెళ్లతొ నిలబడిన హీరో ఆ పిల్లాడికి ఎత్తులు చెప్పి గెలిపిస్తాడు. చెస్సులో చాంపియన్ అయిన ఆ అమ్మాయి హీరో చెప్పిన ఎత్తులకి విస్తుపోతుంది. అతనితో ఆట ఆడాలంటుంది. అక్కడే ఉన్న జడ్జ్ గారు "ఆడవయ్యా" అంటూ ఎంకరేజ్ చేసి మరీ ఆడిస్తాడు. 

అలాగే మరో సన్నివేశంలో లాయర్ రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు కానిస్టేబుల్స్ సాయంతో నేరుగా ఖైదీలుండే సెల్ కి వెళ్తుంది తన క్లైంట్ అయిన హీరోతో మాట్లాడడానికి. అక్కడ మరొక కామాంధుడైన ఖైదీ ఆమెని గట్టిగా లాక్కుని ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అతని నుంచి విడిపించుకుని ఏదో వార్ణింగ్ ఇచ్చి బూతు తిట్టి వెళ్లిపోతుంది ఆమె. ఇక క్లైమాక్స్ కి కాస్త ముందు విశ్వనాథన్ ఆనంద్ సన్నివేశం అయితే చెప్పక్కర్లేదు. నేరుగా విశ్వవిఖ్యాత గ్రాండ్ మాస్టర్ పేరుని వాడేస్తూ ఒక జూనియర్ ఆర్టిస్టుని పెట్టారు ఆ పాత్రలో. అంత పాపులర్ ప్లేయర్ మొహం అందరికీ సుపరిచితమే. అలాంటప్పుడు అసలు అతన్ని చూపించకుండా "బెన్ హర్" లో జీసస్ పాత్రని డీల్ చేసినట్టు చూపిస్తే కాస్తన్నా ఎమోషన్ వర్కౌట్ అయ్యేది. 

సెకండ్ హాఫ్ లో ఇద్దరు యువ ఖైదీలు హీరో పక్కన చేరతారు. అసలు ఆ పాత్రలెందుకో అర్థం కాదు. ఆ పాత్రల ఆరంభం, కొనసాగింపు, ముగింపు..ఏవీ మనసును హత్తుకోవు. క్లైమాక్సులో ఎస్కేప్ సీన్ అయితే ఇక పరాకాష్ట. అస్సలు నమ్మబుల్ గా లేదు. ధూం 3 లో కూడా ఈ రేంజ్ ఎస్కేప్ చూపించలేదు. ఇక్కడ షషాంక్ రిడెంప్షన్ స్ఫూర్తి బాగా కనిపించింది. ఏలేటి గత సినిమాలను బట్టి ఆయన్ని తక్కువ చేయలేం. మరి ఇలాంటి సీన్స్ ఎందుకు తీసారు...అంటే..ఒకటే అనిపిస్తోంది... పేపర్ మీద ఆయనకి ఎక్జైటింగ్ గా అనిపించిన అంశాలు తెరకెక్కేసరికి తేలిపొయి ఉండొచ్చు. 

నితిన్ నటన గురించి చెప్పుకోవాల్సినంత స్కోప్ ఆ పాత్రకి ఇవ్వలేదు. కానీ ఉన్నంతలో మెప్పించాడనే చెప్పాలి. దాదాపుగా జైల్లోనే గడిపే పాత్ర కావడం వల్ల వవిధ్యం చూపించే అవకాశం తక్కువగా ఉంది తనకి. సాయిచంద్ పాత్రలో ఇంటెన్సిటీ ఉంది. సినిమా అయ్యాక కూడా గుర్తుండే పాత్ర అదే.  రకుల్ ది సాదాసీదా పాత్ర. అసలు ఆమె అవసరం సినిమా బిజిన్సె కి తప్ప ఆ క్యారెక్టర్ కి లేదనే చెప్పాలి. ప్రియా ప్రకాష్ వారియర్ ఒక పావుగంట కనిపించి మాయమయ్యింది. మంచి జైలరుగా మురళి శర్మ, చెడ్డ జైలరుగా సంపత్ దర్శకుడు చెప్పినట్టు చేసేసారు.

ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ సాంకేతిక విలువలు కెమెరా వర్క్ లోనూ, ఆర్ట్ డైరెక్షన్లోనూ ఉన్నాయి. ఆ రెండు శాఖలనీ మెచ్చుకుని తీరాలి. సంగీతపరంగా పర్వాలేదనిపించే ఒక పాట ఉంది. నేపథ్య సంగీతం మరింత గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. 

మొత్తానికి రకరకాల సినిమాలు గుర్తు చేస్తూ, బంపీ రైడ్ లాంటి కథనంతో సాగుతూ చివరికి ఒక నిట్టూర్పుని వదిలించే చిత్రం ఈ "చెక్". 

బాటం లైన్: రాంగ్ మూవ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?