మానవత్వం.. ఆ గుండె చప్పుడు.!

ప్రమాదవశాత్తూ జీవించలేని పరిస్థితుల్లోకి (బ్రెయిన్‌ డెడ్‌) వెళ్ళిపోయినప్పుడు, అవయవాల్ని దానం చేస్తే.. ఆ అవయవాలతో మరికొందరి ప్రాణాల్ని కాపాడొచ్చు. దేశంలో వివిధ కారణాలతో అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు వేలాదిమంది. మారుతున్న జీవన శైలి…

ప్రమాదవశాత్తూ జీవించలేని పరిస్థితుల్లోకి (బ్రెయిన్‌ డెడ్‌) వెళ్ళిపోయినప్పుడు, అవయవాల్ని దానం చేస్తే.. ఆ అవయవాలతో మరికొందరి ప్రాణాల్ని కాపాడొచ్చు. దేశంలో వివిధ కారణాలతో అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు వేలాదిమంది. మారుతున్న జీవన శైలి కారణంగా శరీరంలోని కీలక అవయవాలు (గుండె, కిడ్నీ వంటివి) చెడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. పాడైపోయిన అవయవాలతో, మృత్యువుతో పోరాడుతున్నవారికి ‘బ్రెయిన్‌ డెడ్‌’ కేసులు సంజీవనిగా మారుతున్నాయి.

ప్రధానంగా గుండె మార్పిడి అనేది ఇటీవలి కాలంలో అడపా దడపా జరుగుతోంది. హైద్రాబాద్‌లో ఓ ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను తరలించారు. అలా తరలించిన గుండెను, పాడైపోయిన గుండెతో ఎదురుచూస్తోన్న వ్యక్తికి అమర్చి పునర్జన్మ ప్రసాదించారు వైద్యులు. పది కిలోమీటర్ల దూరం రెండు ఆసుపత్రుల మధ్యా వుండగా, అత్యంత క్లిష్టతరమైన ట్రాఫిక్‌ని పక్కా వ్యూహంతో సరిచేసి, గుండెను తరలించడం అప్పట్లో సంచలన వార్త అయ్యింది.

ఆ తర్వాత ఇటీవలే బెంగళూరు నుంచి చెన్నయ్‌కి ఓ గుండెను తరలించారు. ఆ ఆపరేషన్‌ కూడా సక్సెస్‌ అయ్యింది. అయితే ఇది పాతికేళ్ళ వయసు పైబడిన వారి విషయంలోనే జరిగింది. తాజాగా నిండా మూడేళ్ళు కూడా లేని ఇద్దరు చిన్నారుల మధ్య గుండె మార్పిడి.. అది కూడా బెంగళూరు, చెన్నయ్‌ నగరాల మధ్య జరగడం విశేషం. రెండున్నరేళ్ళ వయసున్న ఓ చిన్నారి బ్రెయిన్‌ డెడ్‌కి గురైతే, ఆ చిన్నారి నుంచి సేకరించిన గుండెను, బెంగళూరు నుంచి చెన్నయ్‌లో ఓ ఆసుపత్రిలో వున్న చిన్నారికి అమర్చారు.

అవయవదానం దైవకార్యంగా భావించాల్సిన రోజులివి. చనిపోయాక కళ్ళను దానం చేస్తే.. ఆ వ్యక్తి ఇంకోసారి జీవించినట్లే. చనిపోతూ కొందరి జీవితాల్లో వెలుగులు నింపడం కూడా అలాంటిది. అవయవదానంపై విస్తృత ప్రచారం జరిగి, అవయవమార్పిడి అందరికీ అందుబాటులోకి వస్తే.. ఏటా వేలాదిమంది ప్రాణాలు కాపాడొచ్చంటున్నారు వైద్యులు. ఆ దిశగా ప్రతి ఒక్కరి ఆలోచనలోనూ మార్పు రావాలని కోరుకుందాం.