ముందుకు సాగే ముందు కొందరు పాఠకుల వ్యాఖ్యలకు జవాబివ్వాలి. ఆవు పాఠం అప్పచెప్పే కుర్రవాడుకి అది తప్ప వేరేదీ రాకపోయిన కారణంగా ప్రతీదాన్నీ అలా తిప్పేయవచ్చు. కానీ ఆవుతో బాటు అనేక జంతువుల గురించి బాగా తెలుసు. (పొలిటికల్ యానిమల్ అనే మాట సభ్యపదమే అయినా వాడటం లేదు). ఏ సబ్జక్ట్ గురించైనా చెప్పాలంటే దానికి ప్రాసంగికత (రిలవెన్సు) వుంటేనే పాఠకులు చదువుతారు. హిరోషిమా గురించి యిప్పుడు చెప్తానంటే విసుక్కుంటారు. పాకిస్తాన్ మనపై అణుబాంబు ప్రయోగించబోతోందన్న పుకారు వస్తే అప్పుడు బాంబు వలన హిరోషిమా ఎంతలా నాశనమైందో చెపితే వింటారు. చంథ్రేఖర్, దేవెగౌడ వంటి వాళ్లు ప్రధానిగా వుండగా ఎమర్జన్సీ గురించి చెపితే అదంతా పాత కథ, అలాటి పరిస్థితి మళ్లీ రాదు, ఆ సొద ఎందుకు అనుకుంటారు. ఇప్పుడు అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైన పరిస్థితి వుంది కాబట్టి, దేశప్రజల్లో అతని పట్ల వ్యక్తిపూజ వుంది కాబట్టి ఎమర్జన్సీ గురించిన చర్చ యిప్పుడు రిలవెంట్గా వుంటుంది. ఎందుకంటే మోదీ అన్ని అధికారాలను చేతిలోకి తీసుకుని దేశాన్ని చెడామడా బాగుచేయాలని కోరుకునే వీరాభిమానులు మన పాఠకుల్లోనే కనబడుతున్నారు కాబట్టి. అధికారాలు హస్తగతం చేసుకోవడానికి జ్యుడిషియల్ ఏక్టివిజం అనవచ్చు. కనస్ట్రక్టివిజం అనవచ్చు, మరోటి అనవచ్చు – ఎమర్జన్సీ కథ వింటే యివన్నీ గతంలోనే విన్నామని అర్థమవుతుంది. వాటి పర్యవసానం ఏమిటో కూడా తెలుస్తుంది. మీడియా బలంగా వుంది కాబట్టి ఎమర్జన్సీ రాదని ఒక పాఠకుడు అనుకుంటున్నారు. తెలంగాణలో ఎబిఎన్‌ను ఆపేస్తే, ఆంధ్రలో ఎన్‌టివిని కొన్ని చోట్ల ఆపేస్తూ వుంటే ప్రజలేం చేస్తున్నారు? పైగా మీడియా పక్షపాతధోరణి ఆయన గమనించలేదా?
ఎమర్జన్సీ గురించి చెప్పినపుడు టపటపా చెప్పేస్తే లాభం లేదు. అప్పటి రాజకీయ నాయకుల్లో చాలామంది పేర్లు యిప్పటి తరానికి పరిచితం కాదు. ఇందిరా గాంధీ స్వభావం, దానిలో వచ్చిన మార్పులు కూడా ఒక పట్టాన అర్థం కాదు. అందువలన కథ నెమ్మదిగానే చెప్పాలి. ఒక సంఘటనో, ఒకరి పేరో వచ్చినపుడు కథ ఆపి, అరేబియన్ నైట్స్ కథల్లా, పంచతంత్రం కథల్లా వాళ్ల గురించి చెప్పుకుని రావాలి. అందువలన యిది 50 భాగాలకు తక్కువ కాకుండా నడుస్తుందని అనుకుంటున్నాను. ఇంత విపులంగా చెప్పాలా అంటే యీ సమాచారం నేను తర్వాత – రాస్తే గీస్తే – రాద్దామనుకుంటున్న జనతా ప్రయోగం, ఇందిర జీవితచరిత్ర వంటి సీరియల్స్‌కు బేస్ మెటీరియల్‌గా పనికి వస్తుంది. జనతా గురించి యిప్పుడు రాస్తే పండదు. జనతా పరివార్ అంటూ ఏర్పడుతున్న కూటమి స్పష్టమైన రూపు దిద్దుకుంటే యిలాటి ప్రయోగం గతంలో ఎందుకు విఫలమైందో చెప్పినపుడు చదవబుద్ధి అవుతుంది. సీరియల్ మొదలుపెట్టగానే యిది 'మోదీకి వ్యతిరేకంగా వుంటుంది', 'నెహ్రూ కుటుంబానికి నివాళి యిస్తుంది' అని తీర్మానాలు చేసేసుకుంటే అవి కనబడకపోతే బోరు కొట్టేస్తుంది. నేను నెహ్రూ కుటుంబానికి అభిమానిని అనే పాఠకుడి కంటికి 'ఇందిర నియంతృత్వం' అనే పదాలు కనబడలేదేమో! నెహ్రూలో కొన్ని లక్షణాలు నచ్చితే వాళ్ల కుటుంబం అంతా నచ్చాలని లేదు. ఎన్టీయార్ కొన్ని సినిమాలు నచ్చితే బాలకృష్ణ, తారకరామ్ సినిమాలు నచ్చాలని లేదు.
ఎమర్జన్సీ గురించి చాలా పుస్తకాలే వచ్చాయి. 1978 నాటికే వచ్చిన కొన్ని మంచి పుస్తకాలు – కులదీప్ నయ్యర్ రాసిన 'ద జజ్మెంట్', డిఆర్ మన్కేకర్ రాసిన 'డిక్లయిన్ అండ్ ఫాల్ ఆఫ్ ఇందిరా గాంధీ', జనార్దన్ ఠాకూర్ రాసిన 'ఆల్ ద ప్రైమ్ మినిస్టర్స్ మెన్', 'సిఎస్ పండిట్ రాసిన 'ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా', ప్రమీలా కల్హన్ రాసిన 'బ్లాక్ వెన్స్డే – పవర్, పాలిటిక్స్, ఎమర్జన్సీ అండ్ ఎలక్షన్స్', ఉమా వాసుదేవ్ రాసిన 'టూ ఫేసెస్ ఆఫ్ ఇందిరా గాంధీ', అమియా రావ్ అండ్ బిజి రావ్ రాసిన 'లైస్ అన్మాస్క్డ్ – వై ఎమర్జన్సీ', జాన్ దయాల్, అజయ్ బోస్ రాసిన 'ఢిల్లీ అండర్ ఎమర్జన్సీ', ఆర్ఎమ్ సిన్హా రాసిన 'ఆపరేషన్ ఎమర్జన్సీ'. నాకు తెలియనివి యింకా చాలా వుండవచ్చు. ఇన్ని వుండగా నువ్వు మళ్లీ సీరీస్ రాయడం దేనికి అని మీరనుకోవచ్చు. మనకు వచ్చిన భాషలోనే సిలబస్‌లో టెక్స్ట్ బుక్స్ పెడతారు. వాటిని చెప్పడానికి టీచరెందుకు? టెక్స్ట్ బుక్లోది అర్థం కాకపోతే విప్పి చెప్పడానికి! ఇక్కడ నా పనీ అంతే! ఆ పుస్తకాలు అప్పటి రాజకీయాలు తెలిసినవారికి అర్థమవుతాయి. బన్సీ లాల్ అంటే ఎవరు? కాంగ్రెస్ (ఓ) అంటే ఏమిటి? రాజ్ నారాయణ్ తెలివైన వాడా? తెలివి తక్కువ్వాడా? ఎమర్జన్సీ విధించినప్పుడు బహుగుణకు అందరి కంటె ఆలస్యంగా ఎందుకు చెప్పారు? ఇలాటి సందేహాలు చుట్టుముడుతూ వుంటే పుస్తకపఠనం ముందుకు సాగదు. అందుకే నేను పాత్రల పరిచయం, నేపథ్యపరిచయం బాధ్యత కూడా పెట్టుకున్నాను. సీరీస్ సాగుతూంటే పాఠకుల ఎవరి గురించైనా, వారి రాజకీయ కార్యకలాపాల గురించైనా సందేహం వెలిబుచ్చితే సమాధానాలు చెపుతూ ముందుకు సాగుతాను. ఇది చాలాకాలం సాగే యజ్ఞంలా తోస్తోంది కాబట్టి అంత ఓపిక లేనివారి కోసం ఎమర్జన్సీ కథను మూడు పేరాల్లో యిచ్చేస్తున్నాను. దీనితో తృప్తి పడిపోయినవాళ్లు యిక యిటు రానక్కరలేదు.
ఇందిరా గాంధీ 1971 ఎన్నికలలో అఖండ విజయం సాధించింది. అప్పటి నుంచి పార్టీని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోసాగింది. నియంతృత్వ ధోరణులు ప్రబలాయి. దేశంలో మరెవ్వరూ బలపడకుండా రాష్ట్రాలలో బలమైన ముఖ్యమంత్రులను తొలగించి, తనకు విధేయులైన బలహీనులను నియమించ సాగింది. పరిపాలనలో ఆమె చిన్న కొడుకు సంజయ్ చొరబడసాగాడు. అతను రాజ్యాంగేతర శక్తిగా మారి అధికారం చెలాయించసాగాడు. దేశంలో పరిస్థితి అస్తవ్యస్తం కాసాగింది. అనేకమంది ముఖ్యమంత్రులపై అసమర్థత, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. గుజరాత్లో విద్యార్థులు నవనిర్మాణ్ పేర ఆందోళన చేపట్టారు. ఇందిర చేతిలో పరాజితుడైన మాజీ ఉపప్రధాని, పాత కాంగ్రెసువాది మొరార్జీ దేశాయి వారికి మద్దతుగా దీక్ష చేశాడు. ఇది సోషలిస్టు అయిన జయప్రకాశ్ నారాయణ్‌కు స్ఫూర్తి నిచ్చింది. ఆయన 'సంపూర్ణ క్రాంతి' పేరుతో బిహార్‌లో ఉద్యమం మొదలుపెట్టి, ఉత్తరభారతమంతా వ్యాపింపచేశాడు. నెహ్రూ కుటుంబానికి ఆప్తుడైనా ఇందిర పోకడలను నిరసిస్తూ వృద్ధాప్యంలోనే దేశమంతా తిరగసాగాడు. చీలిపోయిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ (ఓ), సోషలిస్టు పార్టీ, జనసంఘ్, లోక్ దళ్లను సంఘటితం చేసి ఒక తాటిపై నడిపించే ప్రయత్నం చేశాడు. ఇది ఇందిరను కలవర పరిచింది. 1974 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా రైల్వే సమ్మె జరిగితే దాన్ని క్రూరంగా అణచివేసింది. ఈ పరిస్థితిని ఎలాగోలా ఎదుర్కోవాలనుకుంటూనే ఏం చేయాలో తోచక కొట్టుమిట్టులాడుతోంది.
అంతలో 1975 జూన్ 12 న అహ్మదాబాద్ హై కోర్టు జడ్జి ఇందిర ఎన్నికపై ఆమె ప్రత్యర్థి రాజ్ నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు చెప్పాడు. కొన్ని సాంకేతిక కారణాల వలన ఆమెను దోషిగా నిర్ధారించి, ఆమె పదవిలోంచి తప్పుకోవాలని, ఆరేళ్లపాటు ఎన్నికలలో పాల్గొనకూడదని చెప్పాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు కాస్త గడువు యిచ్చాడు. ఇందిర దిగిపోవాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. దిగిపోతే తన స్థానంలో మరొకరు వచ్చేసి మళ్లీ దిగరని ఇందిరకు భయం పుట్టింది. ఆమెకు సన్నిహితంగా వున్నవారు ఏదో ఒక తీవ్రమైన చర్య తీసుకోమని ప్రేరేపించారు. అంతర్గత అత్యవసర పరిస్థితి ప్రకటించి, కోర్టు తీర్పు అమలు కాకుండా చేయమన్నారు. జూన్ 25 న రాత్రి 11.45కు ఇందిర తనకు విధేయుడైన దేశాధ్యక్షుడి చేత ఎమర్జన్సీ ఘోషణాపత్రంపై సంతకం పెట్టించింది. వెనువెంటనే ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్లలో పెట్టించింది. సెన్సార్ నిబంధనలు విధించి పత్రికా స్వేచ్ఛను హరించింది. ప్రతిపక్షాలు దేశద్రోహానికి ఒడిగట్టాయని, తిరగబడమని సైన్యాన్ని ప్రేరేపించాయని ఆరోపించింది. ప్రజల సంక్షేమమనే తన ధ్యేయమని చెప్పడానికి 20 సూత్రాల పథకం అని పెట్టింది, సంజయ్ గాంధీ 5 సూత్రాల పథకం అని చేర్చాడు. 19 నెలల పాటు తల్లీకొడుకుల యిష్టారాజ్యం సాగింది. ఇందిర బాటలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాజకీయ శత్రువులను నానా హింసలూ పెట్టారు. ప్రజాస్వామ్యం అనేది కలికంలోకి లేకుండా పోయింది. జరుగుతున్న సంఘటనలు పత్రికల్లో రాయడానికి లేదు. ఎమర్జన్సీ పేరుపై ఎన్నో అత్యాచారాలు జరిగాయి. దాన్ని ఎదిరించడానికి కొద్దిమంది ప్రయత్నించారు కానీ సఫలం కాలేకపోయారు.
అంతర్జాతీయ సమాజం భారతదేశం యిలా నియంతృత్వంలోకి వెళ్లడం హర్షించలేకపోయింది. ప్రజాస్వామికవాదిగా పేరొందిన నెహ్రూ వారసురాలు ఇందిర యిలా చేయడమేమిటన్న విమర్శలు వచ్చాయి. ఇందిర అది భరించలేకపోయింది. ఎమర్జన్సీ వలన చాలా హాని కలుగుతోందని, సెన్సార్షిప్ కారణంగా తనకు సరైన వార్తలు చేరటం లేదని ఆమె గ్రహించింది. కానీ ఎమర్జన్సీలో అమలు చేసిన క్రమశిక్షణ కారణంగా ఎక్కువమంది ప్రజలు సంతోషంగా వున్నారని పొరబడింది. ఎమర్జన్సీ ఎత్తేసి, ఎన్నికలు నిర్వహిస్తే దానిలో తన గెలుపు తథ్యమని, అప్పుడు అంతర్జాతీయ సమాజం నోరు మూసుకుంటుందని భావించి, ఎవరూ ఎదురు చూడని క్షణంలో 1977 జనవరిలో ఎమర్జన్సీ సడలించి మార్చిలో ఎన్నికలు ప్రకటించింది. ప్రతిపక్ష నాయకులను జైళ్లలోంచి వదిలిపెట్టింది. సిద్ధాంత వైరుధ్యాలున్న వీరందరూ యింత తక్కువ వ్యవధిలో ఒక తాటిపై వచ్చి తనను ఎదిరించ లేరని, తనదే గెలుపని అనుకుంది. కానీ ఆశ్చర్యకరంగా వాళ్లందరూ జనతా పార్టీ పేర ఏకమై, సిపిఎంతో పొత్తు పెట్టుకుని కాంగ్రెసును ఎదిరించారు. ఎమర్జన్సీని సమర్థించిన సిపిఐ కాంగ్రెసుతోనే అంటకాగింది. మార్చిలో ఎన్నికలు జరిగాయి. జనతా పార్టీ భాగస్వామ్యులందరూ ఉత్తరాది బేస్ వున్న పార్టీలే కాబట్టి ఎమర్జన్సీ అత్యాచార బాధితులు అక్కడే ఎక్కువ వున్నారు కాబట్టి అక్కడ కాంగ్రెసు మట్టి కరిచింది. ఇందిర స్వయంగా రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. దక్షిణాదిన ఆ పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెసు గెలిచింది. కొత్త ఆశలతో జనతా పార్టీ గద్దె కెక్కింది. 1977 మార్చి 23 న ఎమర్జన్సీ అధికారికంగా ఎత్తివేయడమైంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)