సినిమా రాకుండానే బిరుదులు తగిలించేసుకునే లెవెల్ కు ఎదిగిపోయారు ఈ తరం హీరోలు. ఎన్టీఆర్ కు నటరత్న, ఎఎన్నార్ నటసామ్రాట్, కృష్ణకు సూపర్ స్టార్ రావడానికి ఎన్నాళ్లు పట్టిందో. ఇప్పుడలా కాదు. నటించి తొలిసినిమాకు టైటిల్ కన్నా, ముందు కుర్రాడికి ఏ బిరుదు పెట్టాలా అని చూస్తున్నారు.
అది చాలదన్నట్లు బిరుదులు కూడా అనూచానంగా, వారసత్వ సంపదగా చూస్తున్నారు. నటసామ్రాట్ అంటే యువ సామ్రాట్..మెగా స్టార్ అంటే మెగా పవర్ స్టార్..ఇలా కొత్త పోకడలు పొతున్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి లెక్కకు మించి జనాలు సినిమాల్లోకి వస్తుంటే బిరుదులు వెదుక్కోవలసి వస్తోంది. వచ్చేవారం విడుదలవుతున్న ముకుంద తో తెరంగ్రేటం చేస్తున్న వరుణ్ తేజకు మెగా ప్రిన్స్ అని తగిలించేసారు.
అసలే ఇప్పటికే మహేష్ బాబును ప్రిన్స్ మహేష్ అంటున్నారు. అదో తకరారు అనుకుంటే, నాగ్ రెండో వారసుడిగా వస్తున్న అఖిల్ కు ప్రిన్స్ అని తగిలించేస్తున్నారు. టాలీవుడ్ కు ఇద్దరు ప్రిన్స్ లా అని మహేష్ ఫ్యాన్స్ గుర్రుమంటుంటే, కింగ్ నాగార్జున వారసుడు కదా..ప్రిన్స్ అనే అనాలి అంటున్నారు అఖిల్ ఫ్యాన్స్.
అసలు ముందు సినిమాల్లో సత్తా నిరూపించుకుని, ఆపై మంచి హిట్ లు కొట్టి, అప్పుడు ఈ బిరుదుల వ్యవహారం చూడాలి కానీ, సినిమా లేదు..విడుదల లేదు అప్పుడే బిరుదులంటే ఎలా? కొంచెమయినా ఫీల్ అంటూ వుండదా?