ఎమ్బీయస్‌: అమరావతి వేదికపై కెసియార్‌

అమరావతి శంకుస్థాపన సభలో కెసియార్‌ను వేదికపై చూడగానే బాధ కలిగింది. రాష్ట్రవిభజనకు మూలకారకుడు అన్న కారణంగానా? కాదు. ఆయన ఉద్యమం మొదలుపెట్టి వుండవచ్చు కానీ, అనేక రాజకీయపార్టీల సహకారం లేనిదే ఆయన లక్ష్యం నెరవేరేది…

అమరావతి శంకుస్థాపన సభలో కెసియార్‌ను వేదికపై చూడగానే బాధ కలిగింది. రాష్ట్రవిభజనకు మూలకారకుడు అన్న కారణంగానా? కాదు. ఆయన ఉద్యమం మొదలుపెట్టి వుండవచ్చు కానీ, అనేక రాజకీయపార్టీల సహకారం లేనిదే ఆయన లక్ష్యం నెరవేరేది కాదు. సిపిఎం తప్ప తక్కిన పార్టీలన్నీ విభజనపాపం పంచుకోవలసినవాళ్లే. మరి కెసియార్‌ పట్ల ఎందుకీ వివక్షత అంటే ఆయన ఆంధ్రుల పట్ల వాడిన భాష, వాళ్లను వర్ణించిన విధానం! పరిస్థితుల్లో మార్పు కోరేవారు అధికారంలో వున్నవారిని నిందించడం, లేనిపోని అబద్ధాలు సృష్టించడం పరిపాటి. అది రాజకీయంలో భాగం. కానీ కెసియార్‌ ఆంధ్రులను జాతిపరంగా తిట్టాడు. రాక్షసజాతి అన్నాడు. దోపిడీ దొంగలన్నాడు, ఆంధ్ర అధికారులు అవినీతిపరులు, మోసగాళ్లు, అసమర్థులు అన్నాడు, ఆంధ్ర పురోహితులకు (ఆ జాబితాలో తాజాగా చంద్రబాబు కూడా చేరారు) అహంకారమే తప్ప నిజాయితీ లేదన్నాడు. ఆయన డైరక్షన్‌లో ఉపనాయకులు ఆంధ్రులను బలి యిచ్చి రక్తతర్పణాలు చేస్తానన్నారు. (ఆయనెప్పుడూ వారిని ఖండించలేదు) ఆయన కుటుంబసభ్యులు యిప్పటికీ ఎన్నిరకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిడుతూనే వున్నారు. ఇప్పుడు ఆయన్ని పిలిచారు. పిలిచినందుకేనా ఆయన  గతంలో తను అన్న మాటలకు క్షమాపణ చెప్పాలి. డైరక్టుగా సారీ చెప్తాడని ఎవరూ అనుకోలేరు కానీ కనీసం 'ఉద్యమసమయంలో లక్ష అనుకుంటాం. నేనూ హద్దు మీరి వుండవచ్చు. అవేమీ మనసులో పెట్టుకోవద్దు, మనమంతా సోదరులం..' అన్న ధోరణిలో మాట్లాడాడా? లేదే!  రేపు హైదరాబాదు కార్పోరేషన్‌ ఎన్నికలలో ఆంధ్రమూలాలున్న ప్రాంతాల్లో తెరాసకు తగినన్ని ఓట్లు పడకపోతే ఎలా మాట్లాడతాడో, మళ్లీ ఏ తిట్లపురాణం లంకించుకుంటాడో తెలియదు. 

అలాటివాడు ఉపన్యాసం యిస్తే చప్పట్లు కొట్టాలా? అడుగడుగునా కొట్టినవాళ్లను పట్టుకుని కాలరు పట్టుకుని అడగాలి – ఏం చూసి కొట్టారని. ఈయన అమరావతి నిర్మాణంలో సాయం చేస్తాట్ట. చేయవలసిన మోదీయే కిమ్మనటం లేదు. స్పెషల్‌ ప్యాకేజీ తెస్తాడని ఎదురు చూస్తే స్పెషల్‌గా పాకెట్‌ చేతిలో పెట్టాడు. ఇప్పి చూస్తే అది మట్టి పొట్లం! అమరావతి నిర్మాణానికి యీ కెసియార్‌ చేసే సాయం ఏమిటో గానీ సమయానికి పొలాలకు నీళ్లు వదిలితే చాలు, ఆంధ్రమూలాలున్నాయంటూ ఉద్యోగులను తరిమివేయడం మానేస్తే చాలు. ఆంధ్రులను విడగొట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు న్యాయవిరుద్ధమని హైకోర్టు కొట్టేస్తూన్నకొద్దీ అలా తీర్పులిస్తున్నది ఆంధ్రా జడ్జిలేననీ, మొత్తం తెలంగాణ జడ్జిలతో తెలంగాణ హైకోర్టు ఏర్పడేదాకా విశ్రమించ కూడదనీ పట్టుదలగా వున్నాడు. హైదరాబాదులో పదేళ్లదాకా వుండే హక్కు ఆంధ్రులకు లేకుండా చేస్తూ, ఉద్యోగుల, విద్యార్థుల హక్కుల హరిస్తూ అమరావతికి సాయం చేస్తానని ఆయననడం వింతగా లేదూ! 

కెసియార్‌ను ఎందుకు పిలవాల్సి వచ్చింది అన్న విషయంపై బాబు తన కాబినెట్‌ సహచరులకు వివరించారట. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో మనకు చాలా లావాదేవీలు, పితలాటకాలు వున్నాయి కాబట్టి పిలవాలి అన్నారట. అదే లాజిక్‌ తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ముఖ్యమంత్రులతో కూడా పని చేస్తుంది. వాళ్లూ పొరుగువాళ్లే, వాళ్లతోనూ పేచీలున్నాయి. ముఖ్యంగా అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా కలిసి రావాలి. వారందరితో సత్సంబంధాలు పెట్టుకుని, పెంచుకోవలసిన అవసరం వుంది. తమిళనాడు గవర్నరు రోశయ్య తెలుగువారు కాబట్టి వచ్చారు. గవర్నర్లు అలంకారప్రాయులే. అసలు అధికారం ముఖ్యమంత్రులది. వాళ్లను స్వయంగా  పిలిస్తే వచ్చేవారేమో. ఎందుకు వెళ్లలేదో మనకు తెలియదు.టిడిపి నాయకులకే కాదు, ఆంధ్ర నాయకులందరికీ హైదరాబాదులో ఆస్తులుండడం చేత కెసియార్‌ను మంచి చేసుకోవలసిన అవసరం వుంది కాబట్టి పిలిచారు అని కొందరంటున్నారు. ఒడిశా మాట తెలియదు కానీ మనవాళ్లకు బెంగుళూరు, మద్రాసులలో కూడా పుష్కలంగా ఆస్తులున్నాయి. అయితే ఆ ముఖ్యమంత్రులు కెసియార్‌లా పగసాధింపు ధోరణిలో లేరు. అందుకని లోకువై పోయారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక కర్నూలులో 1953 అక్టోబరు 1న సభ జరిగింది. జవహర్‌లాల్‌ నెహ్రూ వచ్చారని తెలుసు. అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి వచ్చారో లేదో తెలియదు. 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్య్రసభకు మాత్రం జిన్నా రాలేదు. అది ఖచ్చితంగా చెప్పవచ్చు. పాకిస్తాన్‌ కూడా పొరుగుదేశమే. ముస్లిములు పరాయివాళ్లని హిందూస్తాన్‌ వాళ్లు ఎన్నడూ ఫీలవలేదు. 

చంద్రబాబు స్వయంగా పిలిచి వుండకపోతే కెసియార్‌ వచ్చేవారా? ఏమో, అయినా యీయన వెళ్లి స్వయంగా బొట్టు పెట్టి, చందనం పూసి పిలవాల్సినంత అవసరం వుందా? వీళ్లిద్దరూ కలిసి కూర్చుంటే అనేక సమస్యలు తీరిపోతాయని అందరూ చెప్తూ వుంటారు. ఒకరి మీద మరొకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసుకుంటూ వుంటారు. 'ఇవి మేం తేల్చం. మీలో మీరే తేల్చుకోండి' అని కేంద్రం అంటుంది. 'దానికేం భాగ్గెం? చంద్రశేఖర్‌ రావు నాకు తెలియనివాడు కాదు, నాతో కలిసి పనిచేశాడు' అంటారు బాబు. అంటారే కానీ కలవరు. కలవాలంటే గవర్నరుగారు పూనుకోవాలి. ఇద్దర్నీ కూర్చోబెట్టి తేల్చుకోండి అనాలి. వాళ్లేం తేల్చుకుంటారో తెలియదు కానీ ఎక్కడి సమస్యలు అక్కడే వుంటాయి. ఒకరి ఆస్తులకు మరొకరు తాళాలు వేస్తూనే వుంటారు. ఒకరి నిధులు మరొకరు చెప్పకుండా బ్యాంకుల్లోంచి తరలించుకుని పోతూనే వుంటారు. ఇరు రాష్ట్రాల పోలీసులు బాహాబాహీ, ముష్టాముష్టీ తలపడతారు. హైదరాబాదులో వున్న ఉమ్మడి ఆస్తులన్నీ మావే అని కెసియార్‌ అంటూనే వుంటారు. అలా అనే హక్కు మీకు లేదు అని బాబు సర్కారు కోర్టుకి వెళుతూనే వుంటుంది. ఇదీ వీళ్ల సుహృద్భావం! ఇప్పుడు మాత్రం యీయన మర్యాద యివ్వడం, ఆయన పుచ్చుకోవడం, అది చూసి మనం మురిసిపోవాలట, పోతున్నారని మీడియా డప్పు ఒకటి! రెండు రాష్ట్రాల గొడవల మధ్య పడి సీట్లు పోగొట్టుకున్న విద్యార్థులు, త్రిశంకు స్వర్గంలో వేళ్లాడుతున్న ఉద్యోగులు, నెలల తరబడి జీతాలు రాకుండా అల్లాడుతున్న విద్యుత్‌ ఉద్యోగులు వాళ్ల భావాలేమిటో రాయమనండి యీ మీడియాను! సభలో చప్పట్లు కొట్టినవారు టిడిపి కార్యకర్తలు కావచ్చని నా సందేహం. ఎందుకంటే కెసియార్‌ దయతలిస్తే కానీ రేవంత్‌ ఓటు-నోటు కేసులోంచి బయటపడలేడు. 'చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు' అని కెసియార్‌ అన్న మాట బట్టి చూస్తే నిందితుల లిస్టులో చంద్రబాబు పేరు కూడా ఏదో ఒక లెవెల్లో వుందనుకోవాలి. ఇప్పుడు చేసిన సత్కారానికి మురిసి కెసియార్‌ ఆ కేసును ముందుకు తీసుకెళ్లడేమోనన్న ఆశాభావం వున్నవాళ్లే చప్పట్లు కొట్టగలరు.

 పెద్దవాళ్లు లోకాన్ని ఎంత చదివి 'అయినవాళ్లకు ఆకుల్లో, కానివాళ్లకు కంచాల్లో పెట్టినట్లు..' అని సామెత చెప్పారో కానీ అమరావతి సభలో అదే జరిగింది. రాజధాని శిలాఫలకం మీద కెసియార్‌ పేరు వేశారు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల పేర్లు వేయలేదు. ఇంకా నయం, ఆయన పేరుతో శిలాశాసనం ఒకటి పాతేయించలేదు. ఏ భవనమో ఆయన చేత ఆవిష్కరింప చేసి, దానికి ఆయన పేరు పెట్టలేదు. కెసియార్‌ రావడం చేత ఆంధ్రులకు ఒరిగినదేముంది? మోదీ ప్రత్యేక హోదా ప్రకటన చేద్దామనుకున్నా, వేదిక మీద వున్న కెసియార్‌ నొచ్చుకుంటాడని మానేశాడని బాబు తరఫున సంజాయిషీ చెప్పేవాళ్లు ఒక లీకు విడుదల చేశారు. ఇది నమ్మితే 'ఇదా కెసియార్‌ వలన మనకు ఒరిగినది, పిలవకపోతే బాగుండేది కదా' అని సగటు ఆంధ్రుడు అనుకుంటాడు.  నా మట్టుకు నేను నమ్మను. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేదిక మీద వుందంటే ఆ మాట నప్పుతుందేమో. కెసియార్‌ అయితే సంతోషిస్తాడు. 'వాళ్లకు యివ్వడం బాగుంది, వాళ్లతో బాటు మాకూ యిస్తే మహబాగు…' అని తన ఉపన్యాసంలో చెప్పి వుండేవాడు. మోదీ యిద్దామనుకుంటే మొహమాటపడే రకం కాదని బిహార్‌ ప్యాకేజీ ఎనౌన్సుమెంటులోనే తెలిసింది. ఇవ్వకూడదనుకున్నాడు, యివ్వలేదు దట్సాల్‌. ఈ పండగలకు, పబ్బాలకు డబ్బులు కావాలంటే ప్రజల నుంచి దండుకోండి అని చెప్పి వెళ్లివుంటాడు. అందుకనేలాగుంది బస్సు చార్జీలు పెంచేశారు. అదే దూరానికి తెలంగాణలో వసూలు చేసేదాని కంటె 10% ఎక్కువట! ఈ బస్సు రేట్ల పెరుగుదల వెనక్కాల లాజిక్‌ నాకు అర్థమే కాలేదు. అంతర్జాతీయంగా పెట్రోలు ధరలు పెరిగినప్పుడు ఆ కారణం చెప్పి పెంచేవారు. ఇప్పుడు ధరలు తగ్గినప్పుడు ఏం కారణం చెప్తారు? ఆంధ్ర ఆర్‌టిసి ఆస్తులన్నీ హైదరాబాదులో వుండిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకుని, అమ్ముకున్నా, అద్దెకిచ్చినా ఆర్టీసీ ఆదాయం పెరిగేది, అవి దక్కటం లేదు కాబట్టి చార్జీలు పెంచుతున్నామని చెప్తారా? అలా దక్కకుండా చేసిన కెసియార్‌కు ఎఱ్ఱ తివాచీ పరిచి, ప్రజలకు పన్నులు వడ్డిస్తూంటే ఏమైనా సబబుగా వుందా?

ఇంత పండగ జరుగుతూంటే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రాగా లేనిది, రాష్ట్రంలోని కొన్ని పార్టీల నాయకులు రాకపోవడం శోచనీయం అన్నారు టిడిపివారు. కెసియార్‌ రావడంలో ఆశ్చర్యం ఏముంది? ఓటుకు నోటు కేసులో బాబు పిలక ఆయన చేతిలో వుంటే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆయన పిలక బాబు చేతిలో వుంది. రాకేం చేస్తాడు? అప్పోజిషన్‌ వాళ్లతో ఆ బేరాలు కుదరలేదేమో.  ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకుడు జగన్‌ ముందే చెప్పేశారు – నన్ను పిలవకండి, రాను అనేసి. అలా అనడంలో లౌక్యం లోపించిందని చాలామంది అన్నారు కానీ తెలివైన పని చేశారని నా ఉద్దేశం. రాష్ట్రంలో వున్న పరిస్థితి ఏమిటంటే – బాబు అధికశాతం ఓట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని గుర్తించడానికి జగన్‌ నిరాకరిస్తారు. తన తర్వాత, ఆల్మోస్ట్‌ వెనక్కాల వెనక్కాలే ఓట్లు తెచ్చుకుని జగన్‌ బలమైన ప్రతిపక్ష నాయకుడు అయ్యారన్న విషయాన్ని గుర్తించడానికి బాబు నిరాకరిస్తారు. అందువలన అసెంబ్లీలో జగన్‌ లేవగానే అధికారపక్ష సభ్యులు గోలగోల చేస్తారు. ఏ సబ్జక్టు మాట్లాడబోయినా 'లక్షకోట్లు, వైయస్‌ అవినీతి, జైలు జీవితం, ఫ్యాక్షనిజం' అనే మాటలే పదేపదే వాడతారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో వుండగా కాంగ్రెసు వాళ్లు మాటిమాటికీ 'వెన్నుపోటు' మాట ఎత్తుతూ మాటకు అడ్డుపడేవారు. ఇప్పుడు టిడిపిది అదే ఫార్ములా. 'లక్ష కోట్లు' అని. ఇప్పటిదాకా సిబిఐ ఆ అభియోగాల్లోనైనా ఆ అంకె చేరలేకపోయింది. ఇలాటి పరిస్థితిలో జగన్‌ ఆ సభకు వచ్చి వుంటే ఎన్ని రకాల అవమానాలు జరిగేవో వూహించలేం. మైకులో వినిపించే పాటల్లో 'లక్షకోట్లు, లోటస్‌ ప్యాండ్‌, పావురాయి గుట్ట' లాటి మాటలు ఏదో ఒక రూపంలో, అన్యాపదేశంగానైనా వినబడేవనుకుంటా. కట్టబోయే అమరావతి బ్లూప్రింట్‌ చూపిస్తూ 'పెద్దగానే ప్లాన్‌ చేస్తున్నాం, ఎంతైనా మీ బెంగుళూరు ప్యాలెస్‌తో పోలిస్తే దిగదుడుపే ననుకోండి' లాటి చెణుకులు ఏ రాజేంద్రప్రసాదో వేసేవారేమో! 

ధర్మరాజు రాజసూయయాగానికి వచ్చిన దుర్యోధనుణ్ని ఏడిపించడానికి రిసెప్షన్‌ కమిటీలో పెట్టాడట కృష్ణుడు. ధర్మరాజు తరఫున బహుమతులు అందుకుంటూ దుర్యోధనుడు కుళ్లుకున్నాట్ట. అలా జగన్‌ యీ సభకు వచ్చి వుంటే 'ఒక్క అబద్ధం – ఋణమాఫీ చేస్తానన్న ఒక్క అబద్ధం ఆడి వుంటే యీ వైభోగమంతా నాదే అయుండేది కదా' అని తనను తాను నిందించుకుంటూ కూర్చునేవారు. జగన్‌తో వచ్చిన యిబ్బందే అది, తనకు, అధికారానికి మధ్య తన సత్యసంధతే అడ్డుపడిందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతకుమించిన కారణాలు అనేకం వున్నాయని, యిప్పటికైనా తన యిమేజిని, నాయకత్వ లక్షణాలను, వక్తృత్వాన్ని మెరుగుపరుచుకోవాలని గ్రహించరు. తన తండ్రి వారసత్వపు ఆస్తిగా ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన జగన్‌ను ఆరేళ్లగా ఆ సింహాసనం వూరిస్తూనే వుంది. దానిపై తన బద్ధశత్రువు కూర్చోవడమే కాక, కొత్త రాజధాని నిర్మించే అవకాశం దక్కించుకోవడం, ఆ సభలో నీరాజనాలు అందుకోవడం చూడడం దుస్సహం. అందుకే రానని చెప్పేశాడు. భూములు పోగొట్టుకున్న రైతుల పక్షాన పోరాడుతున్న ఇక యితర ప్రతిపక్షాలు వచ్చినా ఎబ్బెట్టుగా వుండేది. అందుకే అందరూ కలిసి లైమ్‌లైట్‌ను బాబుకి పూర్తిగా వదిలేశారు. దీపం కింద పరుచుకునేే చీకటిలో ప్రజలు మగ్గుతున్నారు. పైన వెలుతురు పెరిగినకొద్దీ కింద చీకటి మరింత చిక్కబడుతుంది. 'చీకట్లో తచ్చాడేవాళ్లు రాక్షసులు కాక మరేమవుతారు? అందుకే అలా అన్నా' అని కెసియార్‌ చంకలు గుద్దుకుంటారు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]