ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 5

ఆ ఆగ్రహానికి మేధావులు ఒక రూపం కల్పించారు. వోల్తేర్‌ తన వ్యంగ్య రచనల ద్వారా ఆనాటి వ్యవస్థలను వెక్కిరించి ప్రజలను అలరిస్తూనే వారిలో చైతన్యం పెంచాడు. మాంటెస్క్యూ తన గ్రంథాల ద్వారా అధికారాలన్నీ ఒకే…

ఆ ఆగ్రహానికి మేధావులు ఒక రూపం కల్పించారు. వోల్తేర్‌ తన వ్యంగ్య రచనల ద్వారా ఆనాటి వ్యవస్థలను వెక్కిరించి ప్రజలను అలరిస్తూనే వారిలో చైతన్యం పెంచాడు. మాంటెస్క్యూ తన గ్రంథాల ద్వారా అధికారాలన్నీ ఒకే వ్యక్తి – చక్రవర్తి, రాజు ఎవరైనా సరే – చేతిలో కేంద్రీకృతం కాకూడదని వాదించేవాడు. ప్రజాప్రతినిథులతో ఏర్పడిన సభ చట్టాలు చేస్తే, అధికారయంత్రాంగం దాన్ని అమలు చేయాలని, న్యాయశాఖ ఎవరి అజమాయిషీ లేకుండా స్వతంత్రంగా వుండాలనీ యీ వ్యవస్థలు ఒకదాన్ని మరొకటి అదుపు చేయాలని ప్రతిపాదించాడు. ఇది మధ్యతరగతి ప్రజలను ఎంతో ఆకర్షించింది. 'సోషల్‌ కాంట్రాక్ట్‌' అనే తన గ్రంథంలో రూసో రాజ్యంపై అధికారం ప్రజలదేననీ, రాజు కేవలం వారి ప్రతినిథి మాత్రమే అని, తమ మేలు కోసం పని చేయని ప్రభుత్వాలను మార్చడానికి వాళ్ల కధికారం వుంటుందని వాదించాడు. ఈ వాదనలను అనుసరించి అమెరికన్లు తమ రాజ్యాంగాన్ని రచించుకున్నారు. నిజానికి అమెరికన్‌ ప్రజలు వీరి రచనల నుండి స్ఫూర్తి పొంది బ్రిటిషువారిని ఎదిరించారు. అమెరికన్‌ విప్లవ విజయం ఫ్రెంచ్‌ ప్రజలను ఉత్తేజపరిచింది. తాము కూడా తిరగబడవచ్చని వాళ్లు అనుకున్నారు. ప్రజలలో రగులుతున్న క్రోధాగ్నిని గమనించిన జమీందార్లు తమ విధానాలను మార్చుకోవలసినది. కానీ వాళ్లు మూర్ఖంగా ప్రవర్తించారు. అణచివేతతోనే పేదలను అదుపు చేయగలమని గాఢంగా నమ్మారు.  

ఫ్రాన్సు, ఇంగ్లండు రెండూ సామ్రాజ్యవాద రాజ్యాలే. కొత్త ప్రాంతానికి వెళ్లి వలసలు స్థాపించడంలో పోటీ పడేవారు. ఇరుగుపొరుగు రాజ్యాలు కావడంతో అన్నిటా పోటీయే. జాతిపరంగా కూడా ఒకరి నొకరు నమ్మరు. వారి మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం కంటె ప్రపంచయుద్ధంగా పిలవబడదగిన సప్తసంవత్సరాల యుద్ధం (1756-63) వారి మధ్యే జరిగింది. అది అనేక దేశప్రభుత్వాల మధ్య ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో జరిగినా ప్రధాన పాత్రధారులు ఫ్రాన్సు, ఇంగ్లండులే. వీరి వైరం మన ఇండియాలో కూడా కొనసాగింది. మూడవ కర్ణాటక యుద్ధాలు అని పిలవబడే యుద్ధాలలో కొందరు రాజుల పక్షాన ఇంగ్లీషువారు, మరి కొందరు రాజుల పక్షాన ఫ్రెంచ్‌వారు నిలబడి పోరాడారు. దేశమంతా బ్రిటిషు పాలనలోకి వెళ్లినా పాండిచ్చేరి, యానాం వంటి ప్రాంతాలలో ఫ్రెంచి పాలన కొనసాగింది. అలాగే అమెరికాను వలసదేశంగా చేసుకోవడానికి కూడా ఇంగ్లండు, ఫ్రాన్సు పోటీ పడ్డాయి. అమెరికాలో వారి సైన్యాలు తలపడ్డాయి. చివరకు ఇంగ్లండుది పై చేయి అయింది. అందువలన అమెరికా ప్రజలు ఇంగ్లండుపై తిరగబడినపుడు ఫ్రాన్సు వారికి అండగా నిలబడింది. 1777 అక్టోబరులో బ్రిటిషు జనరల్‌ అమెరికన్‌ జనరల్‌కు లొంగిపోవడంతో యుద్ధ పరిస్థితి అమెరికన్లకు అనుకూలంగా మారింది. అప్పటిదాకా వేచిచూసే ధోరణిలో వున్న ఫ్రాన్స్‌, స్పెయిన్‌, నెదర్లాండ్‌ ఇంగ్లండుపై యుద్ధం ప్రకటించి అమెరికన్లకు అండగా నిలిచాయి. ఫ్రెంచ్‌ నేవీ ధాటికి తట్టుకోలేక బ్రిటిష్‌ సైన్యం 1778లో ఫిలడెల్ఫియా నుంచి తప్పుకుంది. కానీ తర్వాత కొన్ని యుద్ధాలు జయించింది. 1780లో వర్జీనియాను ఆక్రమించబోయినపుడు జార్జి వాషింగ్టన్‌ సైన్యాలకు 'రోషం బూ' నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యాలు సాయపడ్డాయి. దాంతో 1781 అక్టోబరులో బ్రిటన్‌ సైన్యం దాసోహమంది. అప్పుడు ఫ్రాన్స్‌ చొరవ తీసుకుని పారిస్‌లో ఇంగ్లండ్‌, అమెరికాల మధ్య సంధి కుదిర్చి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఏర్పడేట్లు చేసింది. ఇలాటి కారణాల చేత ఇంగ్లండు, ఫ్రాన్సు దేశస్తుల మధ్య వ్యక్తులుగా సంబంధబాంధవ్యాలు, వ్యాపారబంధాలు వున్నా అధికారపరంగా మాత్రం పరస్పరసంశయాలు తీవ్రంగా వుండేవి. 

అమెరికా యుద్ధంలో విపరీతంగా ఖర్చుపెట్టడం వలన ఫ్రాన్సులో ఆర్థికసంక్షోభం మరింత ముదిరింది. పన్నులు వేస్తే అవి కట్టలేక రైతులు పొలాలు వదిలేసి నగరాలకు పారిపోయి ముష్టెత్తసాగారు. ప్రభుత్వ అంచనాల ప్రకారమే 15 లక్షల మంది ముష్టివాళ్లుండేవారు. రైతులు యిలా వచ్చేయడంతో సాగు చేసేవారు లేక ఆహారధాన్యాలకు కరువు వచ్చింది. ఆకలితో అలమటించిన ప్రజలు దోపిడీలకు తెగబడ్డారు. శాంతిభద్రతలు ఘోరంగా క్షీణించాయి. అయినా చక్రవర్తి మేలుకోలేదు. పాత ఋణాలు తీర్చలేక, కొత్త ఋణాలు సంపాదించలేక కొత్త పన్నులు వేద్దామనుకున్నాడు. దానికి బదులు రాజాస్థానవ్యయం తగ్గించాలని సలహా యిచ్చిన మంత్రులను తీసిపారేశాడు. ఆ స్థానంలో అప్పులు చేయడంలో ఘనుడైనవాళ్లను తీసుకుని వచ్చాడు. అతనితో బాటే అతని పరిజనం కూడా. 'రొట్టె దొరక్కపోతే కేక్‌ తినవచ్చుగా' అని అతని రాణీ మేరీ యాంటెనెట్‌ అందని చెప్పుకుంటారు. ఆమె కేక్‌ అనలేదని, 'బ్రియాష్‌' అన్నదని (అదీ రొట్టె కంటె చాలా ఖరీదైనదే) దాన్ని యింగ్లీషులోకి తర్జుమా చేయడం తప్పుగా చేశారనీ కొందరంటారు. ఏది ఏమైనా పేదల బతుకుల గురించి ఆమెకు అవగాహన పూజ్యం. ఒక రాష్ట్రపు గవర్నరు తన ముందు ప్రదర్శన జరిపినవారికి 'ఆకలేస్తే వెళ్లి పొలాల్లో గడ్డి తినండి' అని దురుసుగా సలహా యిచ్చాడు. ఆకలితో, దాహంతో ప్రజలు ఎలా అలమటించారో  తన నవలలో డికెన్సు గొప్పగా వర్ణించాడు. సారాయి పీపా తీసుకెళుతున్న ఒక బండి వీధిలో గతుకుల్లో పడి పీపా బద్దలయి రోడ్డు మీదకు సారాయి కారుతుంది. అది తాగడానికి జనాలు ఎలా పరుగులు పెట్టారో, ఒకరి నొకరు ఎలా తోసుకున్నారో భీకరంగా వర్ణించాడు డికెన్సు. సారాయి ఒలికి రోడ్డు మీదున్న రాళ్ల సందుల్లోకి పారితే దాని కోసం జనాలు నాలుకలు ఆ బొరియల్లోకి దోపి రుచి చూడబోతే నాలులు కోసుకుపోయాయట. అయినా వాళ్లు మానలేదట.– (సశేషం) 

ఫోటో – పారిస్‌లోని లూర్‌ మ్యూజియంలో 14వ లూయీ విగ్రహం

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives