చిరు ఎంట్రీ రాంగా..రైటా?

మరో ఫైవ్‌మినిట్స్‌లో మూవీ ఎండ్ అవుతుందనగా ‘మెగాస్టార్’ ఎంట్రీ. ‘టైమ్ మిస్సవ్వచ్చేమోగానీ… టైమింగ్ మిస్సవన’నే స్టేట్‌మెంట్. అచ్చం అదే స్టయిలంటూ హీరోయిన్ ఉబ్బితబ్బిబ్బవడం..‘ఎలాగెలాగా?’’ అంటూ ‘చిరు’ సందడి చేయడం. ఆ తర్వాత తండ్రీ తనయుల గుర్రపుస్వారీ…

మరో ఫైవ్‌మినిట్స్‌లో మూవీ ఎండ్ అవుతుందనగా ‘మెగాస్టార్’ ఎంట్రీ. ‘టైమ్ మిస్సవ్వచ్చేమోగానీ… టైమింగ్ మిస్సవన’నే స్టేట్‌మెంట్. అచ్చం అదే స్టయిలంటూ హీరోయిన్ ఉబ్బితబ్బిబ్బవడం..‘ఎలాగెలాగా?’’ అంటూ ‘చిరు’ సందడి చేయడం. ఆ తర్వాత తండ్రీ తనయుల గుర్రపుస్వారీ దృశ్యాలు. 

రామ్‌చరణ్ లేటెస్ట్ మూవీ క్లయిమాక్స్‌లో చిరంజీవి హల్చల్ ఒక్కటే జనాలకు నచ్చింది. వ్యూయర్స్‌ని ఇట్టే ఆకట్టుకునే అనేకానేక సమీకరణాల్లో రియల్‌లైఫ్‌లోని ఫాదర్, గాడ్‌ఫాదర్స్‌తోనే రీల్‌లైఫ్ కేరెక్టర్స్ స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా ఒకటి. స్టోరీ, బ్యానర్, హీరోయిన్, డైరక్టర్‌లతోపాటు…ఈ సమీకరణ కూడా మూవీగోయర్స్ ఆకర్షించే అదనపు హంగు. అంతేకాదు..ఇండస్ట్రీలో తమ వారసుల్ని పరోక్షంగా ప్రమోట్ చేసుకోవడానికి కూడా ప్రత్యక్ష ప్రచార సాధనం. 

చిరంజీవి, ఆయన తమ్ముడు  పవన్‌కల్యాణ్…పేర్లముందు అభిమానులు ఆత్మీయంగా అభివర్ణించుకునే ‘మెగా’, ‘పవర్’ విశేషణాలు రెండింటినీ తన పేరు ముందు పెట్టుకుని ‘మెగాపవర్’గా ఆవిర్భవించిన సినీవారసుడు రామ్‌చరణ్‌తేజ. సినిమాల్లో తన లోటుని భర్తీ చేస్తోంది తన తనయుడు రామ్‌చరణ్ అనిచెప్తూ పుత్రోత్సాహంలో ఎన్నోసార్లు పొంగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే, అవకాశాలు చేజిక్కించుకుని మరీ కొడుకు చిత్రాల్లో మెరిసిమురిసిపోతుంటారాయన. గతంలో  డైరక్టర్ రాజమౌళి ‘మగధీర’లో చిరంజీవి కొద్దినిముషాలైనా తనవంతు పాత్ర పోషించారు. అది ఆ సినిమాకు ఎంతో హ్పెయింది. 

ఈ తరహా పాత్రల్లోనే కొంతమంది సీనియర్లు కొన్ని చిత్రాల్లో కనిపిస్తుండడం సినీ ఆనవాయితీగా మారింది.  జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి తీసిన ‘యమదొంగ’లో సీనియర్ ఎన్టీఆర్‌ని గ్రాఫిక్స్‌ద్వారా మిక్స్ చేసి దృశ్యాలు అప్పట్లో హైలెట్‌గా నిలిచాయి.  మాంఛిఫాంలో ఉన్నసమయంలోనే నాగార్జున సిసింద్రీ సినిమాలో కీలకమైన పాత్ర పోషించారు. ‘సిసింద్రీ’ సినిమా అఖిల్‌ని చిన్నతనంలోనే తెరకు పరిచయం చేసిన సినిమా. అక్కినేని కుటుంబనటులంతా కలిసి చేసిన ‘మనం’ సినిమాలో ఆఖరున కనిపించిన అఖిల్‌కు ఎక్కడలేని గుర్తింపు వచ్చింది.

తమ వారసుల్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఆయా సినిమాల్లో చిన్నచిన్నపాత్రల్లోనైనా కనిపించిప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడం కూడా సెక్సస్ సమీకరణాల్లో ఒకని సినీ జనం ఏనాడో గుర్తించారు.  కాగా, అదే సూత్రాన్ని ‘బ్రూస్‌లీ’ సినిమాలో కూడా ప్రయోగించారు. అయితే, ఆ ప్రయోగం ఏమేరకు ఫలితాన్నిచ్చింది?

చిరు రాంగ్ ఎంట్రీ?

‘బ్రూస్‌లీ’ సినిమాలో చిరంజీవి కనిపించకుండా ఉంటే బాగుండేదని చాలామంది అంటున్నారు. సినిమా చివర్లో వచ్చే ఈ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నా…కరడుగట్టిన ‘మెగా’భిమానులు మాత్రం ఆ సన్నివేశం కృతకంగా ఉందంటూ విశ్లేషిస్తున్నారు.  చిరంజీవి కనిపించిన ఆ కాసేపూ ధియేటర్లలో ఈలలూ…గోలలే. సిన్మాహాళ్లలోని ఈ సంరంభాన్ని కాసేపు పక్కనపెడితే…నిజంగా ‘బ్రూస్‌లీ’ సినిమాలోని  ఆ సన్నివేశం కథానుగుణంగా తప్పనిసరై మెగాస్టార్ ఉంటే కానీ ‘క్లయిమాక్స్’ పండదనిపించి, అనివార్యంగా చిరంజీవికి అందివచ్చిన వరమా? లేక, చిరంజీవిని ఎలాగోలా సినిమాలో చూపించాలనే తాపత్రయమా? లోతుగా ఆలోచిస్తే రెండోదే సరైందనిపిస్తుంది. 

ఒకే కుటుంబంలోని ఇద్దరు ప్రముఖులు ఒకే స్క్రీన్‌ని షేర్ చేసుకోవాలంటే కథ డిమాండ్ చేయాలనేవాళ్లు. అంటే…తమ ఇమేజ్‌కి తగ్గ కథ, కథనం, సన్నివేశాలు అన్నీ సమపాళ్లలో కుదిరినప్పుడే స్క్రీన్‌ని షేర్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. ఆ కోణంలోంచి చూస్తే…రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’లో చిరంజీవి తళుక్కుమనడం కచ్చితంగా రాంగ్ ఎంట్రీయేనంటున్నారు. చేతిమీద ‘బ్రూస్‌లీ’ టాటూతో డూప్‌ఫైటర్ కేరెక్టర్లో ఒదిగిపోయిన హీరో…చిట్టచివరి  సన్నివేశంలో హీరోయిన్‌ని కాపాడి…సినిమాని ‘క్లయిమాక్స్’లోకి చేర్చలేడా? కానీ, చేర్చలేదు. నూటయాభయ్యో సినిమా కథావంటకం కుదరక ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్న నేపధ్యంలో చిరంజీవి ఇమేజ్‌ని కాస్తయినా ‘బ్రూస్‌లీ’కి  అద్దాలనే ఉద్ధేశంతో అతి కృతకంగా సృష్టించిన క్లయిమాక్స్ సన్నివేశం అది అని తేలిపోయిందని చెప్తున్నారు. 

ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

అయిదు నిముషాలపాటు చిరంజీవి కనిపించినందువల్ల ‘బ్రూస్‌లీ’కి అదనపు లాభమేదైనా సమకూరిందా? అంటే,  ఒంటిచేత్తో అన్ని రీళ్లు నడిపించుకొచ్చిన రామ్‌చరణ్‌కి ఏ ప్రశంసా దక్కలేదు..సరికదా, ఆశించిస్ధాయిలో సినిమా లేదనే అపఖ్యాతి మూటగట్టుకుంది. అంతేకాదు..మేకప్‌కి దూరంగా పొలిటికల్ ఫెయిల్యూర్ సినిమాల్లో కేరెక్టర్ యాక్టర్‌గా రాణించలేకపోయిన చిరంజీవి ఎనిమిదేళ్ల తర్వాత కనిపించినందువల్లే ‘బ్రూస్‌లీ’కి ఈ మాత్రం సెక్ససైందంటే మెగాస్టార్ ‘క్రౌడ్ ఫుల్లింగ్ ఎట్రాక్షన్’ని కూడా అనుమానించాల్సి వస్తుందనే అభిప్రాయమూ వెల్లడవుతోంది. మెగాస్టార్ కేవలం కొద్దినిముషాలే కనిపించాడు కాబట్టి…ఆ సినిమా ఫెయిల్యూర్, సెక్సస్‌లతో చిరంజీవికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పుకుంటే…‘మెగాపవర్‌స్టార్’ మెడేక ఆ అపఖ్యాతి చుట్టుకుంటుంది. 

రుద్రమదేవి రిలీజైన వారానికే మెగాహీరో ‘బ్రూస్‌లీ’ వస్తోందంటే…డైరక్టర్ గుణశేఖర్ కూడా షేక్ అయ్యాడు, షాకయ్యాడు. హీరోయిన్ అనుష్కను నమ్ముకుని గతకాలపు చరిత్రాధరంగా తీసిన లేడీఓరియంటెడ్ సినిమా వసూళ్లపై నీలినీడలు కమ్ముకోవడం ఖాయమనే అభిప్రాయం వెల్లువెత్తింది. అభిరుచిగల దర్శకులకు ప్రోత్సాహంగా ‘బ్రూస్‌లీ’ని వాయిదా వేయమంటూ ఇండస్ట్రీలోని పెద్దలు దాసరినారాయణరావుతోసహా కొంతమంది నిర్మాతలు బహిరంగంగా వినతులిచ్చారు. రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రలో మెరిసిన అల్లు అర్జున్‌పై మెగాఫాన్స్ కోపం తెచ్చుకున్నారనే వార్తలు వినిపించాయి. చివరికి, అల్లు అర్జున్ కలుగజేసుకుని ట్వీట్ ద్వారా స్పందిస్తూ…‘బ్రూస్‌లీ’ రిలీజ్ డేట్ ముందుగానే ఏనాడో ప్రకటించిందని వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. విడుదలకు ముందు ఇంత హైప్ క్రియేట్ చేసి, చిరంజీవిసైతం సినిమాలో కనిపించిన ‘బ్రూస్‌లీ’ ఆశించినస్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైందంటే…సమీకరణాలు కూడా సెక్సస్‌ని శాసించలేవనే సత్యాన్ని చాటిచెప్తున్నట్లే. 

‘బ్రూస్‌లీ’ చిరు 150 సినిమానా?

అయిదు నిముషాల నిడివిలో ‘బ్రూస్‌లీ’ సినిమాలో కనిపించిన చిరంజీవి…ఈ పాత్రని పరిగణనలోనికి తీసుకుంటే ఈ సినిమాయే ఆయన 150 సినిమా అని అంటున్నారు ప్రేక్షకులు. ఇది కేవలం చిన్నపాత్రే కాబట్టి…లెక్కలోకి రాదనుకుంటే…చిరంజీవి 150 సినిమా కథ మళ్లీ మొదటికొస్తుంది. 150…అనే మెగాఇమేజ్‌తో ఓ బెంచ్‌మార్క్ సెట్ చేసినందువల్లనే…సినిమా కథ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న చిరంజీవి…ఎనిమిదేళ్ల విరామం తర్వాత ‘బ్రూస్‌లీ’లో చిన్నదైనా తన హీరోయిజం ఏమాత్రం తగ్గలేదనేవిధంగా కనిపించిన సీన్‌ని అమితంగా ప్రేమించే ఉంటారు. అంటే…ఆయన 150 సినిమా స్టోరీలో గ్లామర్ ఇమేజ్ తగ్గని కండలుతిరిగిన హీరో ఉండాల్సిందే. 

సరిగ్గా, అదే సమయంలో…పొలిటికల్ ఎంట్రీ తర్వాత పూర్తి నిడివిగల చిత్రం కాబట్టి…సామాజిక సందేశం ఇచ్చితీరాల్సిందే. ఇన్ని సమీకరణాలుంటేనే..150 సినిమా కథ ఓకే అయ్యేదని తెలుస్తోంది. కుర్రహీరోలతో పోటీపడుతూ అదే స్టామినాతో స్క్రీన్ ప్రెజెన్స్‌ని అదరగొట్టేయాలనుకున్న చిరంజీవి …తొందరపడి ‘బ్రూస్‌లీ’ ఒప్పుకోకుండా ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి, ‘బ్రూస్‌లీ’ భారం మోసిన రామ్‌చరణ్‌కి కూడా చిరంజీవి తన సినిమాలో ఈ ఎంట్రీని మొదట అంగీకరించలేదట. డైరక్టర్ శీనువైట్ల, కోనటీమ్ ఒత్తిడిమేరకు ‘ఓకే’ అన్నారట. 

నూటయాభయ్యో సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలుండడంతోపాటు, పూరీ జగన్నాథ్‌తో సహా ఎంతోమంది డైరక్టర్లు పోటీలో ఉన్నప్పుడు…పూర్తి నిడివి సినిమా కాకున్నా…కనీసం అయిదునిముషాలైనా ఎనిమిదేళ్ల విరామం తర్వాత తామే చిరంజీవిని చూపించామన్న క్రెడిట్ కోసం కృత్రిమంగా సృష్టించిన ఆ సన్నివేశం సినిమాహాల్లో ఈలలు తెప్పిస్తున్నప్పటికీ…సినిమాలో తేలిపోయిందంటున్నారు చాలామంది.

-పి.వి.డి.ఎస్.ప్రకాష్