అందరికీ రక్షణ కల్పించవలసిన అవసరం వుందని కేంద్రం నిజంగా భావిస్తే సెక్షన్ 8 పితలాటకం పెట్టకుండా హైదరాబాదును యుటీ చేయవలసినది. అలా చేయాలని చంద్రబాబు ఎప్పుడైనా అడిగారా? ఆయన పార్టీలోని ఆంధ్ర నాయకులు యిప్పుడు అంటున్నారు. అప్పట్లో ఆంధ్ర కాంగ్రెసు నాయకులు – ముఖ్యంగా చిరంజీవి – యుటీకై అడిగేవారు. అయితే ఆయన పార్టీ అధ్యకక్షురాలు సోనియా ఎప్పుడూ ఆ మాట ఎత్తలేదు. టిడిపి పార్టీలో ఆంధ్ర నాయకులు యుటీ కావాలన్నా, తెలంగాణ నాయకులు వద్దన్నా పార్టీ అధ్యకక్షుడిగా బాబు మాటే ఫైనల్. ఆ ముక్క ఆయనే పదేపదే చెప్పారు కూడా. మరి ఆయన ఆ సబ్జక్ట్‌పై నోరు విప్పకపోతే ఆంధ్ర టిడిపి నాయకులు డిమాండ్ చేయడం ఆంధ్రులను మోసపుచ్చడానికే! బాబు ఎందుకు అడగకపోవాలి? నిజానికి అడిగితే ఆంధ్ర ప్రజలందరూ సంతోషిస్తారు కదా. హైదరాబాదులోని ఆస్తులన్నీ తమవే, సంస్థలన్నీ తమవే అంటున్న తెలంగాణకు ముకుతాడు పడుతుందని తృప్తి పడతారు కదా. బాబు అప్పుడే కాదు, యిప్పుడు కూడా అడగకపోవడానికి కారణం ఏమిటంటే – తెలంగాణ ప్రజలు దాన్ని హర్షించరని, తెలంగాణలో తన పార్టీ ప్రగతి కుంటుపడుతుందని. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయనకు హైదరాబాదుపై మోజు పోనంతవరకు, తెలంగాణలో 2019లో అధికారంలోకి వచ్చేయాలన్న పేరాశ వదులుకోనంతవరకు ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతూనే వుంటుంది.
ఇప్పటికీ యుటీ చేయమని అడగరు, గవర్నరుకు విశేషాధికారాలు యివ్వాలి అని వూరుకుంటున్నారు. ఇది కూడా ఎంతకాలం అంటారో తెలియదు. ఇప్పటికే కేంద్రంలో బిజెపి జోక్యం వలన తెరాస, టిడిపి రాజీ పడ్డాయని పేపర్లు రాస్తున్నాయి. అవినీతి గురించి గర్జిస్తున్న మోదీ ఓటు-నోటు కేసులో బాబును రక్షించరని, చట్టప్రకారం పోతారని ముందులో అనుకున్నారు. అయితే యీలోగా లలిత్ మోదీ ధర్మమాని బిజెపిలోనే కొందరి పేర్లకు మసి అంటింది. వారిపై చర్య తీసుకోకుండా బాబుపైన అడుగు ముందుకు సాగని పరిస్థితి. అందువలన యీ కేసును తెగేదాకా లాగకండి అని మోదీ కెసియార్-బాబులకు సంకేతాలు పంపారట. ఫలితంగా తెరాస బాబుకు వ్యతిరేకంగా వున్న సాక్ష్యాలు బయటపెట్టటం లేదట, ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను బాబు బయటపెట్టటం లేదట. ఇది నిజమే అయితే అది కూడా ఆంధ్ర ప్రయోజనాలకు విఘాతమే. రాజీ పడడంలో బాబు ఆంధ్ర ప్రయోజనాలను దెబ్బ తీశారా అన్న సందేహం వస్తుంది. బాబు రేవంత్ అంశంలో బుఱ్ఱ బద్దలు కొట్టూ వుంటే కెసియార్ తన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు లైసెన్సు యిచ్చే అడావుడిలో వున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రకు పరిశ్రమలు తరలిపోకుండా చూసుకుంటున్నారు. బాబు ప్రత్యేక హోదా గురించి కూడా పట్టుబట్టడం మానేశారు. అది వస్తే ఏం లాభం? దాని కంటె నిధులు అడిగి తీసుకోవచ్చుగా అంటున్నారు. నిధులు – వస్తే గిస్తే – ప్రభుత్వానికి వస్తాయి, ప్రత్యేక హోదా వలన పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. అయినా నిధులు కావాలా? ప్రత్యేక హోదా కావాలా? అని బాబు అడగడం అర్థరహితం. అన్నమూ కావాలి, తినడానికి విస్తరీ కావాలి. అది యిస్తే యిది యివ్వం అని కేంద్రం బాహాటంగా చెప్పలేదు కదా. హోదా సాధించలేక మనకు నచ్చచెపుతున్న ప్రయత్నం యిది. సాధించలేకపోవడానికి కారణం ఏమిటో ఆయనకే తెలియాలి. ఇప్పుడు యిలాటి రాజీల్లో అది కూడా ఒక భాగమైతే యిక హోదా గురించి మర్చిపోవచ్చు.
ఒకలా చెప్పాలంటే తెలంగాణపై ఆశే, తెలంగాణ పరిస్థితిని అవగాహన చేసుకోకపోవడమే బాబును ముంచింది. టిడిపి మౌలిక ఆశయాలనే ఆయన విస్మరించారు. నిజానికి రాష్ట్రంలో అధికాంశం జనులు ఎప్పుడూ సమైక్యవాదాన్నే ఆదరించారు. ఒకచోట విభజన వాదం వచ్చినపుడు మరొక చోట సమైక్యవాదం వచ్చి, దాన్ని నిలవరించింది. కెసియార్ పదేళ్ల ఉద్యమం తర్వాత కూడా మూడు జిల్లాల కంటె ఎక్కువ మందిని ఒప్పించలేకపోయారు. ఇంకొకరితో పొత్తు పెట్టుకుంటే తప్ప పాతిక స్థానాలైనా గెలవలేని స్థితి తెచ్చుకున్నారు. అప్పుడు ఆయన టిడిపిలో కొందరు నాయకులను కోవర్టులుగా మార్చుకున్నారు. ఈ విషయాన్ని టిడిపి నాయకుడు దయాకరరెడ్డి మొన్న టీవీ చర్చలో చెప్పారు. తను కెసియార్‌ను పలకరించడానికి పోయినప్పుడు 'కడియం శ్రీహరితో టచ్‌లో వుండు' అని చెప్పాడని చెప్పారు. అప్పటికి కడియం టిడిపిలోనే వున్నారు. ఆయనా, ఎర్రబెల్లి తమ జిల్లాలో ప్రత్యేకవాదం బలంగా వుండడంతో బాబును విభజనకు అనుకూలంగా లేఖ యిమ్మనమని ఒత్తిడి చేయసాగారు. ప్రత్యేక తెలంగాణ అంటూ దేవేందర్ గౌడ్ వంటి పెద్ద నాయకుడు బయటకు వెళ్లి పార్టీ పెట్టినా ఎక్కడా స్పందన లేదు. లేఖ యిచ్చి తీరాలని పట్టుబట్టిన నాగం జనార్దనరెడ్డి కూడా పెద్ద నాయకుడే అనేవారు. మొన్న ఎన్నికల్లో ఆయన ఓటమి చెప్పింది – ఆయన పలుకుబడి ఎంతో! బిజెపిలో కూడా ఆయన మాట ఎవరూ వింటున్నట్టు కనబడదు. ఇలాటి వాళ్లు ఒత్తిడి చేస్తే బాబు లొంగిపోయి లేఖ యిచ్చారు. కడియం శ్రీహరి యిప్పుడు ఎక్కడ వున్నారో చూడండి. ఇన్నాళ్లూ కెసియార్ ఏజంటుగా టిడిపిని తప్పుదోవ పట్టించి యిప్పుడు వదిలేశారు. ఎర్రబెల్లి యింకా టిడిపిలోనే వున్నా, ఎప్పుడైనా పార్టీ మారవచ్చు అనే పుకార్లు వస్తూనే వున్నాయి. ఆయన గురించిన వాస్తవం కొన్నాళ్ల తర్వాత తెలియవచ్చు.
ఒకసారి లేఖ యిచ్చి వూరుకోలేదు బాబు. మేం లేఖ యిచ్చాం, మీరు యింకా ఎందుకు విభజన చేయలేదు అని కాంగ్రెసును గద్దించసాగారు. చివరకు 2009లో ప్రకటన రాగానే కంగు తిన్నారు. ఇలా చేస్తారనుకోలేదు అన్నారు. తర్వాత చాలా డ్రామా నడిచింది. కాంగ్రెసు లాగానే టిడిపి కూడా రెండు గొంతుకలతో మాట్లాడింది. ఎందుకంటే సమైక్యవాదంపై ఎన్టీయార్‌కు వున్న కన్విక్షన్ ఆయనకు లేదు. సమైక్యవాదులుగా వున్న ఎన్టీయార్, వైయస్సార్ మాత్రమే రాష్ట్రమంతా మన్ననలు పొందారు. 2004 నాటికి వైయస్సార్ మాట చెల్లుబాటు కాకపోవడం చేతనే తెరాసతో పొత్తు పెట్టుకోవలసి వచ్చింది. ఆ తర్వాత దాన్ని చీల్చి బలహీనపరచడానికి ఆయన నిరంతరం ప్రయత్నించాడు. 2009లో తెరాసతో పొత్తు పెట్టుకోమని సోనియా బలవంతం చేస్తే ఎదురు తిరిగాడు. అయినా తెలంగాణలో వైయస్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ఎన్టీయార్ వారసుడు బాబుకు సమైక్యవాదంపై కన్విక్షన్ లేకుండా రాజకీయ అవసరాలనే నమ్ముకున్నట్టు వైయస్ వారసుడు జగన్ కూడా వైయస్ సమైక్య సిద్ధాంతాన్ని గాలికి వదిలేసి రాజకీయంగా ఏ ఎత్తు వేస్తే మంచిదో ఆలోచించారు. సమైక్యవాదానికి తెలంగాణలో వున్న బలాన్ని గుర్తించకుండా తెలంగాణలో తన పార్టీ బలహీన పడుతుందేమోనన్న భయంతో అంతా కేంద్రందే భారం అంటూ పల్లవి అందుకున్నాడు తప్ప, ఎట్టి పరిస్థితిలోనూ తెలుగువారు కలిసి వుండాలి అనే మాట లేదు. చివర్లో సమైక్యవాదం అన్నా అది ఉత్తుత్తి నినాదంగానే మారింది. ఎన్నికల సమయంలో కెసియార్‌కు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం, యిప్పుడు కూడా కెసియార్ ఆంధ్రవ్యతిరేక విధానాలను ఖండించకపోవడం వలన తెరాసతో కుమ్మక్కు ముద్ర పడింది. ఇదంతా దేనికి? ఆంధ్రుల హక్కుల గురించి గట్టిగా అడిగితే తెలంగాణ ప్రజలు ఏమైనా అనుకుని పోతారేమోనన్న భయం. ప్రభుత్వంలో వున్న బాబు యిప్పటికీ తెలంగాణతో ముడి పడి వున్న చోట ఆంధ్ర ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడటం లేదు. ఈ విధంగా పాలకుడు, ప్రతిపక్ష నాయకుడు యిద్దరూ ఆంధ్ర ప్రయోజనాలపై రాజీపడడం ఆంధ్రుల దురదృష్టం.(సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)