‘సినిమాలో పాత్ర నచ్చితేనే ఏ సినిమాకి అయినా ఒప్పుకుంటాను. అంతే తప్ప అది భారీ చిత్రమనో, ఇంకొకటో కాదు..’ అంటోంది ‘స్వీటీ’ అనుష్క. తెలుగు తెరపై గ్లామరస్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క, ‘అరుంధతి’ సినిమాతో పూర్తిగా కొత్త పాత్రలోకి ఒదిగిపోయింది. అనుష్క అంటే గ్లామర్ మాత్రమే కాదు, అనుష్క అంటే ఇంకోదో.. అనే స్థాయికి అనుష్క తనను తాను మార్చుకుంది.
ప్రస్తుత తరం తెలుగు హీరోయిన్లలో ఏ హీరోయిన్‌కీ లేని స్టార్ డమ్ అనుష్క సొంతం. కేవలం అనుష్క మీదనే 50 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారంటే ఆమె స్టార్ డమ్ ఏ రేంజ్లో వుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అనుష్క మాత్రం, సినిమాల్లో భారీతనం గురించి తానెప్పుడో ఆలోచించనని చెబుతోంది. అవార్డుల కోసం తాను సినిమాలు చేయడంలేదనీ, ప్రేక్షకుల మనసుల్ని గెలవడమొక్కటే తన ఆలోచన అని అనుష్క చెప్పుకొచ్చింది.
ఇష్టపడ్డ పనిని మరింత ఇష్టంగా చేయడం ద్వారా అద్భుతాలు చేయొచ్చని తాను నమ్ముతానంటున్న అనుష్క, పదేళ్ళ కెరీర్లో తాను పాటించిన సూత్రం ఇదేనంటోంది. ‘బాహుబలి’, ‘రుద్రమదేవీ’ చిత్రాలు రెండూ తన కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమైనవనీ, ‘అరుంధతి’ సినిమా కారణంగానే తాను ఈ స్థాయిలో వున్నానని చెబుతోంది అనుష్క.
ప్రేమ, పెళ్ళి గురించి సమయమొచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటున్న అనుష్క, ఆ విషయాల గురించి బయట జరుగుతున్న ప్రచారంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.