కమిట్‌మెంట్ ఉన్నోళ్లేనా?

రాజకీయ నాయకులు నిరంతరం  భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎన్నడూ సెక్యూర్డ్‌గా ఫీలవరు. అభద్రతాభావం వెంటాడుతూనే ఉంటుంది. ఉన్న పార్టీలో ఎదుగుదల ఉంటుందా? అని ఓ పక్క ఆలోచిస్తూనే, వేరే పార్టీలోకి వెళితే ఏం…

రాజకీయ నాయకులు నిరంతరం  భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎన్నడూ సెక్యూర్డ్‌గా ఫీలవరు. అభద్రతాభావం వెంటాడుతూనే ఉంటుంది. ఉన్న పార్టీలో ఎదుగుదల ఉంటుందా? అని ఓ పక్క ఆలోచిస్తూనే, వేరే పార్టీలోకి వెళితే ఏం ప్రయోజనాలు కలుగుతాయా? అని ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ ప్రయోజనం ఉంటే అక్కడికి వెళదామనుకుంటారేగాని నిలకడగా ఒకే పార్టీలోఉండాలని అనుకోరు. తమకు రాజకీయ భిక్ష పెట్టిన, ఎదగడానికి దోహదం చేసిన, పదవులు ఇచ్చి గుర్తింపు తెచ్చిన పార్టీని కూడా విడిచిపెట్టడానికి వెనకాడరు. బూర్జువా పార్టీల్లో  ‘కమిట్‌మెంట్’  ఉన్న నేతలు చాలా తక్కువ. ఇలాంటివారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తమ కమిట్‌మెంట్ గురించి నిరంతరం ఉపన్యాసాలు దంచేవారు ఎప్పుడో ఒకప్పుడు జంప్ జిలానీలు అవుతారని అర్థం. తాజాగా అంటే మే చివరిలో  తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల ముందు పార్టీ మారి టీడీపీకి ఝలక్ ఇచ్చిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావునే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముప్పయ్ ఏళ్లుగా టీడీపీలో ఉన్న కృష్ణారావు పార్టీ మహానాడుకు కూడా హాజరై , రెండు లక్షల విరాళం ఇచ్చి, తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించారు. తాను కమిట్‌మెంట్ ఉన్న నాయకుడినని చెప్పుకున్నారు. కాని తెల్లవారే గులాబీ కండువా కప్పుకున్నారు. సీపీఎంలో పుట్టిపెరిగి, నరనరాన కమ్యూనిజాన్ని నింపుకున్న నోముల నర్సింహయ్య కూడా  గత సాధారణ ఎన్నికల సమయంలో ఇలాగే చేశారు.  ఈ వారం రోజుల్లోనే ముగ్గురు రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. కాని వారు ‘అదంతా ఉత్తుత్తి ప్రచారం’ అని ఖండించారు. అయినప్పటికీ వారిపై అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. ఆ ముగ్గురూ…కాంగ్రెసు మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ, తెలంగాణ టీడీపీ నాయకుడు, గవర్నర్ పదవిపై ఆశ పెట్టుకున్న మోత్కుపల్లి నరసింహులు, మరొకరు వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. 

కోడై కూసిన మీడియా

ఈ ముగ్గురిలో జయసుధపై ఎక్కువ ప్రచారం జరిగింది. ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మీడియా కోడై కూసింది. ఇందుకు దోహదం చేసిన సంఘటన ఆమె కుమారుడి సినిమా ఆడియో ఫంక్షన్. జయసుధ కుమారుడు శ్రేయాన్ హీరోగా నటించిన ‘బస్తీ’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు. నిజానికి ఆయన ఇలాంటి కార్యక్రమాలకు రాక చాలా కాలమైంది. పైగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లడాయి కారణంగా రాజకీయాలు బాగా హీటెక్కి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ ఆడియో ఫంక్షన్లో చాలా హుషారుగా పాల్గొన్నారు. తాను సినిమాలు చూడక చాలా కాలమైందని, ‘బస్తీ’ సినిమా తప్పకుండా చూస్తానని అన్నారు. అంతటితో ఊరుకోకుండా, ఈ సినిమాతోనే సినిమాలు చూడటం ప్రారంభిస్తానని కూడా చెప్పారు. ఇదే కార్యక్రమంలో ఫిలింనగర్2 నిర్మిస్తామని, అక్కడ ఇళ్లు కట్టుకునే సినిమా కార్మికులకు గజం రూపాయికే స్థలం ఇస్తామని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజే బస్తీ సినిమా ఆడియా రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ప్రపంచమంతా యోగా దినోత్సవం  ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోగా కేసీఆర్ దాన్నసలు పట్టించుకోలేదు. యెగా దినోత్సవాన్ని పట్టించుకోని కేసీఆర్ కాంగ్రెసు మాజీ ఎమ్మెల్యే పిలవగానే ఆ ఫంక్షన్‌కు వెళ్లారు. దీని వెనక ‘రాజకీయం’ ఉందనేది కొందరి అభిప్రాయం.

పనిచేయడం ఇష్టం లేని సహజ నటి

కాంగ్రెసు నాయకత్వానికి జయసుధ పార్టీ కోసం పనిచేయడంలేదనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. దీనికితోడు సినిమా ఫంక్షన్‌కు కేసీఆర్‌ను పిలవడంతో పుండు మీద కారం చల్లినట్లుగా అయింది. అందులోనూ ఆమె సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఇన్‌చార్జి కూడా. కాని పనిచేయడంలేదు. ఓ పక్క కాంగ్రెసు నాయకులు కేసీఆర్‌పై, ఆయన ప్రభ్వత్వంపై రెచ్చిపోతుండగా ఇన్‌చార్జిగా ఉన్న జయసుధ నిస్తేజంగా ఉంది. ఇన్‌చార్జిగా నిర్వహించాల్సిన సమావేశాలు కూడా నిర్వహించడంలేదు. రాష్ర్ట నాయకత్వం ఢిల్లీలోని అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసిందట. జయసుధపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోబోతోందని వార్తలు రావడంతోపాటు ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఆ తరువాత జయసుధ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డితో, ముఖ్యులతో మట్లాడారు. తాను ఇన్‌ఛార్జిగా పనిచేయనని, తనకు ఇంట్రెస్టు లేదని చెప్పారు. 

కాని  కాంగ్రెసును వీడే ప్రసేక్త లేదన్నారు. ఆమె ఎలా కన్విన్స్ చేసిందో తెలియదుగాని సమస్య చల్లారిపోయింది. అయితే ‘టీఆర్‌ఎస్ నుంచి ఆహ్వానం వస్తే పరిశీలిస్తా’ అని జయసుధ చెప్పిట్లుగా ఒక పత్రిక రాసింది.  జయసుధ టీఆర్‌ఎస్ వైపు చూస్తోందని ఏడాది క్రితమే ప్రచారం జరిగింది. తెర వెనక ఏం జరిగిందోగాని కాంగ్రెసులోనే ఉండిపోయింది. సినిమా రంగంలో హీరోయిన్‌గా తన శకం ముగిశాక 2004లో హైదరాబాదుకు చేరుకున్న ఆమెకు అనుకోకుండా ‘రాజకీయ’ యోగం పట్టింది. 2009 ఎన్నికల సమయంలో కొమ్ములు తిరిగిన కాంగ్రెసు నాయకులు టిక్కెట్ల కోసం నానా తిప్పలు పడుతున్న పరిస్థితిలో వైఎస్ రూపంలో అదృష్టం జయసుధ ఇంటి తలుపు తట్టింది. కాంగ్రెసు పార్టీలో చేరిపోవడం, సికింద్రాబాద్ నుంచి, ఎమ్మెల్యేగా గెలవడం కల మాదిరిగా జరిగిపోయింది.  వైఎస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం జయసుధకు టిక్కెట్టు ఇచ్చి ప్రోత్సహించాడు. ఆయన బతికుంటే ఎలా ఉండేదోగాని చనిపోవడంతో జయసుధ దిక్కులేనిదైపోయింది. సహజ నటి స్వభావం ఎవరితో కలవకపోవడం, అంటీ ముట్టనట్టుగా ఉండటం. రోజా మాదిరిగా జయసుధ యాక్టివ్ కాదు. మాట్లాడలేదు. ఆమెకు అసలు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు.   వైఎస్  పోయిన తరువాత ఏం చేయాలో తోచని జయసుధ జగన్ పంచన చేరింది. ఆయన  దీక్షలకు హాజరై మద్దతుగా మాట్లాడింది. 

కాని…జగన్ తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదని జయసుధే విలేకరులకు చెప్పింది.. ‘‘కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలం ఇంత గందరగోళాన్ని భరించలేం. పైగా నాకు రాజకీయాలు తెలియవు. హీరోయిన్‌గా ఉండి యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి వచ్చాను’’ అని చెప్పింది. జయసుధ టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమైతే కేసీఆర్ కాదనకపోవచ్చు. ఆమె ఆంధ్రా మూలాలను కూడా పట్టించుకోరు. ఆమె ఎప్పుడో హైదరాబాద్ వచ్చి స్థిరపడింది కాబట్టి ‘తెలంగాణ ఆడబిడ్డే’ అనొచ్చు. సినిమా గ్లామర్‌కు తోడు ఆమె క్రిస్టియన్ కాబట్టి అది కూడా కేసీఆర్‌కు ప్లస్ అవుతుంది. 

మోత్కుపల్లి చూపు టీఆర్‌ఎస్‌పై ఉందా?

ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా వెళతానని ఆశలు పెట్టుకున్న టీటీడీపీ నాయకుడు మోక్కుపల్లి నరసింహులు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారనే వార్తలు వచ్చాయి. మే చివరిలో జరిగిన టీడీపీ మహానాడులోనూ తనకు గవర్నర్ పోస్టు గురించి అధినేత చంద్రబాబుకు గుర్తు చేశారు మోత్కుపల్లి. టీడీపీలో రేవంత్ రెడ్డి మాదిరిగానే మోత్కుపల్లి కూడా ఫైర్‌బ్రాండే. కేసీఆర్‌పై ఒంటికాలితో లేస్తారు. కేసీఆర్ పొడ గిట్టని మోత్కుపల్లి టీఆర్‌ఎస్ వైపు దృష్టి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి ముడుపుల కుంభకోణం తరువాత తెలంగాణలో టీడీపీ ఇమేజ్‌కు బాగా దెబ్బ తగిలింది. మొన్పటివరకు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని, వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని చెప్పుకున్న టీడీపీ నాయకులు రేవంత్ రెడ్డి ఉదంతం తరువాత ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో పడిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా కనబడటంలేదు. మోత్కుపల్లికి తాను గవర్నర్ అవుతాననే ఆశలు సన్నగిల్లుతున్నాయి, ఈ విషయంలో కేంద్రం ఏమీ మాట్లాడటంలేదు. ప్రస్తుతం చంద్రబాబే చిక్కుల్లో ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ఆయన కూడా ఏమీ చేయలేరు. వరంగల్ ఎంపీగా ఉన్న మంత్రి కడియం శ్రీహరి ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్నది. టీడీపీ దాన్ని భాజపాకు వదిలేసింది. ఈ నేపథ్యంలో తనను వరంగల్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా నిలబెడితే టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నానని మోత్కుపల్లి ఆ పార్టీ నాయకులకు చెప్పారట. అయితే ఈ ప్రచారాన్ని మోత్కుపల్లి ఖండించారు. తాను టీడీపీని వీడే ప్రసేక్త లేదన్నారు. తాజాగా ఆయన సెక్షన్  వివాదంలో కూడా టీఆర్‌ఎస్‌పై ఫైర్ అయ్యారు. కాని టీఆర్‌ఎస్ మంచి ప్యాకేజి ఇస్తే కాదంటారా? 

జగన్‌తో నల్లపురెడ్డి సర్దుబాటు అయ్యారా?

ఒకప్పుడు టీడీపీలో ఉండి వైఎస్ జగన్ పంచన చేరిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాలో బలమైన నాయకుడు. ఆయన తండ్రి శ్రీనివాస రెడ్డి కూడా ఎన్‌టీఆర్ హయాంలో టీడీపీలో కీలక నాయకుడు, మంత్రిగా కూడా చేశారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని మీడియాలో తీవ్రంగా ప్రచారం జరిగింది. రాజీనామా లేఖను జగన్‌కు పంపారని కూడా వార్తలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలోని కొందరు నాయకులతో ప్రసన్నకుమార్ రెడ్డికి పడటంలేదని కొందరు చెబుతున్నారు. అదీగాక ఆయన జగన్ వైఖరితో విసిగిపోయి ఉన్నారని, పార్టీ నుంచి వెళ్లిపోవాలని చాలాకాలం నుంచి అనుకుంటున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై ఈమధ్య ప్రసన్నజగన్ మధ్య వాగ్వివాదం కూడా జరిగిందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రసన్నకుమార్ రాజీనామా చేశారంటూ రోజంతా మీడియాలో వార్తలు వచ్చాక, సాయంత్రం ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని ఆయన ప్రకటన చేవారు. తాను చివరి వరకు జగన్‌తోనే ఉంటానని కూడా చెప్పారు. వీరి కమిట్‌మెంట్ ఎంతో కాలమే చెబుతుంది.

నాగ్ మేడేపల్లి