మెంటల్ దేశం అనబడే తుగ్లక్ దేశం

అనగనగా ఒక మెంటల్ దేశం. ఆ దేశం అచ్చు భారతదేశం లాగానే ఉంటుంది. చాలామంది దాన్ని భారత దేశం అనే పొరబాటు పడుతూంటారు. కానీ దాని పేరు తుగ్లక్ దేశం. Advertisement ఆ దేశంలో…

అనగనగా ఒక మెంటల్ దేశం. ఆ దేశం అచ్చు భారతదేశం లాగానే ఉంటుంది. చాలామంది దాన్ని భారత దేశం అనే పొరబాటు పడుతూంటారు. కానీ దాని పేరు తుగ్లక్ దేశం.

ఆ దేశంలో కొంతమంది ప్రజలు తప్ప మిగతా జనాభా అంతా మెంటలే ! రాజకీయనాయకులూ, కారర్పొరేట్లూ, బ్యూరోక్రసీ, అందరూ, మెంటలే. ప్రజల్లో కూడా సగం మంది మెంటలే.

అక్కడి రాజకీయ నాయకులందరికీ రెండే టైంపాస్‌లు.

ఒకటి దేశాన్ని అడ్డంగా దోచుకోవటం. రెండోది మిగతా వాళ్ళందరి మీదా కేసులు పెట్టి తమాషా చూడటం. ఇక కార్పొరేట్స్‌కి ఒకటే టైం పాస్. రకరకాల మోసాలతో ప్రజల్ని చిత్రహింసలకు గురి చేయటం. రకరకాల విషాలు కలిపినా ఫుడ్ ఐటమ్స్ ప్రజలకు అమ్మటం. ఇక ప్రజలకు ఒకటే టైంపాస్. ఎప్పుడూ అవినీతి పరులనూ, హంతకులనూ, రేపిస్ట్‌లనూ, దోపిడీ దొంగలనే ఎన్నుకోవటం. ఎంత పెద్ద క్రిమినల్ అయితే అంత ఎక్కువ మెజారిటీతో గెలిపించటం అక్కడి ప్రజల ప్రత్యేకత.   

అలాంటి దిక్కుమాలిన  దేశంలో అనుకోకుండా ఓ సంఘటన జరిగింది.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక తుగ్లక్ దేశస్తుడిని అక్కడి తుగ్లక్ దొంగలు అయిదు డాలర్ల సెల్ ఫోన్ కోసం యాభై డాలర్లు ఖరీదు చేసే బుల్లెట్స్‌తో కాల్చి చంపేశారు. తన కొడుకు డెడ్‌బాడీని తుగ్లక్ దేశం తీసుకు రావాలని ఆ అబ్బాయి బీద తండ్రి రాష్ర్ట ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నాడు.

ఎన్ని రోజులైనా సమాధానం రాకపోయేసరికి తమ ఎమ్మెల్యే గారి దగ్గర కెళ్ళాడు.

ఎమ్మెల్యే సాబ్ లేడు అన్నాడు నౌకర్.

వచ్చేదాకా వెయిట్ చేస్తా. ఆయనతో అర్జంట్ పని ఉంది. 

ఏంది? పదేళ్ళు వెయిట్ చేస్తావా?

అదేంది? పదేళ్ళ వరకూ రాడా?  

మధ్యప్రదేశ్ ప్రభుత్వం జైల్లో కెళ్లి  వదిల్తే కదా రానికి. 

నీయవ్వ.. గిదేన్దిరా భాయ్. మన ఎమ్మెల్యే మధ్యప్రదేస్ జైల్లో ఉన్డుడేంది?  

గదేదో మధ్యప్రదేస్ అక్రమ మద్యం కేసులో ఇరికిండు గదా. 

గరీబోడు ఇక మంత్రి సాబ్ దగ్గరకు వెళ్ళాడు.

మంత్రి సాబ్ ఉన్నాడా?

ఉన్నాడు గానీ హౌస్ అరెస్ట్‌లో ఉన్నాడ్రా భాయ్. నువ్వు లోపటకు పోవద్దు. ఆయన బయటకు రావొద్దని సీబీఐ వోళ్ళు చెప్పిన్రు.

గదేంది? ఏం జరిగింది?

నీకు తెల్వదా? కోర్ట్ గట్ల రూలింగ్ ఇచ్చిందన్నట్లు.

ఏం చేసిండు సారు ?

420 కేసులుండే సార్ మీద.

గరీబోడు ఇంకో మంత్రిని కలుసుకోడానికి వెళ్ళాడు.

మంత్రి సారున్నాడా?

జైల్లో

గలత్ పని చేసిండని జైల్లో పెట్టిన్రా? 

అరే.. గది జైలు శిక్ష గాదురా.. ఆయనే పోలీసొండ్ల కాళ్ళు మొక్కి జైల్లోకి బోయిండు.

గదేంది?

అవ్ మల్లా.. లేకుంటే జైలు బయటుంటే వాని కొడుకులు, వాని భార్యలే వానిని ఖతం జేస్తార్రా భయ్.

గరీబోడు ముఖ్యమంత్రి దగ్గరకు పోయాడు.

ముఖ్యమంత్రి ఏడున్నాడ్రా భయ్. జైలుకి బోయి రెండు దినాలాయె గదా.

అదేంది సార్.. ముఖ్యమంత్రి జైలుకి పోవుడేంది? నేనెన్నడూ ఇనలే కనలే.

ఇకముందు జైలు కెళ్ళే ప్రభుత్వాలు నడుస్తాయిరా. లేదంటే దవాఖానా కెళ్లి నడుస్తాయ్. ఆఫీస్‌లలో నడవయ్.. ఎరుక లేదా నీకు?

ఆయనేం గలత్  పని జేసిండు సార్? 

ఇంకో రాష్ర్ట ముఖ్య మంత్రి ఫోన్లు టాపింగ్ చేసిండు.

గిప్పుడు నాకు దిక్కేంది సార్ మళ్లా నా కొడుకు డెడ్ బాడీ గాడ కెళ్లి రావాల్నంటే ముఖ్యమంత్రి సెంటర్ తోటి మాట్లాడాలె.

పక్కనే ఇంకో రాష్ర్ట మున్నది కదా గాడకు పో.

గరీబోడు పక్క రాష్ర్టం చేరుకున్నాడు.

ముఖ్యమంత్రిని కలవాలే సార్

అరే నీయవ్వ ఒక్క అర్థ గంట ముంగట రాకపోతివి?

గిప్పుడేమయింది సార్ ఏడకయినా టూర్ కి పాయిండా?

టూరుక్కాదురా నాయినా డైరెక్ట్‌గా జైలుకే పోయాడు

ఎందుకు సార్?       

ఎమ్మెల్యేఎమ్మెల్సీలను కిలోల లెక్క కొననికి కోషిష్ చేసిండ్రా. లోపటయి పోయిండు.

అయితే గిప్పుడు నేనేం జెయాలె సార్? ఇంకో ముఖ్య మంత్రి తానకు పోవాల్నా?

అరే ఆల్లన్దరూ జైల్లోనే ఉన్నార్రా సెంటర్‌కి పోయి మొత్తుకో

గరీబోడు ఫారిన్ అఫైర్స్ మంత్రి దగ్గరకు పోయాడు.

మంత్రి గంట ముంగటే జైలు కెళ్ళిండు బాబూ.

గదేంది సార్ ఆయన కేమాయె?   

మన తుగ్లక్ దేశాన్ని దోచుకున్న ఒక క్రిమినల్ తోటి లింక్ పెట్టు కున్నాడ్రా. పైసలు తిని వానికి సాయం జేసిండు.

అయితే ఇంకా నాకు దిక్కేంది సార్?

పోరా.. ఎంపి సార్ దగ్గరకు పో.

గరీబోడు ఎంపి ఆఫీస్‌కి చేరుకున్నాడు.

అరే మన ప్రధానమంత్రి మన దేశంలో  ఎందుకుంటాడ్రా.

మరేడుంటాడు సార్?

విదేశాల్లో సంవత్సరం కెళ్లి ఫారిన్ టూర్స్‌లోనే ఉంటుండు కదా.

ఆయనెప్పటికయినా వాపసొస్తాడా సార్?

వస్తాడు..ఎలక్షన్ ముంగట.

ఆయనొస్తే నాకు సాయం దొరుకుతదా సార్.

రాంగానే జైలుకి పోతాడ్రా భయ్.. మస్తు కేసుల్లో అరెస్ట్ వారెంట్లున్నాయ్ ఆయనమీద.

మరిప్పుడు నాకు దిక్కేంది సార్?

తూర్పు తిరిగి దణ్ణం పెట్టరా.. ఇప్పుడు మన దేశ ప్రజలందరూ అదే చేస్తున్నారుగదా టీవీలో చూడలే? దాన్నే  వరల్డ్ యోగా డే అంటార్రా.

యర్రంశెట్టి సాయి