అదృష్టం ఉంటే అన్నీ వెతుక్కుంటూ ఇంటి దగ్గరకే వస్తాయని పెద్దలు చెబుతుంటారు. అదృష్టమే అసూయపడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న ఓ నిర్ణయం తీసుకున్నారు.
కార్పొరేటర్ పదవే ఎక్కువని భావించే కరీమున్నీసాను ఏకంగా ఎమ్మెల్సీ పదవే వెతుక్కుంటూ వచ్చి వరించింది. తనకు మైనార్టీ మహిళా కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే విషయం తెలిసి …ఇది కలా? నిజమా? అని తేల్చుకోలేక కాసేపు ఆమె అయోమయానికి గురయ్యాడు.
విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌నగర్ డాబాకొట్లు ప్రాంతంలో కరీమున్నీసా కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె భర్త పేరు సలీం. ఆ దంపతులకు ఐదుగురు కుమారులు. వేర్వేరు వ్యాపారాల్లో వారంతా సెటిలయ్యారు.
చిన్న కుమారుడు రుహుల్లా వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కరీమున్నీసా కుటుంబానికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రాణం. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో 2014లో విజయవాడ నగరంలోని 54వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కరీమున్నీసా వైసీపీ తరపున బరిలో నిలిచి నెగ్గారు. అనంతరం వార్డుల పునర్విభజనలో భాగంగా 54వ డివిజన్, 59వ డివిజన్‌గా మారింది.
ప్రస్తుతం ఆమె మరోసారి ఆ డివిజన్ నుంచి వైసీపీ తరపున తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ప్రచారంలో ఉండగా ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీ పేరు ఖరారు చేశారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం.
దీంతో ఆమె నమ్మలేకపోయారు. ఇది నిజమేనా? అని మీడియాకు ఫోన్ చేసి నిర్ధారించుకున్నారు. మైనార్టీ మహిళల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన మాట నిజమేనని తెలియడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. సంతోషంలో తబ్బిబ్బయ్యారు. ఓ సామాన్య కార్యకర్త అయిన కరీమున్నీసాను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని తెలియడంతో మైనార్టీల్లో జగన్‌పై మరింత నమ్మకం, ప్రేమ పెరిగింది.
కరీమున్నీసా ఇంటికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, ముస్లిం మైనార్టీలు చేరుకుని అభినందనలతో ముంచెత్తారు. కలలో కూడా ఊహించని విధంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన జగన్‌ను తన కుటుంబంతో పాటు మైనార్టీలంతా జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని కరీమున్నీసా చెప్పుకొచ్చారు. పార్టీని, ముఖ్యమంత్రిని నమ్ముకున్న మైనార్టీలెవరికీ అన్యాయం జరగదనేందుకు తానే నిలువెత్తు నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు.