ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సిఎం కెసియార్ అంటే చాలా ఆప్యాయత చూపుతున్నాడు. రెండు రాష్ట్రాలూ సఖ్యతతో సాగడానికి కేసియార్‌కు సాదర స్వాగతం పలుకుతామని ఆయన బుధవారం ప్రకటించాడు. ఇక సాక్షాత్తూ చంద్రబాబే ఇంటికి వచ్చి పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటానంటూ కెసియార్ అమరావతి శంకుస్థాపనకు విచ్చేస్తున్నాడు.
నిజానికి వీళ్ల దోస్తీకి బీజం వేసింది ఓటుకు నోటు కేసు అనొచ్చు. దాదాపు ఇద్దరు సిఎంలూ ఒకరిపై ఒకరు తొడగొట్టినంత కోపాలు చూపించడానికి కారణమైన ఆ కేసు వీళ్లని కలిపిందా? వినడానికి వింతగా అనిపించినా కాసింత లోతుగా విశ్లేషిస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో గెలిచినా, చంద్రబాబుకు హైదరాబాద్ మీద, తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తేవడం మీద చాలా ఆసక్తి ఉండేదనేది అందరికీ తెలిసిందే. అందుకే ఆయన గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సీట్ల కొనుగోలుకు సైతం తెరలేపాడని అంటారు. ఎన్నో సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పక్క రాష్ట్రంలో ఇలాంటి పనులకు పాల్పడడం అంటే బాబుకు తెలంగాణ మీద ఇంకా వదలని ఆశకు నిదర్శనం అని చెప్పొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసియార్ కు నచ్చనిది అదే.
తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సరైన లీడర్ లేడు. ఇక వైసీపీ సోదిలోనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన ఏకైక పార్టీ తేదేపా ఆయన టార్గెట్ గా మారింది. దాన్ని ఎంత వరకూ కృంగిపోయేలా చేయాలో అంతా తెరాస చేస్తూ వస్తోందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపధ్యంలోనే బాబు తన సత్తా చూపించాలనుకుని అడుసులో కాలేశాడు. అడ్డంగా దొరికిపోయాడు.
దాంతో ఏం చేయాలో తెలీక కెసియార్ నీకూ ఎసిబి ఉంది నాకూ ఎసిబి ఉంది, నీకూ పోలీసులున్నారు నాకూ పోలీసులున్నారు హైదరాబాద్ నీదే కాదు మాది కూడా… అంటూ ఏవేవో అర్ధం పర్ధం లేని పెడబొబ్బలు పెట్టాడు. దీంతో కెసియార్ కు ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. నేను నీలాగ తప్పుడు పని చేయలేదంటూ తిట్టిపోశాడు. తప్పు చేసి అడ్డంగా దొరికి మళ్లీ మామీదే రంకెలేస్తవా అంటూ మండిపడ్డాడు.
బాబు పెడబొబ్బలతో కేసు మరింత బిగిసింది. కింది స్థాయి నేతల్ని దాటుకుంటూ బాబు గుమ్మం దాకా వచ్చేసింది. అప్పుడు మేలుకున్నాడు చంద్రబాబు. తన వంతుగా కెసియార్ మీద ఎపిలో వందల వేల కేసులంటూ భయపెడుతూనే, ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలున్నాయంటూ హెచ్చరిస్తూనే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాడు. మొత్తానికి కేసు కాస్త నిదానించేలా చేశాడు.
అయితే ఈ కేసుతో తెలివితెచ్చుకున్నాడు. ఎప్పటికైనా తన జుట్టు ఎక్కడ ఉంటుందో తెలిసిన తెలివిడి ఉంది కాబట్టి అర్జంటుగా మన ఊరుకు మనం పోదాం అంటూ మొదలెట్టాడు. దీంతో ఆఘమేఘాల మీద ఎపి కార్యకలాపాలు విజయవాడకు తరలడం మొదలయ్యింది. దీంతో తెరాస కూడా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అనే పితలాటకం ఎలా భరించాలా అని ఆలోచిస్తూ పొమ్మనకుండానే పొగబెడుతున్న వారికి ఇది ఆనందించాల్సిన అంశమే కదా.
కాగల కార్యం ఎసిబి కేసే తీర్చింది. దీంతో తెరాస ప్రభుత్వానికి కూడా చంద్రబాబు మీద సానుకూలత ఏర్పడింది. ఇచ్చి పుచ్చుకునే పంధాలో సాగిపోదామనే ఆలోచన వచ్చినట్టు కనిపిస్తోంది. పైపెచ్చు అమరావతి రాజధాని నిర్మాణం నేపధ్యంలో అక్కడ ఊపందుకునే రకరకాల కార్యకలాపాల నుంచి లాభాలను ఆశిస్తూ వ్యాపార పరంగా పాలుపంచుకునేందుకు తెరాస నేతలు ఉత్సాహం చూపుతున్నారని వినికిడి.
ఒక్కసారి వెనుతిరిగి చూస్తే… ఓటుకు నోటు కేసు అనేది చోటు చేసుకోకపోయినట్లయితే… వీరిద్దరి మధ్యా ఇంత దోస్తీ నెలకొనేది కాదని తేలుతుంది. దానికి ముందు ఏదో ఒక విషయం మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతూనే ఉండేవి. అలాంటిది ఈ కేసు తర్వాత అవి ఒక్కసారిగా ఉవ్వెత్తున్న లేచి అంతే వేగంగా చప్పబడిపోయాయి. ఇటీవల చూస్తే… అసలు దాదాపు లేవనే చెప్పాలి. దేశంలోనే ఏ ఇద్దరూ సిఎంలూ తిట్టుకోనంత ఘోరంగా తిట్టుకున్న సంఘటనలూ, ఎక్కడా కనివినీ ఎరగనంత అధికార దుర్వినియోగంతో వందల, వేల సంఖ్యలో కేసులు పెట్టిన సంఘటనలూ.. ఇంకా ఎన్నో జరిగినా… అవన్నీ వీరిద్దరికీ తమ పరిమితులు తాము తెలుసుకునేలా, ఒకరి దోస్తీ అవసరాన్ని మరొకరు కోరుకునేలా చేశాయి.