ఎన్నడూ ఎరగని ఎండల్ని చవిచూసిన ఈ ఏడాది అత్యంత అధిక ఉష్ణోగ్రతా సగటులు నమోదు చేసిన ఏడాదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానూ 2015లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయం అమెరికన్ ప్రభుత్వ శాస్త్రవేత్తల బృందం చేసిన విశ్లేషణలో వెల్లడైంది. ఈ వివరాలను ఈ బృందం బుధవారం వెల్లడించింది. ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రమాదకరస్థాయికి చేరిందనడానికి సూచిక అని శాస్త్రవేత్తల అభిప్రాయపడ్డారు.
గత 1880 నుంచి ఈ ఏడాది దాకా సెప్టెంబరు నెలలను చూస్తే… గత నెల (సెప్టెంబరు) అత్యధిక ఉష్ణోగ్రతా సగటు నమోదు చేసిన సంవత్సరంగా వీరు పేర్కొన్నారు. అదే విధంగా గత జనవరి నుంచి 7 నెలల దాకా సగటు చూసినా కూడా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతా సగటులు రికార్డయ్యాయని వివరించారు.
కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం, సహజవనరులు క్రమేపీ కనుమరుగవుతుండడం వంటి కారణాలతో సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ప్రపంచాన్ని ప్రమాదపు అంచుకు నెట్టేస్తున్నాయని ఓవైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఉన్న కొద్దో గొప్పో పచ్చదనాన్ని ఇంకా ఇంకా ధ్వంసం చేస్తూ కాంక్రీట్ జంగిల్స్ సృష్టికే పాలకులు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితుల్లో రానున్న సంవత్సరాలు వేడిమి పరంగా ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతాయో…