అతడి నుంచి అద్భుతాలొస్తాయా?

డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ ఒకప్పుడు ఏం చేసినా ఒక సంచలనం. ఇప్పుడు అతను ఏమి చేస్తున్నా కానీ దానిపై అనుమానం. కొత్త కొత్త కెమెరా ట్రిక్కులంటూ.. బడ్జెట్‌ లేని సినిమాలంటూ.. న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ…

డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ ఒకప్పుడు ఏం చేసినా ఒక సంచలనం. ఇప్పుడు అతను ఏమి చేస్తున్నా కానీ దానిపై అనుమానం. కొత్త కొత్త కెమెరా ట్రిక్కులంటూ.. బడ్జెట్‌ లేని సినిమాలంటూ.. న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటూ.. ఆక్షన్‌లో సినిమాల్ని అమ్మేస్తానంటూ.. వర్మ గిమ్మిక్కులతో పబ్లిసిటీ తెచ్చుకునేందుకు చూస్తున్నాడే తప్ప కంటెంట్‌పై కాన్సన్‌ట్రేట్‌ చేయడం లేదు. 

మదిలో లీలగా మెదిలిన ఒక ఐడియాకి సినిమా రూపం ఇచ్చేయడానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప పక్కాగా ఒక కథ రాసుకుని, సంపూర్ణమైన సినిమా తీసేందుకు చూడట్లేదు. వారం పది రోజుల్లో సినిమాల్ని చుట్టి పారేయడం… ఒకేసారి నాలుగైదు సినిమాలు తీసేస్తూ కాలక్షేపం చేయడం పరిపాటి అయిపోయింది. ఈ మైండ్‌ సెట్‌తో ఉన్న వర్మ నుంచి అద్భుతాలు ఆశించడం అత్యాశే అవుతుంది. 

ఇప్పటికే వర్మ సినిమాల్ని విజ్ఞులైన ప్రేక్షకులు లైట్‌ తీసుకుంటున్నారు. ఒకప్పుడు వర్మ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన వాళ్లే ఇప్పుడు అతని సినిమా ఎప్పుడొచ్చిందో కూడా పట్టించుకోవడం లేదు. అయినా కానీ సినిమాయే ప్రపంచంగా బ్రతికే వర్మ తన తృష్ణ తీర్చుకోడానికి ‘అనుక్షణం’ ఏదోటి చేస్తూనే ఉన్నాడు. బహుశా తన ఫోకస్‌ని వార్తల్లో ఉండడం మీద కంటే… ఒక మంచి సినిమా తీయాలనే తపనపై ఉంచడం పరిస్థితిలో మార్పు తెచ్చి.. వర్మ నుంచి కూడా ఒక చెప్పుకోతగ్గ సినిమా వస్తుందేమో!